విశాఖ ఫార్మా సిటీ ప్రమాదాల పై Mega9 ఫోకస్.!

Visakha Pharmacity: ఉమ్మడి విశాఖ జిల్లా నేడు అనకాపల్లి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పడగానే తమ బతుకులు మారుతాయి అని ఉపాధి, అభివృద్ధి తో తమ జీవనం సాఫీగా సాగిపోతుంది అనుకున్నారు. దశాబ్దాలు కాలంగా చీకట్లో మగ్గుతున్న వారికి కాంతి కిరణంలా ఫార్మాసిటీ కనిపించింది కానీ నేడు ఆ పరిస్థితి అందుకు భిన్నంగా తయారయింది తరచూ ఫార్మా ప్రమాదాలతో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఉమ్మడి విశాఖలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ పై Mega9tv ప్రత్యేక కథనం….

ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజల పాలిట ఫార్మా పరిశ్రమలు శాపంగా మారుతున్నాయి. వరస ప్రమాదాలతో నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఫార్మా ప్రమాదాలలో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం పరిపాటిగా మారింది. ఏటా లాభాల లెక్కలు వేసుకుంటున్న కంపెనీ యాజమాన్యం. ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల సంఖ్య పెరిగిపోతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను తుంగలోకి తొక్కుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఫార్మా కంపెనీల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికుల భద్రత, రక్షణపై పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలోనైనా, హెటిరో ఫార్మా పరిశ్రమలోనైనా కార్మికుల భద్రతపై యాజమాన్యాలు తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు. రెండు రోజుల క్రితం పరవాడ ఫార్మా సిటీలో విషవాయువు లీక్ అయి ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.

వరుస ప్రమాదాలతో ప్రజలను తీవ్ర భయాందోళన గురిచేశాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారి కఠిన చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతూ విచారణ చేపడుతున్న ప్రమాదాలు మాత్రం ఫార్మాసిటీలో ఆగడం లేదుని విమర్శలు వినిపిస్తున్నాయి. పరవాడ ఫార్మసిటీలో ప్రతి పరిశ్రమలో రసాయనాలు నిలువచేసే స్టోరేజ్ ట్యాంకులు ఉంటాయి. వాటిని అన్లోడ్ చేసేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు ఇక్కడి రసాయన పరిశ్రమల్లో మిథైన్, డైమిథైల్ సల్ఫేక్సైడ్ , ఐసోప్రోపైల్ , ఆల్కహాల్ , ఎసిటోన్, మిథిలిన్ డైక్లోరైడ్, టోలిన్, వంటి రసాయనాలు నిర్ణీత ఉష్ణోగ్రతల వద్ద స్టోరేజ్ చేసి తమ పరిశ్రమ అవసరాలకు ఉపయోగిస్తుంటారు. ఈ రసాయనాలు స్టోరేజ్ వ్యవహారంలో ఏ చిన్న తప్పు జరిగిన రియాక్టర్ పేలడంతో ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వీటి స్టోరేజ్ వ్యవహారంలో గాని విధినిర్వహణలో కార్మికుల సేఫ్టీ మెజర్మెంట్స్ విషయంలో ఫార్మా పరిశ్రమలు పట్టించుకోకపోవడంతోటే ఈ ప్రమాదాలకు విశాఖ పరవాడ కేరాఫ్ అడ్రస్ గా మారింది.

ఫార్మా సిటీలో ఇటీవల పేలుడు సంభవించింది. భారీగా శబ్ధం రావడంతో కార్మికులు భయంతో పరుగుతు తీశారు. రియాక్టర్‌ పేలడంతోనే ప్రమాదం జరిగినట్టు కార్మికులు చెబుతున్నారు. రియాక్టర్లు పేలకుండా ప్రెజర్‌ రిలీఫ్‌ వాల్వ్‌, రప్చర్‌ డిస్క్‌ నియంత్రిస్తాయి. ఈ రెండు సరిగా పనిచేయకపోవడంతోనే రియాక్టర్‌ పేలినట్టు పరిశ్రమలో సిబ్బంది చెబుతున్నారు. రియాక్టర్‌ పేలుడుతో విడుదలైన వాయువులు. కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. సాధారణంగా ప్రమాదకర వాయువులు వెలువడే అవకాశమున్న చోట కార్మికులకు రెస్పిరేటరీ మాస్క్‌లు ఇవ్వాలి. అయితే కార్మికులకు రెస్పిరేటరీ మాస్కులు యాజమాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

పదేళ్ల కాలంలో ఫార్మా పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయి ఆస్పత్రులు పాలవుతున్న దుస్థితి దాపరించింది. పరిశ్రమలో అన్ని ప్రమాదాలు జరుగుతున్నా… కార్మికుల భద్రత, రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కార్మిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీల ప్రమాదాలకు సంబంధించి, భద్రతా ప్రమాణాల నిర్వహణపై విచారణ బృందాలను నియమించిన ఆ మేరకు కార్మికులకు కార్మికుల భద్రత, ఫైర్‌ సేఫ్టీ, ఎలక్ట్రికల్‌ సేఫ్టీ అంశాలతో పాటు నింబంధనల అమలు తీరుపై నాలుగు నివేదికనును ఇచ్చింది. అయితే పరిశ్రమల్లో లోపాలను సరి చేసే దిశగా మాత్రం ప్రయత్నాలు చేయకపోవడంతో ప్రమాదాలు ఆగడం లేదు. Visakha Pharmacity.

సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రమాదాల్లో కార్మికులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు. ఆ తరువాత పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలుష్య నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ప్రమాదాలు పునరావృతం కాకుండా సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు. ఫార్మా కంపెనీల్లో వరస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు సమగ్ర విచారణ చేపడుతారా? లేక ఎప్పటిలాగే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హాడావడి చేసి ఊరుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే.