
CM Revanth Reddy: యూరియా సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పద్ధతిని అమలు చేయబోతోంది. వెబ్ సైట్ పద్ధతిలో యూరియాను సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు వెబ్ సైట్ లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇకపై డీలర్లు ఈ వెబ్‌సైట్ ఆధారంగానే యూరియాను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విధానాన్ని తొలిసారిగా నాగర్ కర్నూల్ జిల్లాలో అమలు చేయబోతోంది.
గత కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసు. ఒక బస్తా యూరియా కోసం కేంద్రాల వద్ద రోజుల తరబడి రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. అయినా వారికి యూరియా అందడం లేదు. ఇక కొన్నిచోట్ల అవసరం లేకున్నా వ్యాపారులు ఎరువుల్ని నిల్వ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు. దీంతో వెబ్‌సైట్ విధానం ద్వారా అవసరమైన మేర యూరియా అందించాలని నిర్ణయించారు. జిల్లాలో రైతు ఎక్కడ యూరియా తీసుకున్నా, ఎన్ని బస్తాలు తీసుకున్నా ఈవెబ్‌సైట్ ద్వారా తెలుస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లాలో వ్యవసాయ శాఖ దగ్గర 3 లక్షల 13వేల మంది రైతుల పూర్తి సమాచారం ఉంది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఈ పద్ధతి ద్వారా యూరియా ఇవ్వడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
మరి వెబ్ సైట్ ద్వారా యూరియాను ఏవిధంగా పంపిణీ చేస్తారంటే.. యూరియా డిస్ట్రిబ్యూషన్ ఇన్ నాగర్‌కర్నూల్ అనే పేరుతో ఉన్న వెబ్‌సైట్‌కు సంబంధిత అధికారులు అంటే.. డీలర్లు, ఏవోలు, ఏఈవో లకు లాగిన్లు ఇస్తారు. రైతు పేరు, పట్టాదారు పాసుబుక్, మండలం, గ్రామం, రైతు ఫోన్ నంబరు, ఎన్ని ఎకరాల పొలం ఉంది వంటి సమాచారం వ్యవసాయ శాఖ దగ్గర ఉంది. ఈ సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. మొక్కజొన్న పంటకు ఎకరాకు నాలుగు బస్తాలు, వరికి ఎకరాకు 2 బస్తాలు, మిగిలిన వాటికి ఎకరాకు ఒక్క బస్తా ప్రకారం అందులో నమోదు చేసి ఉంచుతారు. CM Revanth Reddy.
ఒక రైతుకు ఉన్న భూమి ఆధారంగా ఎన్ని బస్తాలకు అర్హుడు అనేది వెబ్ సైట్ లో ఎంటర్ చేస్తారు. దీంతో ఏ రైతు ఎన్ని బస్తాల యూరియా తీసుకెళ్లారనే డీటైల్స్ అన్నీ వెబ్ సైట్ లో డిస్ప్లే అవుతాయి. రైతులు ఏ పంటలు వేశారనే వివరాలను కూడా ఏఈవోలు ఎంటర్ చేస్తారు. దీనివల్ల రైతులు ఇష్టానుసారంగా యూరియా బస్తాలు తీసుకెళ్లే అవకాశం ఉండదు. రానున్న యాసంగిలో నాలుగు లక్షల ఎకరాల్లో పంట సాగు జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా యూరియాను సరఫరా చేయాలనే లక్ష్యంతో ఈ కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు. దీనివల్ల యూరియా పక్కదారి పట్టే అవకాశం కూడా ఉండదంటున్నారు అధికారులు.