
Prime Minister Narendra Modi: సవాళ్లు ఎంత ఉన్నా, ప్రధాని మోదీ వాటిని విజయాల మెట్లుగా మలచుకుంటూ భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైన అధ్యాయం రాస్తున్నారు. సవాళ్ల మధ్య తిరుగులేని నేతగా మోదీ ఎలా ఎదిగాడు?.. సంక్షోభాన్ని అవకాశంగా ఎలా మార్చుకున్నాడు..? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సెప్టెంబర్ 17, 2025తో 75వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ వేళ ఆయన రాజకీయ జీవితంలోనే కాకుండా దేశానికి కూడా అత్యంత కీలకమైన సంవత్సరం అని చెప్పవచ్చు. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లు, కొత్త కూటమి రాజకీయాలు, ఆర్థిక సవాళ్లు అన్ని కలిపి మోదీ ఎదుట పరీక్షల పర్వతంలా నిలిచాయి. కానీ ఆయన గత ప్రయాణం చూస్తే ప్రతీ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలచుకుని తిరిగి మరింత బలంగా ముందుకు సాగిన ఉదాహరణలు ఎక్కువగా కనిపిస్తాయి.
ఇక ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై భారీగా టారిఫ్‌లు విధించారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బ అవుతుందని చాలామంది భావించారు. కానీ మోదీ తలవంచలేదు. రైతులు, చిన్న పరిశ్రమలు, దేశ ప్రయోజనాల కోసం ఎలాంటి ఒత్తిడినైనా భరిస్తామని ఆయన ప్రకటించారు. ఆ వెంటనే మోదీ దౌత్యరంగంలో అడుగులు వేస్తూ బ్రెజిల్ అధ్యక్షుడు లులా, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో సంప్రదింపులు జరిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో ఆయన హాజరుకావడం అమెరికాను ఇబ్బందికి గురిచేసింది. ట్రంప్ చర్యలు మోదీని రష్యా–చైనా బ్లాక్ వైపు మరింత దగ్గరచేసాయని అమెరికా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ఆగస్టు 15న ఎర్రకోట నుంచి మోదీ చరిత్రాత్మక GST సవరణలను ప్రకటించారు. ఇకపై రెండు మాత్రమే ట్యాక్స్ స్లాబ్‌లు ఉంటాయి – 5 శాతం, 18 శాతం. దీని వలన దైనందిన అవసరాల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అనేక వస్తువుల ధరలు తగ్గాయి. ఈ కొత్త విధానం సెప్టెంబర్ 22 నుంచి, అంటే నవరాత్రి మొదటి రోజున అమలులోకి వస్తుంది. పండుగ సీజన్‌లో ప్రజలకు ఇది డబుల్ గిఫ్ట్‌గా మారనుంది.
2002లో చూస్తే గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీ రాజకీయ జీవితమే ప్రమాదంలో పడింది. కానీ ఆ సంక్షోభాన్ని అధిగమించి గుజరాత్‌ను అభివృద్ధి రాష్ట్రంగా నిలబెట్టారు. ఆ మోడల్ ఆయనను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అలాగే కరోనా సమయంలో కూడా విమర్శలు ఎదురైనా ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని అమలు చేసి భారత్‌ను ఆత్మనిర్భర్ వైపు నడిపించారు. 2024లో BJPకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో కూటమి ప్రభుత్వాన్ని మోదీ నడపాల్సి వచ్చింది. చాలా మంది ఇది ఆయన చివరి దశ అని భావించారు. కానీ కేవలం ఏడాదిలోనే హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో వరుస విజయాలు సాధించి విమర్శకులను ఆశ్చర్యపరిచారు. వక్ఫ్ సవరణ బిల్లు, CAA అమలు వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లడం ఆయన కూటమి రాజకీయాల్లోనూ తన దృఢత కోల్పోలేదని చూపించింది.
ఇక మూడోసారి ప్రధాని అయిన మోదీ, పాశ్చాత్య ఒత్తిడిని ఎదుర్కొంటూ గ్లోబల్ సౌత్‌కు ప్రతినిధిగా నిలిచారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపులను పట్టించుకోకుండా, భారత ప్రయోజనాలే ముఖ్యం అన్న స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఆమోద రేటింగ్ 75 శాతం దాటింది. దేశ ఆర్థిక వ్యవస్థ మూడో అతిపెద్దదిగా ఎదగబోతున్న సమయంలో మోదీకి వచ్చే ప్రతి సవాలు కొత్త అవకాశంగా మారుతోంది. చిన్నప్పటి నుంచి టీ అమ్మిన అబ్బాయి, ఇప్పుడు ప్రపంచ నేతలకు అదే టీని తన షరతులపై అందిస్తున్న స్థాయికి ఎదగడం మోదీ ప్రయాణం విశేషం. ప్రధాని 75వ జన్మదినాన్ని ఆహ్వానిస్తున్న ఈ సమయంలో, ఆయన రాజకీయ జీవితం ముగుస్తుందని ఊహించినవారి అంచనాలు విస్మృతిలో కలిసిపోయాయి. సవాళ్లు ఎంత ఉన్నా, మోదీ వాటిని విజయాల మెట్లుగా మలచుకుంటూ భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైన అధ్యాయం రాస్తున్నారు.
గుజరాత్‌లోని మెహ్సానాలో జన్మించిన ప్రధాని మోదీ.. అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా.. కనీసం రెండు పూర్తి పదవీకాలాలను పూర్తి చేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా.. సరికొత్త చరిత్రను లిఖించారు. అలాగే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరిగా చరిత్రలో నిలిచిపోయారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మోదీ.. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయలు పనిచేశారు. ఆ తర్వాత 2014 నుంచి ప్రధానమంత్రిగా ప్రజా సేవకు అంకితమయ్యారు. మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ కొనసాగుతున్నారు. వరుసగా.. గత మూడు సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (BJP) విజయాలకు ప్రధాన వ్యక్తిగా, శక్తివంతమైన నేతగా ఉన్నారు. Prime Minister Narendra Modi.
దాదాపు 24 ఏళ్ల పాటు ప్రజా సేవలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రజాదరణ ఇప్పటీకి చెక్కుచెదరలేదు.. ప్రధానమంత్రిగా రెండవసారి నిరంతరాయంగా పనిచేసినప్పటికీ, ఆయన ప్రజాదరణ ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. జూలైలో, ప్రపంచ నాయకుల ‘డెమోక్రటిక్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్’ జాబితాలో ఆయన 75 శాతంతో అగ్రస్థానంలో ఉన్నారు. గత 11 సంవత్సరాలుగా, మోదీ జాతీయ – అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ఔన్నత్వాన్ని, ప్రజా ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లారు. అంతేకాకుండా.. ప్రపంచంలోని ఎన్నో దేశాలకు సంబంధించిన అత్యున్నత పురస్కారాలను కైవసం చేసుకోవడంతోపాటు.. నేతల ప్రశంసలను అందుకున్నారు.