
Governor of Goa: ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ నాయకత్వం కీలక అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది. టీడీపీకి మరో గవర్నర్ పదవితో పాటుగా కేంద్ర ప్రభుత్వంలో కీలక నియామకాలలోనూ ఛాన్స్ కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో రెండు పదవులు దక్కించుకున్న టీడీపీ, ఇప్పుడు మరో గవర్నర్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దీంతో.. చంద్రబాబు ఈ పదవికి ఎవరిని ఖరారు చేస్తారు..అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది.
బీజేపీ నాయకత్వం మిత్రపక్షాల విషయంలో గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. త్వరలో బీహార్ .. ఆ తరువాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. టీడీపీకి కేంద్ర కేబినెట్ లో రెండు మంత్రి పదవులు దక్కాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించారు. 2014-2018 మధ్య కాలంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలో గవర్నర్ పదవి పైన హామీ దక్కింది. అయితే, అమలు కాలేదు. ఈ సారి తొలి ఏడాది పూర్తవుతూనే గవర్నర్ పదవి పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయంలో టీడీపీకి ప్రాధాన్యత కల్పిస్తూ మరో గవర్నర్ పదవి పైన హామీ దక్కినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం.
టీడీపీకి మరో గవర్నర్ పదవి పైన టీడీపీ నుంచి చంద్రబాబు ఎవరికి అవకాశం కల్పిస్తారనేది చర్చ జరుగుతోంది. అశోక్ గజపతి రాజు కు ఖరారు వేళ అనేక సమీకరణాలు కలిసి వచ్చాయి. పార్టీ ఆవి ర్భావం నుంచి ఉన్న నేత కావటంతో పాటుగా వివాద రహితుడు.. ఆయన వర్గానికి చెందిన వారికి ప్రస్తుత కేబినెట్ లో ఛాన్స్ దక్కలేదు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతగా అశోక్ గజపతి రాజు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక, బీసీ – ఎస్సీ వర్గాల నుంచి రెండో గవర్నర్ పదవి పైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత యనమల సైతం ఈ రేసులో ప్రము ఖంగా ఉన్నా .. ఆయనకు రాజ్యసభకు అవకాశం కల్పిస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో, రెండో గవర్నర్ పదవి రాయలసీమ కు చెందిన బీసీ నేతకు ఇస్తారనే వాదన వినిపిస్తోంది.
ఇక రాయలసీమ నుంచి చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ లో పని చేసి.. ఆ తరువాత టీడీపీలో అనేక కీలక పదవులు నిర్వహించిన కేఈ క్రిష్ణమూర్తి పేరు తెర మీదకు వచ్చినట్లు సమాచారం. అయితే, కేఈ కుమారుడికి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. పత్తికొండ నుంచి గెలుపొందారు. ఆ తరువాత కేఈ క్రిష్ణమూర్తి రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. 2014-19 కాలంలో డిప్యూటీ సీఎం హోదాలో కేఈ పని చేసారు. దీంతో.. ఈ సారి గవర్నర్ పదవి బీసీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతలకు రాజ్యసభ పదవి దక్కే అవకాశం ఉన్నందున, కేఈ కృష్ణమూర్తికి ఈ పదవిని ఇవ్వవచ్చని భావిస్తున్నారు. Governor of Goa.
గవర్నర్ పదవితో పాటుగా, కేంద్రంలో మరిన్ని కీలక నియామకాలలోనూ టీడీపీ నేతలకు అవకాశం లభించవచ్చని టాక్ వినిపిస్తుంది. టీడీపీ నుంచి జాబితా కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా జరగవచ్చనే ఊహాగానాలు నేపథ్యంలో, కేంద్రంలో మరో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే విషయం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామాలన్నీ టీడీపీకి ఎన్డీఏలో ఉన్న ప్రాధాన్యతను మరోసారి చాటి చెబుతున్నాయి. ఇక కేంద్రంలో మరో మంత్రి పదవి.. గవర్నర్ హోదా ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఏపీలోని కూటమి పార్టీల్లో ఆసక్తి కర చర్చగా మారుతోంది. సో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సందే…