2026 ఎన్నికల్లో టీవీకేదే గెలుపు.!

TVK Chief Vijay: టీవీకే అధినేత, విజయ్‌ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరిస్తున్నారు. ప్రత్యేక కూటమి ఏర్పాటు దిశగానూ అడుగులు వేస్తున్నారు. మరో 6 నెలల్లో తమిళనాట శాసనసభ ఎన్నికలు రానుండటంతో తిరుచ్చి నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచారం మొదలుపెట్టారు. డిసెంబరు వరకు ప్రతి శనివారం పలు జిల్లాల్లో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. సినిమాతో తనకొచ్చిన క్రేజ్‌తో యువతను ఆకర్షించడంతో పాటు ప్రస్తుతం పార్టీ సిద్ధాంతాలతో పేద, బడుగువర్గాల వారికి దగ్గరవుతున్నారు. ఇతర పార్టీలవారిని తనవైపు తిప్పుకొనేలా వ్యూహం రచించారు. డీఎంకేతోనే ఢీ కొడుతున్నారు. ప్రజా సమస్యలపై గురి పెడుతున్నారు..

బీజేపీ తమ సైద్ధాంతిక శత్రువు, డీఎంకే రాజకీయ శత్రువు’గా అభివర్ణించిన విజయ్‌.. కూటమి కడితే ఆ రెండింటికి వ్యతిరేకంగానే ఉంటుందని ఇప్పుడు ప్రకటించారు. 2026 ఎన్నికల్లో పోటీ వేరుగానే అని క్లారిటీ ఇస్తూనే తన కూటమిలో చేరేవారికి అధికార భాగస్వామ్యం అంటూ కీలక ప్రకటన చేశారు. దీంతో ఇది చాపకింద నీరులా రాజకీయ దుమారం లేపింది. పార్టీలను కుదిపేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక ఓటును కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న విజయ్‌ తనకు ప్రధాన పోటీ డీఎంకేతోనేనని ప్రకటించారు.

విజయ్ ఆ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. వరుసగా మానాడు సభలు నిర్వహిస్తూ అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం స్టాలిన్‌ను అంకుల్ అంటూ సంబంధిస్తూ కాస్త పొలిటికల్ హీట్ పెంచిన సంగతి తెలిసిందే.2026 అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ చారిత్రక విజయం సాధించడం ఖాయమని హీరో విజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమిళగ వెట్రి కళగం పార్టీ సామాజిక న్యాయం, లౌకికవాదం, సర్వమానవ సమానత్వం వంటి సూత్రాలకు కట్టుబడి ఉంటుందని విజయ్ స్పష్టం చేశారు. పెరియార్, కామరాజ్,డా.బి.ఆర్ అంబేద్కర్, వేలునాచియార్ వంటి మహనీయుల ఆశయాల స్ఫూర్తితో ముందుకు సాగుతామని అగ్రనటుడు విజయ్ పేర్కొన్నారు. 1967, 1977లో తమిళ ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చినట్టే 2026లో కూడా టీవీకే పార్టీకి ఘన విజయాన్ని అందిస్తారని హీరో విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

టీవీకే నుంచి తానే సీఎం అభ్యర్థిగా విజయ్‌ ఇది వరకే ప్రకటించుకున్నారు. ద్రావిడ రాజకీయ ప్రభంజనంగా పేరొందిన ఎంజీ రామచంద్రన్‌ లా తానూ వస్తున్నట్లు విజయ్‌ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ద్రావిడ ఓటుబ్యాంకు తన వెంట వస్తుందనే ఆశాభావంతో కదులుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ సిద్ధాంతాల్ని డిజైన్‌ చేసుకున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, లౌకికవాదం, తమిళ సంస్కృతి పరిరక్షణ, అవినీతి నిర్మూలన, మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. తందై పెరియార్‌ , రాజ్యాంగ రూపకర్త బి.ఆర్‌.అంబేడ్కర్, మాజీ సీఎం కె.కామరాజ్, స్వాతంత్య్ర సమరయోధులు రాణి వేలు నాచియార్, అంజలై అమ్మాళ్‌ తమ సైద్ధాంతిక స్ఫూర్తి అన్నారు. ‘పుట్టుకతో అందరూ సమానమే’ అంటూ ప్రతి సభలోనూ నినదిస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎండగట్టడంలో విజయ్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర తెస్తున్న త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ, సీఏఏపై కేంద్రం తీరును తప్పుపట్టడంతో పాటు రాష్ట్ర విద్యార్థులకు అవరోధంగా ఉన్న నీట్‌ పరీక్షల తీరుపై విమర్శలు సంధించారు. డీఎంకే అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక అటు పరిపాలనలో లోపాలు, లాకప్‌డెత్‌లను ఎండగడుతున్నారు. చెన్నైకి ప్రత్యామ్నాయంగా పరందూరులో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని విజయ్‌ వ్యతిరేకించి గ్రామస్థులకు అండగా నిలిచారు. ఇక చెరకు, మామిడి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్లు చేశారు. ఎన్నెల్సీ ప్రాజెక్టులో భూములు కోల్పోయినవారికి ఉద్యోగాలు, చేనేత కార్మికుల సమస్యలు తీర్చాలని కోరారు. అన్నాడీఎంకే-బీజేపీ పొత్తుపైనా వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.

ప్రచారం మొదలుపెట్టకముందు టీవీకేకు ప్రశాంత్‌కిషోర్‌ రాజకీయ సలహాదారుగా కొనసాగారు. తెలుగు మూలాలున్న ఎన్‌.ఆనంద్‌ ప్రస్తుతం విజయ్‌ వెంట నడుస్తూ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. బుస్సీ ఆనంద్‌ది ఏపీలోని ఒంగోలు. పుదుచ్చేరిలోని బుస్సీ నియోజవర్గ ఎమ్మెల్యేగా చేశారు. ప్రస్తుతం టీవీకే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జాన్‌ అరోకియా సామి, ఆదవ్‌ అర్జున లాంటివారు సైతం సలహాదారులుగా ఉన్నారు.

విజయ్‌ కూటమి పెడితే ఆయన వెంట ఎవరు వెళ్తారనేదే ఇప్పుడు ప్రధానచర్చగా నడుస్తోంది. అన్నాడీఎంకేలో భారీ చీలికలు నెలకొంటున్న నేపథ్యంగా వారంతా విజయ్‌కి మద్దతిస్తారా అనేదానిపై సమాలోచనలు నడుస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీరుసెల్వం తన మద్దతుదారులతో చర్చిస్తున్నారు. అన్నాడీఎంకేలో ఏకంగా 9వసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్‌ నేత సెంగోట్టైయ్యన్‌ తిరుగుబాటుచేయడంతో పార్టీ బహిష్కరించింది. ఈ చర్యకు చిన్న, పెద్ద కలిపి 300మంది నేతలు రాజీనామాలు చేశారు. ఆయన తాజాగా దిల్లీ వెళ్లి అమిత్‌షాను కలిశారు. తన నేతలతో విజయ్‌ వెళ్తారన్న వాదనలూ నడుస్తున్నాయి. TVK Chief Vijay.

ఎన్డీయే కూటమినుంచి బయటికొచ్చిన పార్టీ అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం. తామంటే కూటమిలో విలువలేదని ఆ పార్టీ అధినేత టీటీవీ దినకరన్‌ బహిరంగంగా వ్యాఖ్యానించారు. తమిళనాడులో విజయ్‌కు మద్దతుగా మాట్లాడుతున్న వ్యక్తుల్లో ఈయనొకరు. తప్పకుండా విజయ్‌ కూటమి కడతారని, భవిష్యత్తులో తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.