
Chittoor Gravel Mafia: అది మారుమూల ప్రాంతమైనా అక్కడ వాతావరణం మరో కోనసీమను తలపిస్తుంది. అలాగే ఎత్తైన కొండలు ఎక్కువ చల్లదనంగా ఉండే ప్రాంతాన్ని జనం మరో కేరళగా కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతం మీద కన్నేసిన గ్రావెల్ మాఫియా, అడ్డగోలుగా తవ్వేస్తోంది.అడిగేవాడు లేడన్న చందంగా రెచ్చిపోతోంది.
ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు ప్రాంతం. ప్రకృతి రమణీయతకు కేరాఫ్ అయిన ఈ ప్రాంతం మీద గ్రావెల్ మాఫియా కన్ను పడింది. గంగాధర నెల్లూరు మండలంలోని కొన్ని గ్రామాలు తమిళనాడుకు సరిహద్దులో ఉండటంతో మాఫియాకు అడ్డులేకుండా పోతోంది. ముఖ్యంగా మండలంలోని బలిజ కండ్రిగ, వనదుర్గాపురం పంచాయతీల్లో అధికంగా గ్రావెల్ గుట్టలు ఉన్నాయి. ఓ సిండికేట్ ఏర్పాటు చేసుకున్న మాఫియాగాళ్లు వీటిని తవ్వేస్తున్నారు. అధికారులు కూడా వీరి మీద చర్యలకు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. కనీసం అనుమతులు ఉన్నాయా లేవా అన్న సంగతి సదరు తహశీల్దార్ కూడా సరిగ్గా చెప్పలేని పరిస్తితి నెలకొంది.
నగిరికి చెందిన కేజే కుమార్ కుమారుడు మురళి గత వైయస్సార్ పార్టీ ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి గ్రావేల్ క్వారీ అనుమతి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన మురళి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న సంబంధాలతో వనదుర్గాపురంలో గ్రావెల్ క్వారీ ప్రారంభించారు. ఇలా రెండు పార్టీలతో సత్సంబంధాలు పెట్టుకుని ఆంధ్ర ఎర్ర బంగారాన్ని తమిళనాడుకు తరలించి జేబులు నింపుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో పాలసముద్రం మండలంలో గ్రావెల్ తవ్వకాలను స్థానికులు, చిత్తూరు జిల్లా కలెక్టర్ అడ్డుకోవడంతో మాఫియాగాళ్లు తమ మకాం ఎస్ఆర్ పురం మండలానికి మార్చేశారు. ఏలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వానికి రెవెన్యూ రాకుండా చేస్తున్నారు. నియోజకవర్గంలోని బడా నాయకులకు వాటాలిస్తూ యదేచ్చగా రెచ్చిపోతున్నారన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.
ఇక శ్రీరంగరాజపురం మండలం కన్యాపురంలో గ్రావెల్ అక్రమంగా తరలిస్తుండగా రెవిన్యూ శాఖ ఆధికారులు పట్టుకున్నారు. 17 టిప్పర్లు, 3 హిటాచీ వాహనాలు సీజ్ చేశారు. సర్వే నెంబర్ 109లోని కుమ్మరాయగుట్టలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు తహశీల్థార్ లోకనాథపిళ్ళె. గ్రామస్తుల ఫిర్యాదుతో కుమ్మరాయగుట్టను పరిశీలించామని..టిప్పర్లలో గ్రావెల్ తరలించడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు.ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా గ్రావెల్ ను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. Chittoor Gravel Mafia.
అయితే ఓపక్క హెచ్చరికలు జారీ చేస్తూ ఉండగానే మరోపక్క ఏర్ర బంగారాన్ని రాష్ట్రాలు దాటించేస్తున్నారు అక్రమార్కులు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే సైతం సైలెంట్ అవ్వడం దారుణం అంటున్నారు స్థానికులు. మరో విషయం ఏంటంటే, గ్రావెల్ మాఫియా మట్టిని తోలుతుండడాన్ని అడ్డుకున్న గ్రామస్తులపై తరలించే వ్యక్తులు దాడి చేశారు. దీనిపై మాఫియాగాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎంఎల్ఏ, అక్రమ తవ్వకాలపై మాత్రం నోరు మెదపడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు ఎర్రబంగారం అక్రమంగా తరలకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.