రియల్ స్టోరీతో రూపొందిన ‘బ్యూటీ’ సినిమా ఎలా ఉందంటే..

నటీనటులు: అంకిత్‌ కొయ్య, నీలఖి పాత్రో, నరేశ్‌ వీకే, వాసుకి, నితిన్ ప్రసన్న, ప్రసాద్ బెహ్రా, సోనియా, నందగోపాల్‌, మురళీధర్‌ గౌడ్‌ తదితరులు
నిర్మాణ సంస్థలు: ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో
నిర్మాతలు : విజయ్ పాల్ రెడ్డి అడిదాల, ఉమేష్ కుమూర్ భన్సల్
కథ, స్క్రీన్ ప్లే: ఆర్.వి. సుబ్రహ్మణ్యం
దర్శకత్వం: జె.ఎస్.ఎస్. వర్దన్
సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌
విడుదల తేది: సెప్టెంబర్‌ 19, 2025

beauty ప్రస్తుతం చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నాయి. కాస్ట్ అండ్ క్రూ కొత్తవాళ్లైనా కంటెంట్ బాగుంటే సినిమాలు ఆడుతున్నాయి. ఆ కోవలోనే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘బ్యూటీ’ అనే సినిమా. అంకిత్ కొయ్య హీరోగా నటించిన ఈ సినిమా సీనియర్ యాక్టర్స్ వీకే నరేష్, వాసుకి కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ డైరెక్టర్ మారుతి ఈ సినిమాను ప్రెజెంట్ చేయడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. మరోవైపు వైజాగ్‌లో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా సినిమాను రూపొందించామని టీమ్ చెప్పడంతో అది ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? స్టోరీ ఏంటి అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం…

కథ:

నారాయణ (వీకే నరేష్)ది మధ్యతరగతి కుటుంబం. క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంటాడు. తనకు కూతురు అలేఖ్య (నీలఖి) అంటే పంచ ప్రాణాలు. ఆమె అడిగింది కాదనకుండా కొనిస్తూ.. అందులోనే తన ఆనందాన్ని వెతుక్కుంటుంటాడు. ఇంటర్‌ చదివే నీలఖికి అనుకోకుండా పెట్‌ ట్రైనర్‌ అర్జున్‌ (అంకిత్‌)తో పరిచయం ఏర్పడుతుంది. కొంతకాలానికి ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఓ రోజు అలేఖ్య.. అర్జున్‌తో అసభ్యకరంగా వీడియో కాల్‌ మాట్లాడుతుండగా ఆమె తల్లి (వాసుకీ) చూస్తుంది. దీంతో, ఆమె చేయి చేసుకోగా అలేఖ్య కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అర్జున్‌ ఆమెను తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లడంతో.. వీళ్లిద్దర్నీ వెతుక్కుంటూ నారాయణ కూడా వెళతాడు. మరోవైపు, అమ్మాయిల్ని లైంగికంగా వేధించే ఓ ముఠా కోసం హైదరాబాద్‌ పోలీసులు గాలిస్తుంటారు. ఆ గ్యాంగ్‌లోని ఒకడు అలేఖ్యను వెంబడిస్తూనే హైదరాబాద్‌ వెళతాడు. మరి, వీళ్లంతా హైదరాబాద్‌ చేరుకున్నాక ఏం జరిగింది? ఈ ప్రేమ జంటకు.. ఆ నేర ముఠాతో విరోధమేంటి? వీళ్ల విషయంలో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? ఇంటి నుంచి వెళ్లిపోయిన అలేఖ్య చివరిగా ఇంటికి చేరుతుందా లేదా అన్నది మిగతా కథ.

విశ్లేషణ:

‘ప్రపంచం మొత్తం నీపై పగ పట్టినా.. నీకోసం ప్రాణం పెట్టి పోరాడేవాడు ఒకడుంటాడు. అతను కచ్చితంగా నాన్న అయ్యి ఉంటాడు. ప్రపంచంలో నాన్నను మించి యోధుడు లేడు’ అని సందేశం ఇచ్చిన ఓ యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ఇది. తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసే తప్పులు తల్లిదండ్రులను ఎంతటి క్షోభకు గురి చేస్తాయి? ప్రేమగా చూసుకునే పెరెంట్స్‌ని కాదని.. ‘ప్రేమ అంటే ఇదే’ అనుకొని ఇంట్లో నుంచి పారిపోయే అమ్మాయిలకు ఎలాంటి కష్టాలు ఎదురవుతాయని అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఇది అందరికి తెలిసిన కథే. నిత్యం టీవీల్లో, పేపర్లలో చూస్తున్న వార్తే. కానీ, తండ్రి ఎమోషన్‌ అనేది ఎన్నిసార్లు చూసినా.. మనసుకు హత్తుకునేలా చూపించగలిగితే మళ్లీ దానితో కనెక్ట్‌ అయిపోతాం. అందుకే దీంట్లో తెలిసిన పాయింటే ఉన్నప్పటికీ ఫాదర్‌ ఎమోషన్‌ను ఎలా డీల్‌ చేశారోనని ప్రేక్షకుడిలో ఆసక్తి కలిగింది. మధ్యతరగతి తండ్రి కథను భావోద్వేగంగా చెప్పినా.. ప్రధాన కథలో కొత్తదనం లేకపోవడం, కథనమంతా ఊహకు అందుతుంది. హీరో అరెస్టు తర్వాత పరిణామాలతో సినిమాని ఆరంభించారు. తర్వాత క్యాబ్‌ డ్రైవర్‌గా నారాయణ జీవితాన్ని.. కూతురు అలేఖ్యపై ఉన్న ప్రేమను చూపించారు. ఈతరం అమ్మాయిగా అలేఖ్య పాత్రను తీర్చిదిద్దిన తీరు, ఆమె వ్యవహార శైలి, తాను కోరింది ఇవ్వలేదని తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే విధానం.. ఇలా అన్నీ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి.

యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. ఫస్టాఫ్‌ మొత్తం మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ కష్టాలు.. తండ్రి-కూతురు బాండింగ్‌తో పాటు రొమాంటిక్‌ లవ్‌ ట్రాక్‌ని చూపించి.. సెకండాఫ్‌లో వాటిలోని గ్రే షేడ్స్‌ని చూపించారు. కథగా చూస్తే ఇది రొటీనే కానీ.. స్క్రీన్‌ప్లే మాత్రం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పిల్లలపై పెరెంట్స్‌కి ఎంత ప్రేమ ఉంటుందో తెలియజేసే సన్నివేశాలను అద్భుతంగా మలిచారు. ఇంట్లో ప్రియుడితో రొమాంటిక్‌ వీడియో కాల్‌ మాట్లాడుతుండగా.. సడెన్‌గా అమ్మ చూడడం.. పారిపోయే క్రమంలో నాన్న క్యాబ్‌ ఎక్కడం.. లాడ్జ్‌లో, గదిలో ప్రియుడితో చేసే రొమాన్స్‌ ఒకవైపు.. చిన్నప్పుడు స్నానం చేయించి నాన్న దుస్తులు వేయించే సన్నివేశం మరోవైపు.. ఇవన్నీ తెరపై చూస్తుంటే గుండె బరువెక్కడం ఖాయం. ప్రీ ఇంటర్వెల్‌ వరకు కథనం ఒకలా సాగితే.. ఆ తర్వాత మరోలా సాగుతుంది. ఫస్టాఫ్‌ కథ మొత్తం.. బేబీ, కొత్త బంగారులోకం..తదితర సినిమాల్లాగా సాగితే.. సెకండాఫ్‌ కథ.. ఆ మధ్య వచ్చిన ‘బుట్టబొమ్మ’ సినిమాను గుర్తు చేస్తుంది. ట్విస్ట్‌ తెలిసిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగదు. క్లైమాక్స్‌ కూడా రొటీన్‌గానే ఉంటుంది. అయితే సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్‌ సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. కాలేజీ అమ్మాయిలతో పాటు వారి పెరెంట్స్‌ కూడా చూడాల్సిన సినిమా ఇది. అటు పిల్లలకు, ఇటు పెరెంట్స్‌కి ఓ మంచి సందేశం ఇచ్చారు.

నటీనటుల విశ్లేషణ:
సాధారణంగా సినిమా కథ అంటే.. హీరో, హీరోయిన్‌లతో మొదలుపెడుతుంటారు. కానీ ఈ కథని హీరోయిన్ తండ్రితో మొదలుపెట్టడమే భావ్యం. ఎందుకంటే ఈ కథకి హీరో.. హీరోయిన్ తండ్రి నారాయణే. ఈ పాత్రలో సీనియర్ నటుడు వీకే నరేష్.. యోధుడిలా పెద్ద పోరాటమే చేశారు. కూతురి కళ్లల్లో ఆనందం కోసం ఏం చేయడానికైనా సిద్దపడే పాత్రలో ప్రతి తండ్రిని ఏడిపించారు నరేష్. ప్రతి కూతుర్నీ హెచ్చరించారు. ప్రేమ పేరుతో మోసం చేసే ప్రతి ప్రేమికుడ్నీ ఆలోచనలో పడేశారు. ముఖ్యంగా ఇంటర్ చదివే కూతుళ్లు ఉన్న ప్రతి పేరెంట్స్‌ని.. మీ పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి.. లేదంటే నాకు పట్టిన గతే మీకూ పట్టొచ్చు అనేంతగా వార్నింగ్ ఇచ్చారు. కూతురికి బైక్ కొనే సీన్‌లో కానీ.. కూతురు లాడ్జ్‌లో వేరొకడితో ఉందని తెలిసి పరుగుపెట్టుకుని వెళ్లే సీన్‌లో కానీ.. తన క్యాబ్‌లోనే తన కూతురు లేచిపోయిందని తెలిసే సీన్‌లో కానీ.. చివరికి తన కూతుర్ని చూడకూడని స్థితిలో చూసిన సీన్‌లో కానీ.. నరేష్ నటన అద్భుతం అనే చెప్పాలి. కూతుర్ని కన్న ప్రతి తండ్రి గుండె ఆ పాత్రను చూస్తే విలవిల్లాడిపోతుంది. అంత అద్భుతంగా చేశారు. చాలాచోట్ల ఎమోషన్స్‌తో కట్టిపడేసి ఏడిపించేశారు. అందుకే ఆయన నవరసరాయ అయ్యారు.

ఇక హీరోయిన్ తల్లిగా చేసిన వాసుకి అయితే.. మధ్యతరగతి గృహిణి పాత్రకి వన్నెతెచ్చారు. గోల్డ్ షాప్‌లో ఉంగరం కొనే సీన్ కానీ.. కూతుర్ని నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతుంటే.. అది చూసి గుండెలు పగిలేలా ఏడ్చే సీన్‌లో కానీ.. వాసుకి నటన సగటు మధ్యతరగతి తల్లి పడే ఆవేదనను కళ్లకి కట్టింది. ‘నువ్వు.. క్యాబ్ డ్రైవర్ కూతురివే.. కలెక్టర్ కూతురివి కాదు.. ఉన్నంతలో సర్దుకోవాలి’ అని సింపుల్ డైలాగ్‌లతో అటు భర్త కష్టాన్ని అర్థం చేసుకుంటూనే.. పిల్లలకు బాధ్యతల్ని గుర్తు చేసింది. కూతురు వేరే వాడితో లేచిపోయిందని తెలిసినప్పుడు ఆ తల్లి పడే వేదనని కళ్లకి కట్టారు వాసుకి.

ఇక ఈ సినిమాను నిలబెట్టిన పాత్ర నీలఖిది అనే చెప్పాలి. కాలేజీ చదువుతున్న అలేఖ్య పాత్రలో ఆమె జీవించేసింది. దర్శకుడు ఆమె పాత్రని తీర్చిదిద్దిన విధానం ఎంత గొప్పగా ఉందో.. నీలఖి కూడా అంతే గొప్పగా నటించింది. ఇంటర్‌ చదువుతున్న అమ్మాయిలకి ఆమె పాత్ర బాగా కనెక్ట్‌ అవ్వడమే కాదు..వారికొక హెచ్చరికను కూడా ఇస్తుంది. అర్జున్‌గా అంకిత్‌ కొయ్య బాగా నటించాడు. తను ఏదో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో లేడని, కొంచె ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నట్లు ఇందులో అతని క్యారెక్టర్ ఉంది. సోనియా, నందగోపాల్‌, మురళీధర్‌ గౌడ్‌, ప్రసాద్‌ బెహరతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.

సాంకేతిక విశ్లేషణ:

భలే ఉన్నాడే సినిమాతో దర్శకుడిగా మెప్పించలేకపోయిన జెఎస్ఎస్ వర్ధన్‌కి ఈ సినిమాతో పిలిచి అవకాశం ఇచ్చారు మారుతి. ఆర్.వి. సుబ్రహ్మణ్యం కథ, స్క్రీన్ ప్లే సహకారం అందించడంతో జెఎస్ఎస్ వర్ధన్‌.. యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో బోల్డ్ అటెంప్ట్ చేశారు. తండ్రిని యోధుడుగా చూపిస్తూ సందేశాన్ని కూడా ఇచ్చారు. రొటీన్ కథని డిఫరెంట్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా మలిచారు. కథని మొదలుపెట్టిన తీరు.. ముందుకు తీసుకుని వెళ్లిన విధానం.. ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. అయితే ఫస్టాఫ్ సీన్లు చూస్తే.. ఇది రొటీన్ నిబ్బా నిబ్బీ కథలకు కేరాఫ్ అడ్రస్‌లా ఉందే అని ఫీలింగ్ కలుగుతుంది. వైజాగ్‌లో ఓ క్యాబ్ డ్రైవర్ కుటుంబానికి జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా అక్కడ పని చేసిన సీనియర్ జర్నలిస్ట్ ఆర్.వి. సుబ్రహ్మణ్యం ఈ కథను తీర్చిదిద్దారు. చిన్న పాయింట్‌తో ఇంత బాగా స్క్రీన్ ప్లే రాసుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇక బేబీ సినిమాని తన పాటలతో నిలబెట్టి బ్లాక్ బస్టర్ అందించిన విజయ్ బుల్గానిన్ తన మ్యూజిక్ సెన్స్‌తో మరోసారి మ్యాజిక్ చేశారు. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాని హైప్ పిచ్‌కి తీసుకుని వెళ్లారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. కన్నమ్మా సాంగ్ అయితే అదిరింది. సినిమా మొత్తం వైజాగ్, హైదరాబాద్ సిటీలోని రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడంతో చాలా నాచురల్‌గా అనిపిస్తాయి.

చివరిగా.. ఫస్ట్ హాఫ్ సాగదీతగా సాగుతూ.. సెకెండాఫ్‌తో మెప్పిస్తుంది ఈ ‘బ్యూటీ’ మూవీ. కాలేజ్‌ స్టూడెంట్స్, వాళ్ల పేరెంట్స్ తప్పక చూడాల్సిన సినిమా beauty.