కాకపుట్టిస్తున్న కామెంట్లు..!

Rajagopal Reddy Comments: తెలంగాణాలో పరిచయం అక్కర లేని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత ఏపీ పర్యటన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఆ ఎమ్మెల్యే పర్యటనపై పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోందట. వంద కార్లు, నాలుగు వందల మంది అనుచరులతో ఓ ప్రయివేటు కార్యక్రమానికి గుంటూరులో అడుగుపెట్టిన అ ఎమ్మెల్లేకు గ్రాండ్ వెల్కం రావడంతో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, కూటమి ప్రభుత్వ అడ్డాలో వైఎస్సార్ పథకాలను పొగడటం ఏంటన్న చర్చ కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది.

సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన తీరు రేవంత్ ప్రభుత్వాన్ని కొంచెం ఇరకాటంలో పెడుతూనే ఉంది. ఇదే సమయంలో ఇప్పుడు ఏపీలో కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ పేరుతో స్థాపించిన ఫౌండేషన్ నుంచి ఏపీలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. అందులో భాగంగానే ఆయన గుంటూరు వెళ్లారు. అయితే మామూలుగా కాదు, ఏకంగా వందకార్ల కాన్వాయ్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక గుంటూరులో కూడా ఆయనకు అదే రేంజిలో స్వాగతం లభించింది. ఆ కార్యక్రమంలో విద్యార్ధులకు స్కాలర్ షిప్స్, పేదలకు సాయం అందించారు రాజగోపాల్ రెడ్డి.

ఇంత వరకూ బాగానే ఉన్నా, రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యాయి. తాను ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిన కలవడానికి వెళ్తున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారనీ, అదంతా అబద్దమంటూ చెప్పుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి. అయితే ఆ మాట పదేపదే చెప్పడంతో అందరికీ లేనిపోని అనుమానాలకు తావిచ్చిందట. ఇక గుంటూరు కార్యక్రమంలో కూడా మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని తెగపొగిడేశారు రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్ వైఎస్ శిష్యులే అంటూ చెప్పుకొచ్చిన ఆయన, వైఎస్ పథకాలు ఇప్పటికీ జనం గుండెల్లో ఉంటాయని చెప్పుకొచ్చారు. దీంతో కంగుతినడం కూటిమి నేతల పనైందట.

ఓవైపు తెలంగాణాలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న ఆయన, ఏపీలో రేవంత్ రాజకీయ గురువు చంద్రబాబును కూడా టార్గెట్ చేస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయట. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి, తన రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త వేదికను రెడీ చేసుకుంటున్నారనీ, అందులో భాగంగానే ఏపీలో వైఎస్ ప్రస్తావన తెచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇక భారీ కాన్వాయ్ ఏర్పాటు వెనుకు కూడా పొలిటికల్ రీజన్ ఉన్నట్లు తెలుస్తోంది. తన హంగు చూసి జనం రియాక్షన్ కూడా తెల్సుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారట. Rajagopal Reddy Comments.

మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కామెంట్లు తీవ్ర చర్చకు నాంది పలికాయట. అయితే ఆయన వ్యూహం ఏంటో అర్థం కావడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తుంటే, కూటమి పార్టీల లెక్కల్లో తేడా తెచ్చే ప్రయత్నమని మరికొందరు చెబుతున్నారట. ఏదేమైనా రాబోయే రోజుల్లో అన్నింటికీ సమాధానాలు తెలియడం ఖాయంగా కనిపిస్తోంది.