
Kiran Abbavaram యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గత ఏడాది ‘క’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. అంతకుమందు వరుస ఫ్లాప్స్ చవిచూసిన కిరణ్ అబ్బవరం ‘క’ లాంటి సినిమా ఎంచుకుని తన పంథా మార్చాడని అందరూ భావించారు. అయితే తన లేటెస్ట్ మూవీ ‘K-RAMP’తో అది నిజం కాదని నిరూపించడానికి సిద్ధమవుతున్నాడు కిరణ్. ‘K-RAMP’ నుంచి తాజాగా రిలీజ్ అయిన టీజర్ చూసినవాళ్లు ఇదే అభిప్రాయానికి వస్తున్నారు. కిరణ్ అబ్బవరం మళ్లీ అదే రోత సినిమాలు చేస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 2019లో వచ్చిన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. కడప జిల్లా రాయచోటికి చెందిన కిరణ్ అబ్బవరం బీటెక్ పూర్తి చేసి ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా నటుడిగా నిరూపించుకునేందుకు ప్రయత్నించాడు. మొదటి సినిమాకు మంచి పేరు రావడంతో రెండో సినిమా ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ కూడా సక్సెస్ అయింది. తర్వాత ‘సెబాస్టియన్ పీసీ524’ మూవీతో కొత్త ప్రయోగం చేశాడు. అయితే అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో మళ్లీ లవ్‌స్టోరీస్ వైపు అడుగులు వేసి ‘సమ్మతమే’, నేను మీకు బాగా కావాల్సినవాడిని, వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు చేశాడు. అయితే అన్నీ ఫ్లాప్ అవడంతో తన పంథా మార్చి ‘క’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలిచి భారీ వసూళ్లు సాధించింది. తక్కువ బడ్జెట్‌తో తీసిన క మూవీ రెట్టింపు లాభాలను తీసుకొచ్చింది.
‘క’ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం సరికొత్త కథలు ప్రయత్నిస్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే ‘క’ తర్వాత దుల్‌రుబా అనే మామూలు సినిమాను దింపాడు కిరణ్. కానీ ఈ సినిమా ‘క’ కంటే ముందే ఒప్పుకుని షూటింగ్ చేసినది కావడంతో కిరణ్ చేతుల్లో ఏమీ లేకుండా పోయింది. అయితే ‘క’ తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత వస్తున్న ‘కే-ర్యాంప్’ సినిమా మీద కిరణ్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. కానీ తాజాగా విడుదలైన కే-ర్యాంప్ టీజర్ చూస్తే ఇదో రొటీన్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందనిపిస్తోంది. టీజర్ చివరల్లో కిరణ్ తనపై తానే వేసుకున్న సెటైర్ నిజం అయ్యేలా ఉందనిపిస్తోంది. టీజర్‌లో చూపించిన ఏ సీన్ కూడా కొత్తగా లేదు. ప్రతి సీన్ ఏదో ఒక సినిమాలో చూసిన ఫీలింగ్ కలుగమానదు.
కే-ర్యాంప్ టీజర్ ప్రారంభంలోనే బూతు డైలాగ్‌తో ఎంట్రీ ఇచ్చిన కిరణ్.. తర్వాత కామెడీ, కామం సీన్స్‌తో కనిపించాడు. పాపులర్ కమెడియన్స్‌ను పెట్టేసి చుట్టేస్తే సినిమా హిట్ అయిపోతుందనే నమ్మకంతో ఈ సినిమా తీసినట్టు టీజర్‌లో కనిపిస్తోంది. పైగా హీరో తండ్రిగా డైలాగ్ కింగ్ సాయి కుమార్‌ను పెట్టడం.. ఆయనతో కామెడీ పండించాలనుకోవడం ఏంటో అర్థం కాదు. ఇక వెన్నెల కిశోర్ కామెడీ కూడా ఈమధ్య ఏ సినిమాలనూ వర్కవుట్ కావడం లేదు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. Kiran Abbavaram