
USA H1B VISA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. ఆటంబాంబు కంటే తక్కువేమీ కాదిది. ఇంతకు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి.. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగానే అమెరికాకి కలిసొస్తుందా? భారత్‌కి భారీ నష్టం కలిగిస్తుందా? ప్రపంచ దేశాల్లో ఎలాంటి మార్పు రానుంది? తెలుసుకుందాం.
ట్రంప్ ప్రభుత్వం తాజాగా అమెరికాలో అమలు చేసిన హెచ్-1బీ వీసా రుసుము పెంపు మార్పు భారతీయ ఐటీ ఉద్యోగులు, కంపెనీలు, అమెరికా ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావం చూపేలా ఉంది. హెచ్-1బీ వీసా దరఖాస్తులకు ఇకపై ప్రతి సంవత్సరం 1,00,000 డాలర్ల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. 84 లక్షల రూపాయలు. మొదటి మార్గదర్శకాలు 1,500-4,500 డాలర్ల మధ్య ఉండగా, ఈ కొత్త రుసుము దానికి భారీ పెంపు. యుఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం, ఈ మార్పు ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో విదేశీ నైపుణ్యాలను తగ్గించి, అమెరికన్ కార్మికులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జరుగుతోంది.
భారతీయ టెక్ కంపెనీలకు ఈ మార్పు పెద్ద నష్టమే అని చెప్పుకోవాలి. ఇండియా 72.6% హెచ్-1బీ వీసాలు పొందుతున్న దేశం, చైనా 12.5%తో రెండో స్థానంలో ఉంది. FY 2022లో మొత్తం 4,41,000 ఆమోదాల్లో భారతీయులకు 3,20,000 వీసాలొచ్చాయి. TCS, Infosys, Wipro, HCL వంటి కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది హెచ్-1బీ దరఖాస్తులు చేస్తాయి. ఈ రుసుము పెంపు వల్ల ప్రతి దరఖాస్తుకు 1,00,000 డాలర్లు అదనంగా ఖర్చు అవుతుంది. ఇక ఇది మల్టీ-మిలియన్ డాలర్ల నష్టానికి దారితీస్తుంది. ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అసోసియేషన్ NASSCOM ప్రకారం, ఇది కంపెనీల లాభాలను 10-15% తగ్గించవచ్చు. చిన్న సాఫ్ట్‌వేర్ సంస్థలు హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను వదిలేసి, ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్‌కు మళ్లవచ్చు. ఇది అమెరికాలో భారతీయ కంపెనీల ఆపరేషన్లను పరిమితం చేస్తుంది, ఉద్యోగాలు తగ్గుతాయి.
భారతీయ టెక్ ప్రొఫెషనల్స్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇది భారీ దెబ్బ. ఇండియా నుంచి ప్రతి సంవత్సరం 77,000 మంది కొత్త ఉద్యోగాలకు హెచ్-1బీ వీసాలు పొందుతున్నారు. ఈ రుసుము పెంపు వల్ల ఎంప్లాయర్లు తక్కువ జీతాలతో విదేశీయులను హైర్ చేయడం మానేస్తారు. (డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్) ప్రకారం, మినిమమ్ వేజ్ 60,000 నుంచి 1,50,000 డాలర్లకు పెంచుతారు. ఇది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు, మధ్యస్థ స్థాయి ఉద్యోగులకు అవకాశాలు మూసివేస్తుంది. లాటరీ సిస్టమ్‌లో వీసా పొందే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే కంపెనీలు ఖర్చు తగ్గించడానికి దరఖాస్తులను తగ్గిస్తాయి. ఫలితంగా, భారతీయ యువత యుఎస్ డ్రీమ్‌ను మరచి, కెనడా, ఐర్లాండ్, జర్మనీ వంటి దేశాలకు మళ్లే పరిస్థితులు వస్తాయి.
అమెరికా కంపెనీలకు కూడా ఇది భారం. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ జెయింట్స్ ప్రతి సంవత్సరం 5,000-12,000 హెచ్-1బీ వీసాలు ఫైల్ చేస్తాయి. రుసుము పెంచడం వల్ల వారు స్థానిక అమెరికన్స్‌ను హైర్ చేయాల్సి వస్తుంది, కానీ వారు తక్కువ జీతాలకు రారు. కాబట్టి కంపెనీలు వారిని ఎక్కువ జీతాలకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కంపెనీల ఖర్చులను 20-30% పెంచుతుంది, లాభాలు తగ్గుతాయి. ట్రంప్ ప్రకటనలో “ఇది టెక్ ఇండస్ట్రీకి సంతోషకరంగా ఉంటుంది” అని చెప్పినా, ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్ వంటి నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇలా ఇన్నోవేషన్‌ను ఆపకూడదని వారు హెచ్చరిస్తున్నారు.
అమెరికాలో స్థానికులకు ఉద్యోగాలు పెరుగుతాయా? ట్రంప్ ప్రభుత్వం ఇది అమెరికన్ వర్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేస్తుందని చెబుతోంది. కానీ, STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) రంగాల్లో అమెరికాలో నైపుణ్యాల కొరత ఉంది. NFAP (నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ) స్టడీ ప్రకారం, 20% మాత్రమే హెచ్-1బీ దరఖాస్తులు ఆమోదం పొందుతున్నాయి. స్థానికులకు అర్హతలు, కోడింగ్ స్కిల్స్ లేకపోతే, కంపెనీలకు… ఇండియా, చైనా నుంచి నైపుణ్యం ఉన్న ఉద్యోగుల తప్పకుండా అవసరం. ఈ మార్పు వల్ల టెక్ రంగంలో శూన్యతలు పెరిగి, ఆర్థిక వృద్ధి మందగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. USA H1B VISA.
ట్రంప్ నిర్ణయంతో బ్రెయిన్ డ్రెయిన్ రివర్స్ అవ్వకపోవచ్చు. కానీ యుఎస్ మార్గం మూసుకుపోతుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇండియాలోనే ఉండవచ్చు, లేదా ఐర్లాండ్, సింగపూర్ వంటి దేశాలకు వెళ్లవచ్చు. భారత్‌లో ఐటీ హబ్‌లు (హైదరాబాద్, బెంగళూరు)లో ఉద్యోగాలు పెరగవచ్చు, కానీ యుఎస్ డాలర్ జీతాలు, అనుభవం కోల్పోతారు. మొత్తంగా, ఈ రుసుము పెంపు గ్లోబల్ టాలెంట్ ఫ్లోను మార్చి, భారత-అమెరికా రిలేషన్స్‌పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. భవిష్యత్తులో ఈ పాలసీని సవాలు చేసే కేసులు రావచ్చు.