ఇక పాలస్తీనా రాజ్యం ఉండదు..!

Netanyahu’s warning to Palestine: ఇకపై పాలస్తీనా రాజ్యం ఉండబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. పాలస్తీనా రాజ్య స్థాపనకు ఆయా దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేస్తామంటూ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రకటన రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

పాలస్తీనాను దేశంగా గుర్తించడంపై ఇజ్రాయెల్​ ప్రధాని బెంజిమిన్​ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్​, ఆస్ట్రేలియా, కెనడా దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ​2023 అక్టోబర్ 7న హమాస్​ చేసిన నరమేధానికి బహుమతి ఇచ్చినట్లైందని వ్యాఖ్యానించారు. ఇకపై జోర్డాన్ నదికి పశ్చిమాన పాలస్తీనా రాజ్యం ఉండదని, తమ దేశం మధ్యలో ఒక ఉగ్రవాద రాజ్యాన్ని తమపై బలవంతంగా రుద్దడానికి జరిగిన తాజా ప్రయత్నానికి తీవ్రంగా ఖండిస్తున్నాని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రపంచం ఈ విషయంపై మా మాట వింటుందని, అమెరికా పర్యటన అనంతరం ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్​లో వీడియోను పోస్ట్ చేశారు.

ఇక ఐక్యరాజ్యసమితి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు నెతన్యాహు అమెరికా వెళ్తున్నారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌కు రావాలని నెతన్యాహుకు ట్రంప్ ఫోన్ చేసి ఆహ్వానించారు. ఇక ఇంతలోనే ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. ఇక మా దేశంలో మధ్యలో ఒక ఉగ్రవాద రాజ్యాన్ని బలవంతంగా ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు జరగనివ్వబోమన్నారు. అమెరికా నుంచి వచ్చాక దీనిపై కీలక ప్రకటన ఉంటుందని నెతన్యాహు పేర్కొన్నారు.

అసలేం జరిగింది అంటే…ఇజ్రాయెల్‌ ముమ్మర దాడులతో గాజాలో మానవతా సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. ఈ తరుణంలో బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు కీలక ప్రకటన చేశాయి. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు ఆయా దేశాల అధ్యక్షులు ప్రకటించారు. కాగా ఇప్పటికే భారత్, రష్యా, చైనా సహా 147 దేశాలు పాలస్తీనాను దేశంగా గుర్తించాయి. ఇజ్రాయెల్‌, అమెరికాకు అత్యంత సన్నిహితమైన ఈ మూడు దేశాలు పాలస్తీనాను గుర్తించడం కీలక పరిణామం. ఇక రేపు జరగనున్న ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వ ప్రతినిధుల సభలో ఫ్రాన్స్, పోర్చుగల్‌ దేశాలు కూడా గుర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోపక్క పాలస్తీనాను దేశంగా గుర్తించడంపై అమెరికా వ్యతిరేకించింది. ఒక వేళ అదే జరిగితే ఉగ్రవాద సంస్థ హమాస్‌ను బలోపేతం చేసినట్లే అవుతుందని హెచ్చరించింది. ఇటీవల బ్రిటన్‌ పర్యటనలో కూడా పాలస్తీనాను ఆమోదించాలన్న స్టార్మర్‌ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తప్పుబట్టారు.

గాజాలో రోజురోజుకీ పాలస్తీనియన్ల పరిస్థితి దిగజారుతుండటం వల్ల ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుత ఇజ్రాయెల్, గాజా, వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతాలు పాలస్తీనాగా తమ పాలనలో ఉన్నప్పుడు బ్రిటన్‌ 1917లో ఇజ్రాయెల్‌ దేశానికి మద్దతుగా బేల్ఫోర్‌ డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ ప్రకటన చేస్తూ తమ గుర్తింపు హమాస్‌ ఉగ్రవాదులకు బహుమతి కాదని శాంతికి, ద్విదేశ పరిష్కారానికి ప్రోత్సాహమని పేర్కొన్నారు. హమాస్‌ను కరడుగట్టిన ఉగ్రవాద సంస్థగా పేర్కొంటూ ఆ సంస్థపై రానున్న రోజుల్లో పలు ఆంక్షలు విధిస్తామని చెప్పారు.

అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదుల ఊచకోత తర్వాత పాలస్తీనాకు మద్దతిస్తున్నా నాయకులకు తమ దగ్గర స్పష్టమైన సందేశం ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. ఇక పాలస్తీనా రాజ్యం ఉండదని పేర్కొంది. జోర్డాన్ నదికి పశ్చిమాన పాలస్తీనా రాజ్యం ఉండబోదని ఇజ్రాయెల్ పీఎంవో స్పష్టం చేసింది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై ప్రతిస్పందన ఉంటుందని నెతన్యాహు కార్యాలయం వెల్లడిచింది.
అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఆనాటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. అయితే అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా కొంతమంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఇంకా 40, 50 మంది బందీలు హమాస్ చెరలో ఉన్నారు. ఒకేసారి విడిచిపెట్టాలని అమెరికా ఒత్తిడి చేసింది. కానీ విడిచిపెట్టలేదు. దీంతో గాజా స్వాధీనం కోసం ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. దీంతో భీకరదాడులు చేస్తోంది. ఇక ఖతార్‌లో హమాస్ నేతలు ఉన్నారన్న సమాచారంతో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. Netanyahu’s warning to Palestine.

మరో వైపు ఆస్ట్రేలియా, కెనడా, యూకేలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించడంతో పాలస్తీనాపై మోదీ ప్రభుత్వం పాలసీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. పాలస్తీనా అంశంలో గత 20 నెలలుగా కేంద్రం తీరు పిరికితనంతో కూడుకుందని విమర్శించింది. ఆస్ట్రేలియా, కెనడా, యూకేలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌ అన్నారు. త్వరలో మరిన్ని దేశాలు కూడా పాలస్తీనాను దేశంగా గుర్తిస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు. 1988 నవంబర్ 18న పాలస్తీనాకు దేశ హోదాను అధికారికంగా భారత్ గుర్తించిందని ఆయన గుర్తుచేశారు. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణను ప్రస్తావిస్తూ పాలస్తీనా విషయంలో భారత్‌ అనుసరిస్తున్న విధానం సిగ్గుచేటు, నైతిక పిరికితనంతో కూడుకుందని ఎక్స్‌లో జైరాం రమేశ్‌ విమర్శించారు. పాలస్తీనాను 37 ఏళ్ల క్రితమే భారత్ ఓ దేశంగా గుర్తించిందని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకగాంధీ అన్నారు. ఆస్ట్రేలియా, కెనడా, యూకేలు ఇప్పుడు అనుసరించాయని పేర్కొన్నారు.