
Karnataka State: దేశంలో కులాల లెక్కలు మొదలైన నాటినుంచీ ఓ సమస్య వెంటాడుతూనే ఉంది. దేంట్లోనైనా ఒక అంగీకారానికి రావచ్చు కానీ కులాల లెక్కల్లో దాన్ని ఒకపట్టాన సాధించలేం. కులాల సంఖ్యను బట్టి పదవులూ, ఉద్యోగాల్లో ఇంపార్టెంన్స్ ఇవ్వడంతో ఎక్కువైంది. తమ ప్రాతినిధ్యం ఇంకా పెరగాలని డిమాండు చేసే ప్రతి కులమూ ఏదో ఒక దశలో అధికారిక లెక్కలతో విభేదించి భిన్నగళం వినిపించటం అన్ని చోట్లా జరిగింది. దీనికి భిన్నంగా ప్రాతినిధ్యం లేని కులాలు తమ సంఖ్యాబలాల గురించి అధికార నివేదికలతో విభేదించింది చాలా తక్కువే.
ఇక ప్రయోజనాలు లేని దగ్గర వివాదాలు అంతగా రాజుకోవు. వాటాలు పెరగాలన్న పట్టుదలలు ఉన్నచోటే లెక్కలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఉన్న వాటాలు కోల్పోకూడదనే ఆరాటం ఉన్నచోటే నివేదికలపై అసంతృప్తులు వ్యక్తమవుతాయి. వీటిని సమాధానపరచి ఏకాభిప్రాయాన్ని సాధించటం కత్తిమీద సామే. కులాల లెక్కల ఆధారంగా అధికారంలో వాటాలను మార్చటమే ప్రధాన లక్ష్యంగా ప్రకటించుకున్న కాంగ్రెస్ పార్టీకి అంతా అనుకున్నట్లు సాగుతోందని చెప్పే పరిస్థితి కనపడటం లేదు.
తెలంగాణలో కులగణనను చేపట్టి, బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చట్టాలు చేసి, వాటిని అమల్లోకి తీసుకురావటానికి ఎన్ని ప్లాన్స్ చేస్తున్నా….అవసరమైన ఆమోదాలు లభించటం లేదు. పకడ్బందీ కులగణనతో వెనుకబాటుతనాన్ని ఖచ్చితంగా నిరూపించే సమాచారాన్ని సేకరించామనీ, సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి అభ్యంతరాలు వచ్చే ఛన్స్ లేదంటూ పదునుగా ఎన్ని వాదనలు చేస్తున్నా కేంద్రం వాటిని పరిగణనలోకి తీసుకుంటోందన్న సంకేతాలూ రావటం లేదు.
అయితే తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే, ఇప్పుడు మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో కులగణనపై స్టాటింగ్ లోనే వివాదాలు ముసురుకుంటున్నాయి. కోర్టుల్లో కేసులూ పడ్డాయి. తెలంగాణలో లేని విచిత్ర పరిస్థితి కర్ణాటకలో నెలకొంది. సుదీర్ఘకాలంగా రాజకీయ అధికారాన్ని చలాయిస్తున్న రెడ్డి, వెలమ కులాలకు తెలంగాణలో రిజర్వేషన్లు లేవు. కానీ కర్ణాటకలో అలా కాదు. అక్కడ రాజకీయపెత్తనం చలాయిస్తున్న లింగాయత్, వక్కలిగ కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. సొంత పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన కులగణనలోనే తమ జనాభాను తక్కువ చూపించారని ఈ రెండు కులాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయటంతో కొత్తగా సర్వే చేయాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది. మంత్రివర్గం ఆమోదించిన సర్వే నివేదికనే పక్కన పడేయాల్సిన స్థాయిలో ఒత్తిళ్లు రావటం కులాల లెక్కల చుట్టూ ఆవరించిన రాజకీయాలకు నిదర్శనం.
ఉన్న వాటాను కోల్పోకూడదనే పట్టుదలే ఈ రాజకీయాల్లో ప్రధానంగా కనపడుతుంది. కర్ణాటక CM సిద్ధరామయ్య 2013లో సామాజిక, ఆర్థిక, విద్యా సర్వేను కాంతరాజ్ సారథ్యంలోని బీసీ కమిషన్‌కు 2014లోనే అప్పగించారు. ప్రతి ఇంటికీ తిరిగి సమాచారాన్ని నమోదుచేశారు. అప్పటికి కర్ణాటకలో చేసిన సర్వేలన్నిటిలోకి కాంతరాజ్ కమిషన్ చేసినదే సమగ్రమైంది. రిపోర్టు సిద్ధమైనా దాన్ని ఆమోదించటానికీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టటానికీ రాజకీయంగా సంసిద్ధత లేకపోవటంతో అది వెలుగులోకి రాకుండానే ఉండిపోయింది. పైగా కమిషన్ సభ్య కార్యదర్శిగా ఉన్న అధికారి దానిపై సైన్ చేయటానికీ నిరాకరించారు. పైనుంచి ఆదేశాల్లేకుండా అది జరిగే ఛాన్సే లేదు. ఆ తర్వాత జయప్రకాశ్ హెగ్డే (2020–24) నేతృత్వంలోని బీసీ కమిషన్ ఆ నివేదికకు తుదిరూపం ఇచ్చి, సమాచారం మొత్తాన్ని క్రమపద్ధతిలో పెట్టి, పునఃపరిశీలన చేసి ప్రభుత్వానికి సమర్పించింది. 2025 ఏప్రిల్ 11న మంత్రివర్గం దాన్ని ఆమోదించింది. దాంతో విభేదాలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి.
అయితే లింగాయతులూ, వక్కలిగలూ అటు కాంతరాజ్ కమిషన్ లెక్కల్నీ, ఇటు హెగ్డే కమిషన్ లెక్కల్నీ అంగీకరించేది లేదని క్లారిటీ ఇచ్చారు. జనాభాలో 17 శాతం ఉంటామని లింగాయతులూ, 15 శాతం ఉంటామని వక్కలిగలూ వాదిస్తూ రెండు నివేదికలూ అశాస్త్రీయమేనని ప్రకటించారు. కాంతరాజ్, హెగ్డే కమిషన్ల నివేదికల్లో కూడా ఈ రెండు కులాల లెక్కల్లో కొంత తేడా ఉంది. లింగాయతులు 13.6%, వక్కలిగలు 12.2% ఉన్నట్లు కాంతరాజ్ కమిషన్ చెబితే, హెగ్డే కమిషన్ వాటిని 10.9%, 10%కు తగ్గించింది. ఆర్థికంగా, విద్యాపరంగా పైమెట్టున ఉన్న కుటుంబాల్లో సంతాన నియంత్రణ ఎక్కువగా ఉండటం సహజం. కానీ దాన్ని అంగీకరించటానికి లింగాయతులూ, వక్కలిగలూ సిద్ధంగా లేరు. జనాభా సంఖ్య తగ్గిందని అంగీకరిస్తే రిజర్వేషన్ల శాతాన్ని కుదించుకోవాలన్న డిమాండూ వస్తుంది. అందుకే కమిషన్ నివేదికనే తప్పులతడకగా విమర్శించారు.
కాంతరాజ్ కమిషన్ లో లింగాయతులూ, వక్కలిగలూ, లెక్కలు
17 శాతం లింగాయతుల జనాభా
15 శాతం వక్కలిగలూ జనాభా
కాంతరాజ్, హెగ్డే కమిషన్ల నివేదిక
రెండు కులాల లెక్కల్లో కొంత తేడా
లింగాయతులు 13.6 శాతం
వక్కలిగలు 12.2 శాతం
10.9, 10 శాతంకు తగ్గించిన హెగ్డే కమిషన్
ఆర్థికంగా, విద్యాపరంగా పై మెట్టు
1990లో ఏర్పాటైన జస్టిస్ చిన్నప్పరెడ్డి కమిషన్ జనాభాలో లింగాయతులు 16%, వక్కలిగలు 12% చొప్పున ఉన్నారని చెప్పి ఉద్యోగాల్లో మాత్రం ఆ రెండు కులాలకు 48% నుంచి 52% వరకూ ప్రాతినిధ్యం ఉందని తెలిపింది. ఈ అతి ప్రాతినిధ్యాన్ని తగ్గించటానికి ఆ కులాలకు 5%, 4% చొప్పున రిజర్వేషన్లు సరిపోతాయని సిఫార్సు చేసింది. ఇరు కులాల జనాభా తగ్గిందని చెప్పిన హెగ్డే కమిషన్ రిజర్వేషన్ల విషయంలో ఉదారతనే చూపించింది. 8%, 7% చొప్పున రిజర్వేషన్లను ఇవ్వాలని సూచించింది. అయినా సంతృప్తి చెందలేదు. పోనీ రాజకీయాధికారం పరంగా ఈ రెండు వర్గాలకు తక్కువ ప్రాతినిధ్యం ఉందా? అంటే అలాంటిదేమీ కనపడదు.
1990లో ఏర్పాటైన జస్టిస్ చిన్నప్ప రెడ్డి కమిషన్
జానభా లెక్కలో లింగాయతులు 16 శాతం
వక్కలిగలు 12 శాతం
48శాతం నుంచి 52 శాతం ప్రాతినిధ్యం
2 కులాలకు 5 శాతం రిజర్వేషన్ల సిఫార్సు
ఇరు కులాల జనాభా తగ్గిందని చెప్పిన హెగ్డే
కమిషన్ రిజర్వేషన్ల విషయంలో ఉదారత
8 శాతం చొప్పున రిజర్వేషన్లు ఇవ్వాలని సూచన
224 మంది ఎమ్మెల్యేలు ఉన్న శాసనసభలో లింగాయతులు 56 మంది, వక్కలిగలు 46 మంది ఉన్నారు. అంటే అసెంబ్లీలో 45.5% సీట్లు ఈ రెండు కులాల చేతుల్లోనే ఉన్నాయి. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పరిధిలోకి రాని లింగాయతులు, వక్కలిగల సంఖ్య చాలా తక్కువ. హెగ్డే కమిషన్ బీసీల రిజర్వేషన్లను 32% నుంచి 51 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది. ఈ 51% లోనే ముస్లింల రిజర్వేషన్లూ ఉన్నాయి. అవి 4% నుంచి 8% పెంచాలని ప్రతిపాదించారు. ఇక ఎస్సీ (17%), ఎస్టీలకు (7%) 2022లోనే వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచారు. మొత్తంమీద రిజర్వేషన్లను 75 శాతానికి హెగ్డే కమిషన్ తీసుకువెళ్లింది. ఇవి కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మరో 10 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అన్నీ కలుపుకొంటే రిజర్వేషన్లు 85 శాతం అయ్యే అవకాశం ఉంది. అయినా చల్లారని అసంతృప్తులతో, కోట్లు ఖర్చుతో తయారైన కాంతరాజ్, హెగ్డే కమిషన్ల నివేదికలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఇప్పుడు మరో సర్వే ఆరంభమైంది. ఇది పూర్తయి నివేదిక వచ్చినా అది అందరికీ ఆమోదం అవుతుందన్న పూచీలేదు.
224 మంది ఎమ్మెల్యేలు ఉన్న శాసనసభ
56 మంది లింగాయతులు, 46 మంది వక్కలిగలు
అసెంబ్లీలో 45.5% సీట్లు
32% నుంచి 51 శాతానికి పెంచాలని సిఫార్సు
51% లోనే ముస్లింల రిజర్వేషన్లు
4% నుంచి 8% పెంచాలని ప్రతిపాదన
75 శాతం రిజర్వేషన్లు
వెనుకబడిన వర్గాలకు మరో 10 శాతం రిజర్వేషన్లు
హెగ్డే కమిషన్ నివేదిక ప్రకారం చూస్తే రిజర్వేషన్లకు వెలుపల ఉండే జనాభా సంఖ్య ఎక్కువగా ఉండదు. అందులో 17.7 లక్షల మంది ఉన్న బ్రాహ్మణులదే సింహభాగం. రెడ్లు కూడా కర్ణాటకలో ఓబీసీ జాబితాలోనే ఉన్నారు. 10 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలనూ ఒక రాజ్‌పుత్ ఎమ్మెల్యేనూ మాత్రమే అగ్రకుల ప్రజాప్రతినిధుల జాబితాలో వేయగలం. రెడ్డి ఎమ్మెల్యేలు ఏడుగురున్నా వారు ఆ జాబితాలోకి వస్తారని చెప్పలేం. బ్రాహ్మణ, కమ్మ, మార్వాడీ, ఆంగ్లో ఇండియన్లు మాత్రమే రిజర్వేషన్ల వెలుపల ఉన్నారు. తెలుగు మాట్లాడే ఆర్యవైశ్యులు కూడా ఓబీసీ జాబితాలో ఉన్నారు. ఐశ్వర్యారాయ్, శిల్పాషెట్టీ, సునీల్‌షెట్టీ, రక్షిత్‌షెట్టీ, రిషబ్‌షెట్టీ, అనూష్కాషెట్టీ, కె.ఎల్.రాహుల్, టి.ఎ.పాయ్ , టి.ఎం.ఎ. పాయ్ లాంటి ప్రముఖులు బంట్ కులానికి చెందినవారు. ఈ కులం కూడా ఓబీసీ జాబితాలోనే ఉంది. కర్ణాటక కోస్తా ప్రాంతంలో బంట్ కులస్థులు సామాజికంగా పైస్థానంలో ఉంటారు. దాన్ని పట్టించుకోకుండా వాళ్లనీ వెనుకబడిన వర్గంగానే పరిగణించారు.
కర్ణాటక చరిత్రను చూస్తే ఒక విచిత్రం కనపడుతుంది. సారవంతమైన దక్షిణ కర్ణాటక అంతా 1947కు పూర్వం మైసూరు సంస్థానం కింద ఉండేది. దేశంలోనే ప్రగతిశీల సంస్థానంగా దానికి పేరుండేది. నిజాం సంస్థానం తర్వాత అదే పెద్దది. వడియారు రాజవంశం పాలనలో ఉండేది. అరసు కులానికి చెందిన వడియార్లకు కర్ణాటక గ్రామాల్లో బలమూ లేదు. బలగమూ లేదు. దేశంలోని ఇతర సంస్థానాధీశులకూ, జమిందార్లకూ స్థానిక కులబలం గణనీయంగానే ఉండేది. వడియార్లకు అది పెద్ద కొరత. 1880ల్లో అరసు కులానికి చెందిన వారు 1000 మందికి కొంచెం అటూఇటూగా ఉండేవారు. కుల, రక్తబంధువులు లేకుండా నెగ్గుకు రావాల్సిన పరిస్థితి ఉండటంతో గ్రామాల్లో పట్టుకలిగి, భూసంపదపై ఆధిపత్యం ఉన్న లింగాయతులు, వక్కలిగల జోలికి వడియార్లు వెళ్లేవారు కాదు. చాలావరకూ వారి ఆధిపత్యానికే గ్రామాలను వదలివేశారు. అక్కడ నుంచి సంప్రదాయంగా వచ్చే శిస్తు లభిస్తే చాలనుకుని తృప్తిపడేవారు. పాలనా యంత్రాంగంలో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని మొదటగా ప్రశ్నించింది లింగాయతులూ, వక్కలిగలే. దానికి స్పందనగా వెంటనే లెజ్లీ మిల్లర్ కమిటీని (1918) వడియార్ మహారాజు ఏర్పాటు చేశారు. 1919 జూలైలో ఆ కమిటీ రిపోర్టు ఇచ్చింది. దాని ఆధారంగా 1921 మే 16న జీవో జారీ అయింది.
1880ల్లో అరసు కులానికి చెందిన 1000 మంది
భూసంపదపై ఆధిపత్యం ఉన్న లింగాయతులు
వక్కలిగల జోలికి వెళ్లని వడియార్లు
శిస్తు లభిస్తే చాలనుకుని తృప్తి
ప్రశ్నించిన లింగాయతులూ, వక్కలిగలే.!
1919 జూలైలో లెజ్లీ మిల్లర్ కమిటీ రిపోర్టు
1921 మే 16న జీవో జారీ
బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బ్రాహ్మణేతర ఉద్యమానికి మహారాజు తలవొగ్గుతున్న దశలో అది నచ్చక అప్పుడు దివాన్‌గా ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య రాజీనామా చేశారు. విశ్వేశ్వరయ్య రాజీనామాతో ఊపందుకున్న రిజర్వేషన్ల అనుకూల రాజకీయాలు ఆనాటి నుంచీ కర్ణాటకను ఏదో విధంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. 2015 నాటి కులలెక్కలను తిరస్కరించి మళ్లీ లెక్కలు తీయాలనుకోవటమే అందుకు నిదర్శనం.
అరసు కులానికి చెందిన వడియార్లు రిజర్వేషన్లకు శ్రీకారం చుడితే అదే కులానికి చెందిన దేవరాజు అరసు 1972లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టి లింగాయతు, వక్కలిగేతరుల కులాలకు రాజకీయ పదవుల్లో ప్రాతినిధ్యం పెంచి కొత్త ఒరవడిని సృష్టించారు. సొంత కులబలం లేనిచోట ఇతరకులాల బలం రాజకీయ మనుగడకు అవసరం. ఒకప్పుడు వడియార్లు అదే చేశారు. దేవరాజు అరసూ 50 ఏళ్ల తర్వాతా ఆ ప్రయోగాన్నే తలకెత్తుకున్నారు. గమ్మత్తు ఏమిటంటే మైసూరును పాలించిన అరసు కులస్తులు కూడా ఇప్పటికీ ఓబీసీ జాబితాలోనే ఉన్నారు. Karnataka State.
మూడునాలుగు కులాలను తప్ప మిగతావాటన్నిటినీ రిజర్వేషన్లు వర్తించే కేటగిరిలోకి చేర్చటం దేశవ్యాప్తంగా జరుగుతోంది. దశాబ్దాలుగా భూసంపదపైనా, స్థానిక పాలనా యంత్రాగంపైనా ఆధిపత్యం కలిగిన కులాలను కూడా ఆ పరిధిలోకి తీసుకువచ్చారనటానికి కర్ణాటక కంటే నిదర్శనం లేదు. దీన్ని సరిదిద్దే వ్యూహమూ, చతురతా ఉంటేనే రాహుల్ గాంధీ ఆశిస్తున్న అసలుసిసలైన సామాజిక న్యాయం అర్హులైన వర్గాలకు దక్కుతుంది. అది జరగకపోతే కులచైతన్యమూ, కులపోటీలు పెరిగి అసలు లక్ష్యం ఎక్కడికో పోతుంది.