ట్రంప్ మరో బిగ్ బాంబ్.!

Trump About H1-B Visa: హెచ్‌-1బీ వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఎలాగైనా విదేశీయులు.. అమెరికాలో ఉద్యోగాలు పొందకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే లాటరీ విధానంలో కూడా మార్పులు తెచ్చింది. ఆ డిటైల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాలో హెచ్-1బీ వీసా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంతో పాటు అభ్యర్థుల ఎంపికలో లాటరీ విధానానికి ముగింపు పలికింది. ఇకపై నైపుణ్యం, వేతనం ఆధారంగానే హెచ్-1బీ వీసాలు జారీ చేయాలని కొత్త ప్రతిపాదనలు చేసింది. ఈ కఠినమైన నిబంధనలు, విపరీతంగా పెరిగిన ఫీజుల వల్ల ప్రత్యామ్నాయ మార్గాల కోసం టెక్ కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా ఎల్-1, ఓ-1 వీసాలపై ప్రస్తుతం కంపెనీల దృష్టి కేంద్రీకృతమైంది.

హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రతిపాదిత నిబంధనలు విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న ర్యాండమ్ లాటరీ విధానాన్ని మార్చి…, వేతన ఆధారిత వెయిటెడ్ సెలక్షన్ ప్రాసెస్‌ లాగా మార్చాలని సూచించింది. ఇందులో విదేశీయులను వేతన స్థాయి ప్రకారం వర్గీకరించి, ఉన్నత వేతనాలు ఇచ్చే ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాటరీ పద్ధతిలో అదృష్టం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. కానీ ఇకపై ఆ స్థానంలో వేతనం, నైపుణ్యం ఆధారంగా వీసాలు జారీ చేయాలని డీహెచ్‌ఎస్ ఆలోచిస్తోంది. ఈ కొత్త విధానంలో దరఖాస్తుదారులను వారి నైపుణ్య స్థాయి, వేతనాన్ని బట్టి ‘వేజ్ లెవెల్ 1’ నుంచి ‘వేజ్ లెవెల్ 4’ వరకు నాలుగు విభాగాలుగా వర్గీకరించాలని ప్రతిపాదించారు. దీని ద్వారా అత్యధిక నైపుణ్యం, వేతనం ఉన్న అభ్యర్థులకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది. ఉదాహరణకు ‘వేజ్ లెవెల్ 4’లో ఉన్న అభ్యర్థి పేరు నాలుగు విభాగాలలోనూ ఉంటుంది. దీనివల్ల అతనికి వీసా పొందే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

హెచ్-1బీ వీసా ఫీజు విపరీతంగా పెరగడంతో అమెరికాలోని టెక్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాయి. హెచ్-1బీతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో లభించే ఎల్‌-1 , ఓ-1 వీసాలకు ఇకపై డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓ-1 వీసా కేటగిరీని పరిశీలిస్తే.. దీని ఫీజు సంవత్సరానికి సుమారు రూ. 10.64 లక్షలు మాత్రమే. ఇది కొత్త హెచ్-1బీ వీసా ఫీజులో కేవలం ఎనిమిదో వంతు. అంతేకాకుండా ఈ వీసాకు లాటరీ పద్ధతి ఉండదు. అభ్యర్థుల అసాధారణ నైపుణ్యాల ఆధారంగా మాత్రమే వీటిని జారీ చేస్తారు. దీనివల్ల కంపెనీలకు డబ్బు ఆదా అవ్వడమే కాకుండా, తాము నిపుణులమని రుజువు చేసుకోగలిగిన వారికి మాత్రమే దరఖాస్తులు దాఖలు చేస్తాయి. హెచ్-1బీ వీసాలా కాకుండా ఓ-1 వీసా గడువును ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పొడిగించుకునే ఛాన్స్ ఉంటుంది.

ఈ ప్రతిపాదనలు 2026 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు అవుతాయని డీహెచ్‌ఎస్ ప్రణాళిక ఉంది. 2025 లాటరీలో ఎంపిక రేటు 15-16% మాత్రమే ఉంది. కానీ కొత్త విధానం ద్వారా ఫ్రాడ్‌ను తగ్గించి, నిజమైన టాలెంట్‌ను ఆకర్షించవచ్చనే అభిప్రాయం ఉంది. లేబర్ డిపార్ట్‌మెంట్ కూడా ప్రివైలింగ్ వేజ్ లెవల్స్‌ను పెంచే రూల్ తయారుచేస్తోంది. ఇది H-1Bని ‘బెస్ట్ ఆఫ్ ది బెస్ట్’ వర్కర్లకు మాత్రమే పరిమితం చేస్తుంది. అందువల్ల ఫుల్ టాలెంట్ ఉన్నవారే ఉద్యోగం పొందగలరు. ఈ మార్పులు అమెరికన్ IT వర్కర్ల ఉద్యోగాలను కాపాడుతాయని ట్రంప్ అధికారులు చెబుతున్నారు, కానీ టెక్ జెయింట్స్ లాంటి మైక్రోసాఫ్ట్, గూగుల్‌లు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.

వేతన పెరుగుదల అంచనాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. 2026లో H-1B ఉద్యోగులకు మొత్తం వేతనాలు $502 మిలియన్ డాలర్లకు పెరుగుతాయని డీహెచ్‌ఎస్ లెక్కించింది. 2027లో $1 బిలియన్, 2028లో $1.5 బిలియన్, 2029లో $2 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఇది విదేశీయ నిపుణులకు మంచి అవకాశాలు కల్పిస్తుంది, కానీ తక్కువ వేతనాలు ఇచ్చే కంపెనీలకు సవాలుగా మారుతుంది. సెనేటర్ జిమ్ బ్యాంక్స్ ప్రవేశపెట్టిన ‘అమెరికన్ టెక్ వర్క్‌ఫోర్స్ యాక్ట్’ బిల్ కూడా $150,000 మినిమమ్ వేజ్, OPT ప్రోగ్రామ్ రద్దు, లాటరీ విధానం ముగింపును సూచిస్తోంది.

ఈ మార్పులు భారతీయ IT ప్రొఫెషనల్స్‌పై పెద్ద ప్రభావం చూపుతాయి. భారత్ నుంచి 70%కి పైగా H-1B వీసాలు వస్తున్నాయి. ముఖ్యంగా TCS, Infosys లాంటి కంపెనీల ద్వారా వస్తున్నాయి. కొత్త ఫీ, వేజ్ టయరింగ్ వల్ల చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇబ్బంది పడతాయి. అయితే, గూగుల్, అమెజాన్ లాంటి బిగ్ టెక్ కంపెనీలు ఉన్నత వేతనాలు ఇచ్చి సులభంగా ఎంపిక అవుతాయి. USCIS 2025 లాటరీలో ఫ్రాడ్ తగ్గడానికి ఇప్పటికే బెనిఫిషరీ-సెంట్రిక్ సెలక్షన్ అమలు చేసింది. అందుకే ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్లు 2024తో పోలిస్తే తగ్గాయి.

విమర్శకులు ఈ మార్పులను ‘అమెరికా ఫస్ట్’ విధానం కింద విదేశీయులపై దాడిగా చూస్తున్నారు. ఇది టాలెంట్ ఇన్‌ఫ్లోను తగ్గించి, టెక్ ఇన్నోవేషన్‌కు అడ్డంకి అవుతుందని చెబుతున్నారు. 2021లో ట్రంప్ ప్రయత్నం కోర్టుల్లో ఆగిపోయింది, కానీ ఇప్పుడు మళ్లీ బలంగా ముందుకు వెళ్తున్నారు. పబ్లిక్ కామెంట్స్ 30 రోజుల పాటు స్వీకరిస్తారు, తర్వాత ఫైనల్ రూల్ వస్తుంది. ఇది H-1Bని మరింత కఠినంగా చేస్తుంది. కానీ అధిక నైపుణ్య వర్కర్లకు మంచిది. వారికి శాలరీలు కూడా పెరుగుతాయి. కానీ అలాంటి వారు తక్కువ సంఖ్యలో ఉంటారు.

ఈ అప్‌డేట్‌లో మరో ముఖ్యమైన అంశం, లేబర్ డిపార్ట్‌మెంట్ నుంచి ‘ప్రాజెక్ట్ ఫైర్‌వాల్’ అనే ఎన్‌ఫోర్స్‌మెంట్ పుష్. ఇది H-1Bని తప్పుగా వాడకుండా పరిశోధిస్తుంది. ముఖ్యంగా థర్డ్-పార్టీ స్టాఫింగ్‌లో జరిగే అక్రమాలను అడ్డుకుంటుంది. అంటే.. కన్సల్టింగ్ ద్వారా ఉద్యోగం పొందాలనుకునేవారికి ఇది షాక్ లాంటిది. 2025లో మైక్రోసాఫ్ట్ 15,000 అమెరికన్ ఉద్యోగాలు కట్ చేస్తూ.. H-1B స్పాన్సర్‌షిప్ చేసింది. దీనివై విదేశీయుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కొత్త రూల్స్ ద్వారా ట్రంప్ ప్రభుత్వం అమెరికా కంపెనీల్లో అమెరికా వర్కర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇప్పించాలనుకుంటోంది. Trump About H1-B Visa.

ఈ H-1B మార్పులు అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని మార్చేస్తున్నాయి. విదేశీయ నిపుణులు, ముఖ్యంగా భారతీయులు, తమ కెరీర్ ప్లాన్స్‌ను మార్చుకోవాల్సి వస్తోంది. EB-1A గ్రీన్ కార్డ్ లాంటి ఆల్టర్నేటివ్‌లు చూడాలి. ట్రంప్ అధికారులు ఇది ‘అమెరికా ఫస్ట్’కి సరిపోతుందని చెబుతున్నారు, కానీ గ్లోబల్ టాలెంట్ పూల్‌పై ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.