
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. గత ఎన్నికల్లో విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆయన సతీమణి మాగంటి సునీతను తన పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ డిక్లేర్ చేసింది. ఈ ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకున్న కేటీఆర్, ఇప్పటికే నియోజక వర్గంలోని ప్రధాన నేతలతో ప్రతిరోజూ చర్చలు జరుపుతున్నారు. సిట్టింగ్ సీటు చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక ఈ సీటు మీద కన్నేసిన అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. సికింద్రాబాద్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి సీటు కైవశం చేసుకున్న కాంగ్రెస్, ఇప్పుడు జూబ్లీహిల్స్ సీటు కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. దీంతో బలమైన అభ్యర్థి కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మొదట స్థానిక నేతన నవీన్ యాదవ్ పేరు తెరమీదకు తెచ్చిన కాంగ్రెస్ పెద్దలు, ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తన సొంత సర్వేలో నవీన్ యాదవ్ మీద నెగెటివ్ ఉందని భావించిన సీఎం రేవంత్ రెడ్డి, మరోనేత కోసం వేట మొదలు పెట్టారట. మరోవైపు తనకంటే జూనియర్ నేతకు టిక్కెట్ ఇస్తే పార్టీకి పనిచేయనంటూ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించడం కూడా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. Jubilee Hills By Election.
ఇక టీడీపీ, జనసేన పొత్తుతో జూబ్లీహిల్స్ బరిలో దిగాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనకంటూ బలమైన ఓట్ బ్యాంక్ సుస్థిరం చేసుకున్న తమ పార్టీకి టీడీపీ, జనసేన ఓట్లు ప్లస్ అవుతాయని కాషాయ పెద్దలు నిర్ణయానికి వచ్చారట. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడటం ఖాయంగా తెలుస్తోంది. ఇక నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ప్రతి ఎన్నికలో పోటీ చేస్తున్న ఎంఐఎం, ఈసారి కూడా బరిలో ఉండనుంది. అయితే ఈసారి ముస్లిం ఓట్లు ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య చీలడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి కొంచెం ప్లస్ అవుతుంది.