దేవర -2 అప్డేట్ వచ్చేసింది..!

NTR Devara 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ చిత్రం గత ఏడాది సెప్టెంబర్ 27న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ మాస్ యాంగిల్‌ను మళ్లీ ఒకసారి ప్రభంజనంగా చూపించిన ఈ సినిమా, విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ ‘దేవర 2’ ను అధికారికంగా అనౌన్స్ చేస్తూ ఓ ఇంటెన్స్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.”దేవర సముద్ర తీరాలను కదిలించిన ఈ రోజు… ప్రేమనూ, భయాన్నీ పంచిన దేవుడి కథ కొనసాగనుంది. ప్రపంచం ఎప్పటికీ మరిచిపోలేని కథనానికి కొనసాగింపు. ‘దేవర 2’కి సిద్ధమవ్వండి! అంటూ నిర్మాతలు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనితో ‘దేవర 2’పై అంచనాలు మళ్లీ
తారా స్థాయికి చేరాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం చాలా భాగం షూటింగ్ పూర్తిచేసుకుని, 2026 జూన్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ ‘దేవర 2’ సెట్స్ పైకి ఎక్కనున్నట్టు సమాచారం. కొరటాల శివ కూడా గతంలో జరిగిన కొన్ని ఇంటర్వ్యూల్లో ‘దేవర 2’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పి క్యూరియాసిటీ పెంచారు.‘‘మొదటి భాగంలో మీరు చూసింది కేవలం 10 శాతమే. అసలు కథ రెండో పార్ట్‌లో ఉంది. ఇది 100 శాతం పవర్‌ఫుల్ కథ. ప్రతి పాత్రకు ఓ షాకింగ్ ట్విస్ట్ ఉంటుంది’’ అని తెలిపారు. NTR Devara 2.

ఎన్టీఆర్ కూడా ‘దేవర’ మొదటి భాగం విజయం తనపై ఉన్న బాధ్యతను మరింత పెంచిందని చెబుతూ,‘‘సీక్వెల్ పార్ట్ వన్ కంటే ఎక్కువగా ప్రేక్షకుల హృదయాలను గెలుస్తుంది’’ అని చెప్పడం, అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ఇదిలా ఉంటే, ‘దేవర 2’లో హీరోయిన్స్ జాన్వీ కపూర్, విలన్లుగా సైఫ్ అలీ ఖాన్, షైన్ టైం చాకో ఇప్పటికే భాగమవుతుండగా, బాలీవుడ్ నుంచి మరో స్టార్‌ హీరో కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. రణబీర్ కపూర్ లేదా రణవీర్ సింగ్ ఇద్దరిలో ఒకరు ఇందులో ముఖ్యపాత్రలో కనిపించనున్నారని కొరటాల శివ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు. తాజాగా ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సంస్థ ‘‘దేవర 2 రాబోతోంది, సిద్ధంగా ఉండండి’’ అంటూ ట్వీట్ చేయడం అభిమానుల్లో క్రేజీ హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మళ్లీ ‘దేవర’ ప్రపంచంలోకి ప్రవేశించేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు.