
Tirupati TDP incharge post: రాష్ట్రం రాజకీయాలు ఓ ఎత్తైతే, తిరుపతి రాజకీయం మరోఎత్తు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం గత కొంతకాలంగా సీనియర్ లీడర్స్ సైలెంటుగా ఉంటున్నారట. అంతేకాదు, ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నా ఏ ఒక్కరూ నోరుమెదపడం లేదట. దీంతో తిరుపతి టీడీపీలో ప్రత్యర్ధులను ధీటుగా ఎదుర్కొనే నాయకుడి కోసం పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
రాజకీయ పార్టీలకు విపరీతమైన సెంటిమెంట్ ఉండే అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతి. నాటి ఎన్టీఆర్ హయాం నుంచీ తెలుగుదేశం పార్టీకి తిరుపతికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందని కేడర్‌లోనే గుసగుసలు వినిపిస్తున్నాయట. పార్టీ అధిష్టానం, స్థానిక నేతల మధ్య సమన్వయ లోపం అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనిపిస్తోందట. అది ప్రత్యర్థులకు అడ్వాంటేజ్ అవుతోందన్నది కార్యకర్తల వాదనగా తెలుస్తోంది. గత ఏడాదిగా వైసీపీ చిన్నాచితక నేతలతో కలిసి స్థానిక కూటమి నాయకులు దందాలు చేస్తున్నారంటే పరిస్థితి ఏమేరకు దిగజారిందో అర్ధం చేసుకోవచ్చని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల సమయంలో స్థానిక నేతలైన సుగుణమ్మ, ఎడిఫై విద్యాసంస్థల అధినేత ప్రణీత్, జేబీ శ్రీనివాస్, మబ్బు దేవనారాయణ, కోడూరు బాలసుబ్రహ్మణ్యం తదితరులు టీడీపీ టిక్కెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా తిరుపతి సీటు జనసేనకు వెళ్లింది. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. నియోజకవర్గంలో భాగస్వామ్య పార్టీ అభ్యర్థి గెలిచారు. అయినాసరే తాము పవర్‌లో ఉన్నామా లేదా అన్నట్టుగా ఉందట కేడర్ పరిస్థితి. నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే, స్టేట్ బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్ ఛైర్మన్ సుగుణమ్మ ఉన్నప్పటికీ అమెను గుర్తించే పరిస్థితిలో క్యాడర్ లేదట. గంగమ్మ గుడి చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవమే ఇందుకు ఉదాహరణగా కార్యకర్తలు చెబుతున్నారు.
తిరుపతికి రాష్ట స్థాయి కార్పొరేషన్ పదవులు నాలుగు వచ్చాయి. ఒక్క సుగుణమ్ మినహా మిగిలిన వారికి పదవులు దక్కాయి. శాప్ చైర్మన్ పదవి రవి నాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ పదవి నరసింహ యాదవ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి రుద్రకోటి సదాశివం దక్కించుకున్నారు. ఇక డైరెక్టర్స్‌గా చాలా మందికి ఛాన్స్ దక్కింది. కానీ వీళ్లల్లో ఏ ఒక్కరూ కార్యకర్తల సమస్యల మీద, పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేయడం లేదట. ఇక గ్రూపుల గోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని కార్యకర్తలు వాపోతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రతిపక్ష వైసీపీ తిరుపతి నియోజకవర్గంలో దూకుడుగా వెళ్తోంది. ఇప్పటి నుంచే తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలకు తమ కార్యకర్తలను రెడీ చేస్తున్నారు స్థానిక వైసీపీ నేతలు. ఇక మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కూమారుడు అభినయ్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నారు. గతంలో భూమన లేవనెత్తిన గోశాల అంశం రాష్ట వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే ఆ అంశాన్ని స్థానిక టీడీపీ నేతలు సరిగా డీల్ చేయలేకపోయారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోందట. నెపం మొత్తం పోలీసుల మీదకు నెట్టేసి చేతులు దులుపుకున్నారని స్థానిక టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారట. ఇక రెండు నెలల క్రితం అభినయ్ రెడ్డి అనుచరుడు చైతన్య యాదవ్, ఓ కారు డెకార్స్ యాజమానిపై దాడి చేశారు. తాజాగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి, దళిత సామాజిక వర్గానికి చెందిన పవన్ అనే యువకుడిని తన ఆఫీస్‌లో బంధించి తీవ్రంగా హింసించిన వీడియో బయటికి వచ్చింది. దీని మీద మంత్రుల స్థాయిలో స్పందించారేగానీ, స్థానిక నేతలు మాత్రం నిద్రపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట తిరుపతి తెలుగు తమ్ముళ్లు.
ఇన్ఛార్జ్ సుగుణమ్మ ఇప్పటివరకు ఏ ఒక్క అంశం మీద స్పందించిన దాఖలాలు లేవంటూ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. పోనీ మిగిలిన నేతలైనా యాక్టివ్‌గా ఉన్నారా అంటే… అదీ లేదు. స్థానిక వైసీపీ నేతలు పార్టీని ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నా, నియోజకవర్గ టీడీపీ నాయకులు కిమ్మనకపోవడాన్ని, కౌంటర్ చేసేందుకు కనీస ప్రయత్నం చేయకపోవడాన్ని ఎలా చూడాలని ప్రశ్నిస్తోందట టీడీపీ కేడర్. ఇదే విషయమై పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లిన్నట్లు కూడా తెలుస్తోంది. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసే ప్రసక్తే లేదని తిరుపతి తమ్ముళ్లు తెగేసి చెప్పడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానికంగా భూమన కుటుంబాన్ని ఎదుర్కోవాలంటే తమకు బలమైన నాయకుడు కావాలని డిమాండ్ చేస్తున్నారట. పార్టీ కోసం ప్రాణంపెట్టే బలమైన నాయకుల సేవల్ని వాడుకోవడంలో విఫలం అవుతున్నట్లు ఓ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు తిరుపతి నియోజకవర్గంలో వైసీపీని ఎదుర్కోవాలంటే బలమైన టీడీపీ నేత కావాల్సిందే. ఎందుకంటే తిరుపతి అనేది తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచీ కంచుకోటగా ఉంది. తిరుపతిలో ఏం జరిగినా అది ప్రపంచస్తాయిలో గుర్తింపు ఉంటుంది. సీఎం చంద్రబాబు కూడా తిరుపతి మీద ప్రేమాభిమానాలు చూపిస్తారు. స్వయానా తిరుమల వెంకటేశ్వరుడే తనకు పునర్జన్మ ఇచ్చారంటూ అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక అభివృద్ధి పరంగా చూడాలంటే తిరుపతిని సరస్వతి నిలయంగా మార్చి ఎన్నో యూనివర్సిటీలు తీసుకొచ్చారు చంద్రబాబు. పరిశ్రమలపరంగా కూడా తిరుపతి అగ్రగామిగా ఉంది. గతంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిగా పనిచేసిన వెంకయ్య నాయుడు తిరుపతిని స్మార్ట్ సిటీగా ప్రకటించినప్పటి నుంచీ అభివృద్ధి మరింత వేగం పుంజుకుంది. Tirupati TDP incharge post.
ఇక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు తొలి నుంచి తిరుపత అంటే మమకారం ఎక్కువ.1983 నుండి నేటి వరకు తిరుపతి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. కానీ ఇప్పుడు స్థానిక నేతల్లో ఐక్యత లేకపోవడంతో వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. తాజా పరిస్తితులను బేరీజు వేసుకున్న పార్టీ అధిష్టానం ఇప్పుడు తిరుపతి ఇంచార్జిగా యువతకు అవకాశం కల్పించే దిశగా ఆలోచన చేస్తోందట. ఇందులో భాగంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ విద్యావేత్త పెనుమాడు ప్రణీత్ ను రంగంలోకి దింపడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ రిపోర్టులు, పార్టీ సర్వేలు, యువత అభిప్రాయాలు సేకరించిన పార్టీ దసరా పండుగకే ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై ఫుల్ క్లారిటీ తో ఉన్న పార్టీ జనరల్ సెక్రెటరీ నారా లోకేష్ తిరుపతి పగ్గాలను ప్రణీత్ కు అప్పగించేందుకు అంగీకరించినట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా వివాద రహితుడు, సౌమ్యుడు, విద్యావంతుడు, తన సొంత ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవాకార్యక్రమాలు కూడా కల్సొచ్చే అంశాలుగా పార్టీ భావిస్తోంది. అంతేకాదు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నారా రోహిత్ లతో ప్రణీత్ కు మంచి సంబంధాలు ఉన్నాయట. అందుకే తిరుపతి నియోజకవర్గ ఇంచార్జిగా ప్రణీత్ పేరు ఖరారు అయినట్లు పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.