గాంధీ ఆలయం..!!

Gandhi Temple: ప్రపంచానికి సత్యం.. అహింస.. శాంతి అనే ఆయుధాలను అందించిన మన జాతిపిత మహాత్మ గాంధీ మందిరం రాష్ట్రంలోనూ ఏర్పాటైంది. బాపూజీతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను చాటేలా స్ఫూర్తి వన నిర్మాణానికి సిక్కోలు నెలవైంది. మహాత్ముని స్మారక మందిరంగా ఆరాధింపబడుతున్న సిక్కోలు గాంధీ మందిరంపై మెగా 9 టివి ప్రత్యేక కధనం.

బ్రిటిష్ సామ్రాజ్యపు బానిస సంకెళ్ల నుంచి యావత్ భారతదేశాన్ని బంధ విముక్తుల్ని చేసాడాయన. నెత్తుటి బొట్టు చిందకుండా ప్రజలకి స్వేచ్ఛా వాయువుల్ని పరిచయం చేశాడు ఆ మహా మనిషి. నిరాయుధుడై, ఒక్కడై కదిలి యావత్ దేశమే తన వెంట నడిచేలా చేసిన ఆ ఉత్తముడు ప్రజలకు దేవుడు కాక ఇంకేమవుతాడు. అందుకే కనిపించని దైవం కంటే… కలిసి నడిచిన మానవుణ్ణి దేవునిగా భావించారు సిక్కోలు ప్రజలు. ఆ మహాత్ముడు నడయాడిన నేలలో మహాత్మునికి గుడి కట్టారు.

స్వాతంత్య్ర ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించిన జిల్లాలో.. శ్రీకాకుళానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎంతోమంది వీరులను అందించిన పురిటి గడ్డగానూ గుర్తింపు పొందింది. మహాత్మాగాంధీ లాంటి మహనీయులు ఈ ప్రాంతంలో అడుగు పెట్టినట్లు చరిత్ర చెబుతోంది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆమదాలవలస మండలం దూసి రైల్వేస్టేషన్‌లో గాంధీ సభను నిర్వహించారు. మహాత్ముని ఆశయ సాధనకు ప్రతీకగా.. శ్రీకాకుళంలోని శాంతినగర్ కాలనీలో గాంధీ స్మారక మందిరం నిర్మించారు. గాంధీ స్మారక నిధి, గాంధీ మార్గ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా.. నగరపాలక సంస్థ పార్క్‌లో గాంధీ ధ్యాన మందిరం తీర్చిదిద్దారు.

దేశానికి స్వతంత్రాన్ని అందించిన మహాత్ముని త్యాగాన్ని శ్రీకాకుళం వాసులు నేటికీ స్మరించుకుంటూనే ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి గాంధీ మందిరం కూడా ఇదే కావడం విశేషం. 1927 డిసెంబర్ 2నుంచి 6వతేదీ వరకు సాక్షాత్తు ఆ మహాత్ముడు నడయాడిన నేల శ్రీకాకుళం. ఐదు రోజులపాటు జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించి స్ధానిక ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నింపారు గాంధీజీ.ఆ మహానీయుడు నడిచిన గడ్డపై గాంధీ మందిరం నిర్మించడానికి నిర్ణయించుకుంది శ్రీకాకుళం గాంధీ స్మారకనిధి సమన్వయ బృందం. అనుకున్నదే తడువుగా స్థానిక శాంతి నగర్ కాలనీలో గాంధీ మందిర నిర్మాణం పూర్తి చేసారు. యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన బాపూజీకి మందిరం నిర్మించడం తమ అదృష్టంగా భావిస్తున్నారు నిర్వాహకులు.

సత్యం, అహింస, శాంతి ఆయుధాలుగా మలిచి జాతిపితగా నిలిచిన మహాత్మాగాంధీ మందిరం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉంది. నగరంలోని శాంతినగర్‌ కాలనీలో మహాత్మాగాంధీ మందిరాన్ని నిర్మించారు. సుమారు యాభై సెంట్ల విస్తీర్ణంలోని ఏర్పాటు చేసిన పార్క్‌లో మహాత్మాగాంధీ మందిరంతో పాటు భారత స్వాతంత్ర్య సమరయోథుల స్ఫూర్తివనం ఏర్పాటు చేశారు. దేశంలో రెండు చోట్ల మందిరాలు ఉన్నప్పటికీ, శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్మించిన మందిరంలో 35 మంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోథులు, ఐదుగురు సంఘ సంస్కర్తల విగ్రహాలను ఏర్పాటు చేశారు.దీనికి తోడు ఇక్కడ ఏర్పాటు చేసిన గాంధీ మందిరంలో ప్రతి రోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. గాంధీ నిత్య ఆరాధన జరుగుతున్న మందిరంగా సిక్కోలు గాంధీ మందిరం పేరు గాంచింది.

శాంతి ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంతో పాటు ప్రపంచానికి గొప్ప శాంతి సందేశాన్ని అందించిన మహనీయుడు బాపూజీ. ఆయన మందిరం నిర్మాణం, సమరయోథుల స్ఫూర్తివనం ద్వారా సిక్కోలు ఖ్యాతిని ప్రపంచానికి చాటాలన్న సంకల్పంతో ఈ మందిర నిర్మాణం గాంధీ మార్గ్ ఇండియా ఫౌండేషన్ ఆద్వర్యంలో చేపట్టారు.ఇక్కడ ఏర్పాటు చేసిన గాంధీ మందిరంలో మహాత్ముడు ధ్యాన ముద్రలో దర్శనమిస్తారు. మందిర ముఖద్వారం వద్ద స్వదేశీ ఉద్యమంలో నూలు వడుకుతున్న మహాత్ముడు , దేశ రాజముద్ర అయిన మూడు సింహాలు ,వందేమాతర నినాద చిహ్నం కనిపిస్తాయి.మందిరం మీద 15 అడుగుల గాంధీజీ కనిపిస్తారు. ఈ మందిరం మూడు వైపులా గాంధీ జీవితంలోని అనేక ఘట్టాలను ఆవిష్కరించారు. Gandhi Temple.

సిక్కోలు గాంధీ స్మృతి వనం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని వనం మధ్యలో మౌన ముద్రలో ఉన్న మహాత్ముడుతో పాటు ఎంతోమంది మహానీయుల విగ్రహాలు దర్శనమిస్తాయి. దీనికి తోడు అజాదీకా అమృత్ మహోత్సవం సందర్భంగా గాంధీ ఆలయ ప్రాంగణంలో 105 అడుగుల జాతీయ జెంఢాను ఏర్పాటు చేసారు. స్వంతత్ర్యం కోసం పోరాడిన మహానీయులను నేటి తరం మరిచిపోతున్న సమయంలో ఇలాంటి ప్రదేశాలు వారిలో దేశభక్తిని నింపుతాయి.