రాజకీయాలకు కన్నబాబు రాజు దూరం.!

Kannababu Raju: ఈ రాజకీయాలు నాకు వద్దు బాబు నేను రాజకీయాలకు దూరంగా ఉండాలి అంటున్న అన్న ఆ మాజీ ఎమ్మెల్యే … ! అలా అని తన రాజకీయ వారసుడికి ఇద్దాం అనుకుంటే అయిన ఇందుకు ససేమిరా అనేశారు. మరి ఏమి చేయాలో అర్థం కాక భారం మొత్తం అధిష్టానం పైనే ఉంచారు ఆ సీనియర్ పోలిటీషియన్. దీంతో తన మనసులోని మాటను అధిష్టానం చెవిలో వేసి మీరు ఎవరిని పంపినా వెనకుండి నడిపిస్తాను అని ఆ నేత చెప్పినట్టు తెలుస్తుంది. ఇందుకు అదిష్టానం కూడా సరే అనేసి మరో నేతను ఎంపిక చేశారు. ఇంతకీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నది ఎవరు? అందుకు కారణాలు ఏంటీ?

ఉమ్మడి విశాఖ, అనకాపల్లి జిల్లాలోని, యలమంచిలి నియోజకవర్గానికి చెందిన ఉఫ్పలపాటి రమణమూర్తి రాజు ఆ నియోజకవర్గంలో మాత్రం కన్నబాబు రాజుగానే అందరికి పరిచయం. తొలిసారిగా అయిన 1999లో రాజకీయ అరంగేట్రం చేశారు. అంతకు ముందు వరకు కాంట్రాక్టులు చేసుకుంటా జీవనం సాగించిన కన్నబాబు రాజు అప్పటి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాజకీయాల పట్ల అట్రాక్ట్ అయి 1999లో అడుగు పెట్టారు. తొలి ప్రయత్నంగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని యాలమంచిలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాని నిరాశ చెందకుండా, రాజకీయ ఓనమాలు దిద్దుకుని తిరిగి 2004లో మళ్లీ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే గెలుపు గుర్రం ఎక్కారు. ఇక అదే జోష్ లో 2009 కూడా వరుసగా రెండో సారి గెలిచిన కన్నబాబు రాజు… దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మృతి అనంతరం వైఎస్ జగన్ వెంట నడిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి 2014లో మూడు సారి ఎమ్మెల్యేగా హేట్రిక్ కొట్టాలని ఆశపడ్డారు. కాని జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో వేరే వారికి సీటు ఇచ్చి కన్నబాబు రాజు ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.

కన్నబాబు రాజుని కాదని మరో సీనియర్ నేత ప్రగడ నాగేశ్వర రావుకి సీటు ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో YCP పై టీడీపీ అభ్యర్ధి పంచకర్ల రమేష్ బాబు గెలుపొంది వైసీపీకి షాక్ ఇచ్చారు. అయితే వైసీపీ నుంచి సీటు ఆశించి భంగపడ్డ కన్నబాబు రాజు ఉన్నట్టుండి. తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కాని అక్కడ ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. దీంతో తిరిగి 2019 ఎన్నిక ముందు వైసీపీ తీర్థం పుచ్చుకొని 2019 ఎన్నికల్లో యలమంచిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇలా మూడు సార్లు ఎమ్మెల్యే అయిన కన్నబాబు రాజు 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్ధి సుందరపు విజయకుమార్ మీద ఓటమి పాలయ్యారు. దీంతో అప్పటి నుంచి రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు రాజుకి ప్రస్తుత రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపించడంలేదు. ఇక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించిన ఆయన ఇప్పటి రాజకీయాలు తనకు ఏమాత్రం నచ్చట్లేదని అనుచరులు అంటున్నారు. కానీ వాస్తవానికి గత ప్రభుత్వంలో చేసిన పనులు వల్ల ఇప్పుడు తాను ఇబ్బంది పడతారని అనుకున్నారో లేక నిజంగానే రాజకీయాలంటే ఆసక్తి లేదు లేక రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకోవడమో. ప్రస్తుతం ఒక పార్టీ పై మరో పార్టీ వ్యక్కిగత దూషణలు, కుట్రలు, విమర్శలు ఇప్పుడు కన్నబాబు రాజు మనసు కకావికలం అయిపోయిందని అనుకుంటున్నారు.. ఇటువంటి పరిస్తితులకు తన మనసు అంగీకరించడం లేదని కన్నబాబు రాజు వెంట ఉండే అతికొద్ది మంది నమ్మకమైన కార్యకర్తలు చెబుతున్నమాట. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉండాలని అనుకున్నారు.

అయితే 1999 నుంచి ఇప్పటి వరకు సుమారు 25 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కన్నబాబు రాజు ఇక ఈ రాజకీయాల నుంచి తప్పుకుని తన వారసుడిగా తన కుమారుడు ఉప్పలపాటి సుకుమార్ వర్మ ను ప్రకటించి ఆశ్రమ వాసం గడపాలని అనుకున్నట్లు తెలుస్తుంది. కాని తన కుమారుడు వర్మ ఆలోచన ఇందుకు విరుద్దంగా ఉంది . గతంలో వైసిపి యువనేత గాను, డీసీసీబీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సుకుమార వర్మ కి రాజకీయాల పట్ల ఆసక్తి లేదని తండ్రి మాట కాదని ఖరాఖండిగా చేస్సేశారు. .దీంతో అధిష్టానం యలమంచిలి నియోజకవర్గానికి వైసీపీ నూతన ఇన్చార్జీ బాధ్యతలను చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కి పార్టీ అప్పగించడంతో ఒక్క సారిగా ఆ పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపద్యంలో తన మనసులోని మాటను కన్నబాబు రాజు కార్యకర్తల ముందు అసలు విషయం చెప్పారట ఇక నుంచి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను కాబట్టే కరణం ధర్మశ్రీ ని ఇన్చార్జీగా నియమించారంటూ పార్టీ నియోజకవర్గ సమావేశంలో కన్నబాబు రాజు అన్నారు. Kannababu Raju.

కరణం ధర్మశ్రీ ని నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం వెనుక కూడా తన మాటే ఉందని, అన రాజకీయ వారసుడిగా కరణం ధర్మశ్రీ ని నియమించాలని జగన్మోహన్ రెడ్డికి తానే సూచించానని కూడా వివరణ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. కన్నబాబు రాజు చోడవరం నియోజకవర్గంకి చెందిన కరణం ధర్మశ్రీ ని తీసుకువచ్చి యలమంచిలి నియోజకవర్గం బాధ్యతలు ఇవ్వడం ఒకింత అయోమయానికి గురిచేస్తుంటే కన్నబాబు రాజు చెప్పిన మాట విన్నవారు మరింత ఆలోచనలో పడ్డారు. తాను వద్దనుకుంటే ఆ నియోజకవర్గంలో మరెవరు సమర్ధ నాయకులు లేరా?… కరణం ధర్మశ్రీ నే కన్నబాబు రాజు ఎంపిక చేసుకోవడం వెనుక ఉన్న అసలు మతలబు ఏంటీ?… యలమంచిలిలో ఇక నుంచి కరణం ధర్మ శ్రీ ఆధ్వర్యంలో వైసీపీ పరుగులు ఎంత వరకు సాధ్యం?.. రాబోయే రోజుల్లో కన్నబాబు రాజకీయ సన్యాసం గడిపితే కరణం ధర్మశ్రీ కి నియోజకవర్గం క్యాడర్ ఎంత వరకు సపోర్టు చేస్తుంది…? కన్నబాబు రాజు తన రాజకీయ సన్యాసం వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?.. ఇవన్నీ కూడా ఇప్పుడు యలమంచిలి నియోజకవర్గం ప్రజల మెదడులో బేతాళ ప్రశ్నలే. మరి నిజంగా కన్నబాబు రాజు రాజకీయ సన్యాసం వెనుక ఉన్న అసలు విషయం ఏంటో అనే ప్రశ్నగానే మిగిలిపోయింది.