
America Corn Import To India: భారత్‌పై అమెరికా ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా నుంచి మొక్కజొన్నలను దిగుమతి చేసుకోవాల్సిందేనని అధ్యక్షుడు ట్రంప్ పట్టుపడుతున్నారు. సెప్టెంబర్ 26న జరిగిన భారత-అమెరికా వాణిజ్య చర్చల్లోనూ ఇదే అంశం కీలకంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… రష్యా నుంచి చమురు దిగుమతులపై ఒత్తిడి చేస్తూ 50 శాతం సుంకాలు విధించడంతో భారత్ పరిస్థితి కష్టంగా మారింది. సుంకాలు తగ్గించాలంటే..తమ మొక్కజొన్నలను భారత్ దిగుమతి చేసుకోవాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఆ దేశం నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసే అవకాశాలను భారతదేశం పరిశీలిస్తోంది. దీంతో భారత్ అమెరికా మొక్కజొన్నను కొంటుందా? లేదా కాదంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలను విపరీతంగా పెంచేసినా రెండు దేశాల మధ్య వాణిజ్య సంప్రదింపులు వివిధ స్థాయుల్లో జరుగుతూనే ఉన్నాయి. తమ వ్యవసాయ ఉత్పత్తులను కొనాల్సిందేనని ట్రంప్ ఒత్తిడి చేస్తుండటంతో భారత్ సెప్టెంబరు వరకు అగ్రరాజ్య పత్తిపై దిగుమతి సుంకాన్ని 11శాతం నుంచి సున్నాకు తగ్గించింది. తరవాత ఈ తగ్గింపును ఈ ఏడాది డిసెంబరు వరకు పొడిగించింది. అయితే దీన్ని రైతు సంఘాలు వ్యతిరేకించాయి. చివరికి భారతీయ కిసాన్ సంఘ్ కూడా పొడిగింపు నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరింది. ఒకసారి అమెరికన్ పత్తి దిగుమతులను అనుమతించామంటే, ఆపైన మొక్కజొన్న, సోయాబీన్, పాడి ఉత్పత్తులనూ దిగుమతి చేసుకోవాలనే ఒత్తిడి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. వారు చెప్పినట్లుగానే ఇప్పుడు అమెరికా జీఎం మొక్కజొన్నను దిగుమతి చేసుకోవాలని భారత్ పై ఒత్తిడి పెంచుతోంది.
అమెరికాలో ప్రధాన పంట మొక్కజొన్న . ఆ దేశంలో ఏటా 9 కోట్ల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. అది అక్కడి పంట భూమిలో 5 శాతానికి సమానం.అమెరికాలో ప్రభుత్వం నుంచి భారీగా సబ్సిడీలు అందుకునే పంట కూడా మొక్కజొన్నే. 2024లో అమెరికాలో మొక్కజొన్న రైతులకు 320 కోట్ల డాలర్ల సబ్సిడీ అందించింది. అమెరికాలో పండిన పంటలో 15శాతం స్వదేశంలోనే వివిధరూపాల్లో వినియోగిస్తున్నారు. 40 శాతం పశువులకు దాణాగా, 45 శాతం ఇంధనంలో మిశ్రమంగా ఉపయోగిస్తున్నారు. కేవలం ఒక శాతాన్ని మాత్రమే అమెరికన్లు ఆహారంగా తీసుకుంటారు. మిగతా పంటను పిండి, కార్న్ సిరప్గా, పెయింట్లు, ప్లాస్టిక్ తయారీలో ముడి పదార్థంగా వాడుతున్నారు. కోళ్లు, పశువుల దాణాలో 95శాతం మొక్కజొన్నే ఉపయోగిస్తారు.
అమెరికాలో ప్రధానంగా జన్యుమార్పిడి మొక్కజొన్న సాగలో ఉంది. అమెరికాలో మొక్కజొన్నపై వచ్చే లాభాల్లో అత్యధికం జన్యుమార్పిడి విత్తనాలను సరఫరా చేసే కంపెనీలకే దక్కుతాయి. జీఎం పంటలను భారత్, ఐరోపా దేశాలు నిషేధించాయి. ఎందుకంటే దానిపై చల్లే గ్లైఫోసేట్ అనే పెస్టిసైడ్ అలర్జీలు, క్యాన్సర్లు, ఇతర రోగాలను కలిగిస్తాయనే భయాందోళనలు ఉన్నాయి. జీఎం పంటలు ప్రజారోగ్యంతోపాటు పర్యావరణానికీ తీరని నష్టం కలిగిస్తాయి. ఈ కారణంగానే భారత్ వీటిని ప్రోత్సహించడం లేదు. జీఎం విత్తనాలు జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తాయి. అమెరికన్ జీఎం మొక్కజొన్న మన దేశవాళీ మొక్కజొన్నను విషతుల్యం చేసే ప్రమాదమూ లేకపోలేదు.
అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో మొక్కజొన్నను అత్యధికంగా సాగు చేస్తున్న దేశం భారత్. 2024-25 సీజన్ లో భారత్ 3.7 కోట్ల టన్నుల మొక్కజొన్నను పండించింది. అయినాసరే ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందంపై సంతకం చేయటం వల్ల ప్రతి సంవత్సరం 15 శాతం సుంకంపై 5 లక్షల టన్నుల మొక్కజొన్నను భారత్ దిగుమతి చేసుకుంటోంది. అంతకుపైబడిన దిగుమతులపై 50 శాతం సుంకం విధిస్తోంది. స్వదేశీ మొక్కజొన్న రైతుల ప్రయోజనాలను రక్షించడానికే ఈ విధానాన్ని అనుసరిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటకలలో అత్యధికంగా మొక్కజొన్న సాగులో ఉంది. ఇందులోని కొన్ని రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితిలో అమెరికా నుంచి మొక్కజొన్న దిగుమతి చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేతు. అంతే కాదు అమెరికా నుంచి దిగుమతులు పెరిగితే, రైతులు పంట మార్పిడి చేయవలసి వస్తుంది, ఇది వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఈ దిగుమతి నిర్ణయం భారతీయ రైతులకు నష్టం కలిగించవచ్చు. అమెరికా మొక్కజొన్నలు తక్కువ ధరలతో మార్కెట్లోకి వస్తే, దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది. ఇది ధరల పతనానికి దారి తీస్తుంది. America Corn Import To India.
మొక్కజొన్న అమెరికా వ్యవసాయానికి వెన్నెముక లాంటిది . అమెరికా అధ్యక్షుడికి మొక్కజొన్న రైతులు ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. అందువల్ల మొక్కజొన్నను దిగుమతి చేసుకోవాలంటూ భారత్‌పై ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నారు. చివరికి పశు, కోళ్ల దాణా కోసమైనా జీఎం మొక్కజొన్నను తీసుకోవాలంటూ భారత్‌ను ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అది మన పశువుల ఆరోగ్యానికే కాదు, ప్రజారోగ్యానికీ ప్రమాదకరమే. అందువల్ల అమెరికా నుంచి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన మొక్కజొన్నను మాత్రమే దిగుమతి చేసుకుంటామనీ, జీఎం మొక్కజొన్నను అనుమతించేది లేదనీ భారత్ కచ్చితమైన షరతులు విధించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ దిగుమతులను కూడా పరిమితంగా, అదీ నిర్దిష్ట కాల వ్యవధి వరకే తీసుకుంటామని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మొక్కజొన్న పంట కోతలకు 2 నెలల ముందు, కోతల తరవాత 3 నెలల వరకు అమెరికన్ మొక్కజొన్నను దిగుమతి చేసుకోబోమని తెగేసి చెప్పాలంటున్నారు. ప్రభుత్వం ఇథనాల్ కోసం దిగుమతి చేస్తున్నప్పటికీ ఈ నిర్ణయం దీర్ఘకాలికంగా భారత వ్యవసాయాన్ని బలహీనపరుస్తుందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.