పవన్ కల్యాణ్ ఓజీ కి బిగ్‌ షాక్..!

Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ‘ఓజీ’ సినిమా, బాక్సాఫీస్ వద్ద శరవేగంగా దూసుకుపోతూ భారీ వసూళ్లు నమోదు చేస్తోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల మార్క్‌ను దాటేసిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. సినిమా విడుదలకు ముందు నుంచి ఉన్న హైప్, అభిమానుల మద్దతుతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక షోలు మరియు టికెట్ ధరల పెంపు కారణంగా కలెక్షన్లకు మంచి బూస్ట్ లభించింది. ఇదే తరుణంలో దసరా సెలవులు కూడా ఉండటంతో, ఓజీ వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక పెద్ద షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 4 వరకు పదిరోజుల పాటు ఈ సినిమాకి టికెట్ రేట్ల పెంపునకు అనుమతినిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆ అనుమతిని వెనక్కి తీసుకుంది. మల్టీప్లెక్స్‌లలో రూ.150 మరియు సింగిల్ స్క్రీన్‌లలో రూ.100 వరకూ టికెట్ ధరలు పెంచుకోవచ్చని ఇచ్చిన జీఓను రద్దు చేస్తూ, తెలంగాణ పోలీస్ శాఖ తాజా జీవో విడుదల చేసింది.

ఈ జీవోలో, తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ, టికెట్ ధరల పెంపును తక్షణమే నిలిపేయాలని ఆదేశించబడింది. టికెట్లను సాధారణ రేట్లకే విక్రయించాలంటూ థియేటర్ల యాజమాన్యాలకు స్పష్టం చేసింది. ఈ ధరల పెంపుతో పాటు ప్రీమియర్ షోలు పెట్టుకోవడానికి కూడా ఇచ్చిన అనుమతిని ప్రభావితం చేస్తూ, ప్రభుత్వం మార్గదర్శకాలను సవరించింది.

ఇంతకుముందు టికెట్ రేట్ల పెంపుపై బర్ల మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం ఆ జీవోను సస్పెండ్ చేయడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టికెట్ రేట్ల పెంపును అధికారికంగా రద్దు చేసింది.

ఈ నిర్ణయం సామాన్య ప్రేక్షకుల్లో హర్షాతిరేకాలు కలిగించినప్పటికీ, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ధరలు తగ్గిపోవడం వల్ల కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. కానీ ట్రేడ్ వర్గాల అభిప్రాయం మేరకు, ధరలు తక్కువగా ఉండటం వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, దీని వల్ల చివరికి సినిమా వసూళ్లే పెరగవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. Pawan Kalyan OG.

ప్రస్తుతం ఓజీ 80% వరకూ ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు సాధించినట్టు సమాచారం. విడుదలై ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే, భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ కారణంగా బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు ఓజీ కనీసం రూ.300 కోట్ల వసూళ్లు అందుకోవాల్సి ఉంది. టికెట్ ధరలపై వచ్చిన మార్పులు, తదుపరి విడుదల కానున్న సినిమాల పోటీ..ఈ టార్గెట్ చేరుకోవడంలో ప్రభావం చూపే అవకాశముంది.. ఇలాంటి పరిస్థితుల్లో ఓజీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి.