మద్దతు ధర రూ.5940 విత్తనం నుంచి కుసుమను ఎలా పెంచాలి.?

Safflower oilseed crop: కుసుమ నూనె గింజల పంట. ఔషధ మొక్కగా ఈ పంటకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. చల్లని వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే పంట ఇది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 30వేల ఎకరాల్లో కుసుమ సాగవుతోంది. అయితే ఈ పంటకు ఆదాయం తక్కువగా వుండటం..మొక్కకు ముళ్లు అధికంగా వుండటం, పంట కోతకు కూలీలు రాకపోవటం వల్ల క్రమేపి దీని సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. అయితే ఇటీవలికాలంలో కుసుమ నూనెకు బాగా గిరాకీ పెరిగింది. కుసుమ పూతకు కూడా మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. దీనికితోడు ముళ్లులేని రకాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ పంట క్వింటాలుకు 600 పెంచడంతో దీని ధర 5,940 లుగా ఉంది. మరి రైతుకు లాభదాయకంగా మారి కుసుమను రబీ పంటగా సాగు చేసే విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో సాగు చేసే పంటల్లో కుసుమ ఒకటి. ఇది బహుళ ప్రయోజనాలు అందించే నూనె గింజ పంట. దీని సైంటిఫిక్ నేమ్ కార్థమస్ టింక్టోరియస్. ఇంగ్లీషులో శాఫ్ ఫ్లవర్ అని అంటారు. దీని ఆకులు ముళ్లతో ఉంటాయి. మొక్కలు 30 నుండి 150 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతాయి. పూలు గుండ్రంగా పచ్చటి పసుపు, నారింజ, ఎరుపు లేక తెలుపు రంగులలో ఉంటాయి. ఒక్కో పువ్వులో 15 నుచి 20 గింజలు ఉంటాయి. ఈ మొక్క తల్లి వేరు దృఢంగా ఉండడం వల్ల పొడి వాతావరణాన్ని బాగా తట్టుకుని నిలబడుతుంది. ప్రపంచంలో సుమారు 50 దేశాలకు పైగా కుసుమను పండిస్తున్నాయి. భారతదేశంలో ఈ పంట వీస్తీర్ణం సుమారు 3లక్షల 60వేల హెక్టార్లులో ఉంది. చాలా మంది ఈ పంటను నూనె తీసేందుకే పెంచుతున్నారు. ధాన్యం చేతికొచ్చే వరకు వేచి ఉండకుండా పువ్వుల ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.ఆరోగ్యపరంగా కుసుమ నూనె వాడకం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. హార్ట్ పేషెంట్స్, చిన్నారులు, బోన్ డిసీజెస్ ఉన్న వారికి ఈ నూనె స్వస్థత అందిస్తుంది.

కుసుమను సాగు మొదలు పెట్టేందుకు సెప్టెంబరు మొదటి పక్షం నుంచి అక్టోబరు వరకు అనుకూలమైన సమయం. ఆలస్యమైనప్పుడు నవంబరు 15 వరకు విత్తుకోవచ్చు. సాగుచేసిన రకాన్నిబట్టి కుసుమ పంటకాలం 120 నుంచి 135 రోజుల వరకు వుంటుంది. గతంలో ఎకరాకు 3,4క్వింటాళ్ల దిగుబడి రావటం కష్టంగా వుండేది. కానీ ప్రస్థుతం అభివృద్ధిచెందిన రకాలతో ఎకరాకు 6 నుండి 10క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. టి.ఎస్.ఎఫ్ – 1, నారీ – 6, నారీ ఎన్.హెచ్ – 1, పి.బి.ఎన్.ఎస్ -12, డి.యస్.హెచ్ – 185, ఎస్.ఎస్.ఎఫ్- 708 వంటివి కుసుమలో అధిక దిగుబడినిచ్చే రకాలు. వీటిలో నారీ-6 రకం ముళ్లు లేనిది. పంటకోత నూర్పిడి సులభంగా వుంటుంది.

కుసుమ పువ్వుల నుండి సేకరీంచే పూరెక్కల నుండి తీసిన రంగును ఆహార పదార్ధాల్లో , వస్త్రాల తయారీలో వాడుతున్నారు. ఇప్పుడు టీ తయారీలోనూ వినియోగిస్తున్నారు. అందువల్ల పూరెక్కలకు సేకరించి మార్కెట్ చేస్తే రైతుకు అదనపు రాబడి లభస్తుంది. కిలో పూరెక్కలకు 800 నుండి 1000 రూపాయల ధర లభిస్తోంది. ఎకరాకు 30 కిలోల వరకు పూరెక్కలను సేకరించి అదనపు రాబడిపొందే వీలుంది. కుసుమ నూనె వాడకం పెరగటంతో వివిధ కంపెనీలు పొలాల వద్దే పంటను కొనుగోలుచేసేందుకు ఆసక్తిచూపుతున్నాయి.

తక్కువ శ్రమ,ఖర్చుతో మంచి ఫలితాలనిచ్చే పంట కుసుమ. నీరు నిలవని బరువైన నేలలు, నీటివసతి గల ఎర్రగరప నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. ఈ పంటలో ఆదాయం పెంచుకునేందుకు వేరుశనగ, అపరాల పంటలను అంతర పంటలుగా సాగుచేయవచ్చు. అయితే ఈ పంటకు ఆకుమచ్చ తెగుళ్లు, పెనుబంక పురుగు సమస్య ఎక్కువగా వుంటుంది. వీటిని సకాలంలో నివారించాలి. ఎకరానికి 4 కిలోల చొప్పున వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు దూరంలో విత్తుకోవాలి. భూమిలోని శిలీంద్రాల ద్వారా సంక్రమించే రోగాలను తట్టుకునేందుకు విత్తన శుద్ధి చేసుకోవాలి. నల్లరేగడి నేలల్లో పంటకు పెద్దగా నీటి తడి ఇవ్వనవసరం లేదు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో పూత దశలో ఒక తడి కట్టినట్లయితే దిగుబడులు 40 నుంచి 60 శాతం పెరిగే అవకాశముంది. ఇక విత్తిన 30 నుంచి 35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. Safflower oilseed crop.

చూశారుగా కుసుమ సాగు ఎంత ఆశాజనకంగా వుందో… ప్రస్థుత పరిస్థితుల్లో ఒక రకంగా నిర్లక్ష్యానికి గురైన పంట ఇది. ఆదాయం తక్కువగా వున్నా.. పూతను సేకరించటం ద్వారా, అంతరపంటలు సాగుచేయటం ద్వారా నికరలాభం పెంచుకునే అవకాశాలు స్పష్టంగా వున్నాయి. వంట నూనె దిగుమతులు దేశానికి భారంగా మారిన ప్రస్థుత పరిస్థితుల్లో ఆరోగ్యానికి మేలుచేసే విశిష్ఠ విలువలు కలిగిన కుసుమ వంటి నూనెగింజ పంటల సాగుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు కల్పిస్తే రైతులు సాగువైపు ఉత్సాహంగా ముందడుగు వేసే అవకాశం వుంది.