ఆయుధ ‘బంధం’

AIM 120 AMRAAM Missile: పాకిస్థాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు చెందిన అత్యాధునిక AMRAAM మిసైల్స్ ను పాకిస్థాన్ కు విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత్ వస్తువులపై ఇటీవల అమెరికా 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. కానీ పాకిస్థాన్ తో మాత్రం వరుసగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోంది అగ్రరాజ్యం. ఇటీవల పాకిస్థాన్ నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ ను దిగుమతి చేసుకుంది అమెరికా. తాజాగా మరో కీలక ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ట్రంప్.

అమెరికాతో పాకిస్థాన్ సంబంధాలు క్రమక్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వైట్‌హౌస్‌లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు మంచి ఆతిథ్యం లభించింది. ఇద్దరూ గొప్ప నాయకులు అంటూ ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. ఇక భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన ప్రపంచ నాయకుడు ట్రంప్ అంటూ షెహబాజ్ షరీఫ్ కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ఇక నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ను అసిమ్ మునీర్ నామినేట్ చేశాడు. ఇక పాకిస్థాన్‌పై తక్కువ సుంకం విధించి.. భారత్‌పై మాత్రం ట్రంప్ భారీగా సుంకం విధించారు. దీంతో అమెరికాతో పాకిస్థాన్ సంబంధాలు బలపడుతున్నట్లు కనిపిస్తోంది.

అమెరికాకు చెందిన అత్యాధునిక, శక్తివంతమైన AMRAAM మిసైల్స్ ను పాకిస్థాన్ కు విక్రయించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేతియాన్ అనే కంపెనీ రూపొందించిన అడ్వాన్స్ డ్ మీడియం రేంజ్ ఎయిర్ టూ ఎయిర్ మిసైల్(AMRAAM) ను పాకిస్థాన్ కు విక్రయించనుంది. తాజాగా అమెరికా డిఫెన్స్ డిపార్ట్ మెంట్.. AMRAAM మిసైల్స్ ను కొనుగోలు చేసే దేశాల జాబితాలో పాకిస్థాన్ ను చేర్చింది. ఈ మిసైల్ రేంజ్ లోకి మొత్తం భారత్ వస్తుంది. ఇదే దీని ప్రత్యేకత కావడం గమనార్హం. దీంతో భారత్ కు పెనుముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద ఉన్న ఎఫ్-16 ఫైటర్ జెట్స్ ను అప్ గ్రేడ్ చేసుకునే క్రమంలో AMRAAM మిసైల్స్ ను కొనుగోలు చేస్తుంది. అయితే ఎంత సంఖ్యలో కొనుగోలు చేస్తుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పీస్ డ్రైవ్ ప్రోగ్రామ్ కింద గతంలో ఈ మిసైల్ ను పాకిస్థాన్ కొనుగోలు చేసింది. ఇదే క్షిపణితో 2019లో భారత్ కు చెందిన మిగ్-21 బీఐఎస్ ను కూల్చేసింది. అయితే ఇటీవలికాలంలో ఈ మిసైల్స్ ను అమెరికా అప్ గ్రేడ్ చేసింది. దాంతో వాటిని తిరిగి కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్.. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది.

గతంలో రక్షణ శాఖగా ఉన్న యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ (DoW) ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌లో AIM-120 క్షిపణులను అందుకున్న దేశాల జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని తెలిపింది. దీంతో అమెరికా నుంచి AIM-120 అడ్వాన్స్‌డ్ మీడియం-రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను (AMRAAM) పొందే అవకాశం ఉందని సమాచారం. ఇది రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను స్పష్టంగా తెలియజేస్తోందని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ స్పష్టం చేసింది.

ఈ ఒప్పందంతో పాకిస్థాన్ కు అత్యాధునిక ఆయుధ సంపత్తిని అందించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధం అయినట్లుగా భావించవచ్చు. అమెరికా- పాకిస్థాన్ మధ్య డిఫెన్స్ ఒప్పందానికి ఈ డీల్ కీలకంగా మారనున్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. పాకిస్థాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబార్ జులైలో అమెరికాలో పర్యటించిన సమయంలో ఈ ఒప్పందం ఓకే అయింది.

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ ఒప్పందం ప్రకారం.. పాకిస్థాన్, యూకే, పోలాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, సౌదీ అరేబియా, టర్కీ ఉన్నాయి. ఈ ఆర్డర్‌కు సంబంధించిన పని మే 2030 చివరి నాటికి పూర్తి అవుతుంది. ‘‘ఈ ఒప్పందంలో యూకే, పోలాండ్, పాకిస్థాన్, జర్మనీ, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, రొమేనియా, ఖతార్, ఒమన్, కొరియా, గ్రీస్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, సింగపూర్, నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్, జపాన్, స్లోవేకియా, డెన్మార్క్, కెనడా, బెల్జియం, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇటలీ, నార్వే, స్పెయిన్, కువైట్, ఫిన్లాండ్, స్వీడన్, తైవాన్, లిథువేనియా, ఇజ్రాయెల్, బల్గేరియా, హంగేరీ, టర్కీలకు విదేశీ సైనిక అమ్మకాలు ఉంటాయి’’ అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ నోటిఫికేషన్‌లో వెల్లడించారు. AIM 120 AMRAAM Missile.

ఇటీవల సౌదీ అరేబియాతో పాకిస్థాన్ రక్షణ ఒప్పందం చేసుకుంది. ఈ రక్షణ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి చేస్తే రెండు దేశాలపై దాడి చేసినట్లుగా భావించి.. శత్రువుపై రెండు దేశాలు పోరాటం చేయాలని ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం. ప్రస్తుతం ఈ ఒప్పందాన్ని పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే భారత్ ప్రకటించింది. తాజాగా అమెరికా దగ్గర నుంచి పాకిస్థాన్ అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.