మరో దంగల్…!!

Bihar Election Politics: బీహర్ లో ఎన్నికల సంఘం అసెంబ్లీ షెడ్యూల్ విడుదల చేయడంతో రాజకీయ పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. మేము అధికారంలోకి వస్తామంటే.. మేమే వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఎవరు ఆ నేతలు వారి కాన్ ఫిడెన్స్ ఏంటి ? వారు ఏమంటున్నారు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.

నవంబర్ 6, 11 తేదీలలో రెండు విడతలుగా బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 14 ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదటి విడతలో 121 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని, మిగిలిన స్థానాలకు నవంబర్ 11న జరపుతామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. బీహర్ అసెంబ్లీ గడువు నవంబర్ 22 తో ముగిస్తుందన్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు వెలువడిన కొన్ని గంటల తరువాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ పలు విషయాలు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి’’ అన్నారు. 90,712 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 13,911 పట్టణ ప్రాంతాలలో, 76,800 గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయని చెప్పారు. ప్రతి కేంద్రం సగటున 818 ఓటర్లకు అనుకూలంగా ఉంది. కొన్ని చోట్ల సౌలభ్యం కోసం 1200 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న చోట అదనపు బూత్ లు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. అన్ని పోలింగ్ బూత్ లలో 100 శాతం వెబ్ కాస్టింగ్ కవరేజీ ఉంటుందని సీఈఓ ప్రకటించారు.

అయితే ఇలా అసెంబ్లీ షెడ్యూల్ విడుదలో అవ్వడమే ఆలస్యం. ఎవరికి వారే నేతలు మేము అధికారంలోకి వస్తామంటే మేము వస్తామని ధీమీ వ్యక్తం చేస్తున్నారు. బీహార్ లో మరోసారి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని జేడీ(యూ) వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా విశ్వాసం వ్యక్తం చేయగా, ఈసారి బీహార్ ప్రజలు మార్పుకు ఓటు వేస్తారని ప్రతిపక్ష ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ అంటున్నారు.

ఇక మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ బీహార్ ను జంగిల్ రాజ్ నుంచి బయటకు తెచ్చి, అభివృద్ది, సుపరిపాలనను ఎన్డీఏనే అందించిందని అన్నారు. రాష్ట్ర ప్రజలు మరోసారి అభివృద్దికి పట్టం కడతారని పేర్కొన్నారు. చొరబాటుదారులను తరిమికొట్టడం, జంగిల్ రాజ్ ను తిరిగి రాకుండా ఆపడం కోసం ఎన్నికలు జరుగుతున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. ఇలా ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి తల్లి అయిన పవిత్ర భూమి బీహార్, బీజేపీ, ఎన్డీఏకు తమ ఓట్ల ఆశీర్వాదాలను అందిస్తుందనే పూర్తి నమ్మకం తమకు ఉందని జేపీ నడ్డా అన్నారు.

ఎన్నికల సంఘంపై చాలాకాలంగా పసలేని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్.. మరోసారి వాటిని కొనసాగించింది. తాము సంధించిన ప్రశ్నలకు ఇప్పటిదాకా సమాధానాలు ఇవ్వలేదంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఎన్నికల సంఘానికి, కేంద్రానికి మధ్య ఉన్న పొత్తును సూచిస్తుందని విమర్శించింది.‘‘మా ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వలేదు. ఎన్నికల కమిషన్ ను రోజూ ప్రశ్నిస్తూనే ఉన్నాము. అక్రమ వలసదారులు ఉన్నారని రాజకీయ వాతావరణం సృష్టించారు. కానీ దానికి సమాధానం రాలేదు.’’ అని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా అన్నారు. ‘‘ఇండి కూటమి, రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాలేదు’’ అని ఆయన జాతీయ మీడియాకు చెప్పారు. అధికార కూటమి ప్రజలకు డబ్బు పంపిణీ చేసే పథకాల రూపకల్పన తరువాత సోమవారం ఎన్నికల ప్రకటన చేశారని ఖేరా ఆరోపించారు. ‘ఇది కచ్చితంగా బీజేపీ, ఎన్నికల కమిషన్ పొత్తు కాక ఏంటీ?’’ అని ఆయన ప్రశ్నించారు. సమస్య ఓట్ చోరి కాదని, గత 20 సంవత్సరాలుగా అవే సమస్యలు ఉన్నాయని చెప్పారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ తరువాత ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయని ఫిర్యాదులు అందాయని, కానీ వాటిని సవరించకుండానే ఈసీ బీహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిందని సీపీఎం ఆరోపించింది. ‘సర్’ తరువాత లక్షలాది మంది ఓటర్లను వివిధ సాకులతో ఎన్నికల సంఘం తొలగించిందని వామపక్ష పార్టీ వెల్లడించింది. ఓటర్లకు సంబంధించి చేసిన తప్పుల గురించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండానే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తోంది’’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు.

ఓటర్ల జాబితా నుంచి తొలగించిన నిజమైన ఓటర్లకు తిరిగి చేర్చడానికి దరఖాస్తు చేసుకోవడానికి సరైన అవకాశం, సమయం ఇవ్వాలని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని సీపీఎం కార్యదర్శి చెప్పారు. కానీ ఎన్నికల సంఘం చాలా అభ్యంతరకరంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. మనదేశ చరిత్రలో అంపైర్ అంటే ఎన్నికల కమిషన్, ఒక వైపు జట్టులో భాగంగా, అంటే అధికార పార్టీగా ఉన్నట్లు భావిస్తున్న తరుణంలో బీహర్ ఎన్నికలు జరుగుతున్నాయి’’ అని బేబీ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సాయం చేస్తూ పక్షపాతంగా ప్రవర్తిస్తుందనే ఫిర్యాదుల నుంచి ఈసీ తనను తాను విముక్తి చేసుకోలేదని ఆరోపించారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించాలనే ఈసీ నిర్ణయాన్ని ‘‘సుప్రీంకోర్టు పై ధిక్కారం’’గా సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అభివర్ణించారు. బీహార్ లో ఎన్నికల జాబితా, సర్ అమలుపై ఎన్నికల సంఘం నిర్ణయాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లపై తుది విచారణ జరగనుంది. అయితే అంతకుముందే ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ తేదీలను ప్రకటించింది. ఇది అప్రజాస్వామికం, సుప్రీంకోర్టును ధిక్కరించడం’’ అని భట్టాచార్య అన్నారు. బీహర్ లో నిర్వహించిన సర్ ప్రక్రియ లో ఓటర్ల అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీపీఐ ఒక ఉద్యమం ప్రారంభించిందని భట్టాచార్య చెప్పారు. ప్రతి పదిమందిలో ఐదుగురి పేరును తొలగించడానికి ఈసీ కుట్రపన్నింది. వీధుల నుంచి సుప్రీంకోర్టు వరకూ మేము ఈ పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికలు దగ్గరకు వచ్చిన తరువాత పాలక పార్టీలు తిరిగి ప్రజలకు లంచం ఇచ్చి గద్దెనెక్కాలని ప్రయత్నిస్తున్నాయని, కానీ ప్రజలు మోదీ- నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తప్పిస్తారని జోస్యం చెప్పారు.

ఇక మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనను జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా స్వాగతించారు. ప్రజల మూడ్ ను అంచనా వేస్తే.. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అబద్దాలు వ్యాప్తి చేయడం, గందరగోళం సృష్టించడం, ప్రజలను తప్పుదారి పట్టించడం, బీహర్ అభివృద్ది వేగాన్ని ఆపలేవని ఈ ఎన్నికలు రుజువు చేస్తాయి’’ అని ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. Bihar Election Politics.

జన్ సురాజ్ ప్రభావం..ఈ ఎన్నికలలో మీరు గెలుస్తారా? అనే ప్రశ్న ఆయనకు సంధించినప్పుడూ ఇండి బ్లాక్, ఎన్డీఏ కు ఓటు వేయని 28 శాతం ఓటర్లు తమ వైపు వస్తారని ఆయన చెప్పారు. గత ఎన్నికలలో రెండు పార్టీలు కేవలం 72 శాతం ఓట్లను మాత్రమే పొందాయి. మిగిలిన 28 శాతం ఓట్లను మేము పొందుతాము. అంతేకాకుండా జన్ సురాజ్ పార్టీకి రెండు కూటముల నుంచి చెరో పది శాతం ఓట్లు సాధిస్తుందని ప్రజలు అంటున్నారు. అంటే రాబోయే ఎన్నికలలో మాకు 48 శాతం ఓట్లు వస్తాయి’’ అని ఆయన చెప్పారు. ఎన్నికల తరువాత నితీశ్ కుమార్ ఇక ముఖ్యమంత్రిగా ఉండబోరని ఆయన అన్నారు. ఇలా ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరీ ఏం జరుగుతుందో తెలియాలీ అంటే ఈ నెల 14 వరకు వేచి చూడాల్సిందే.