
Peddi Shooting: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం‘పెద్ది’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత చిత్రాలైన ‘ఆచార్య’, ‘గేమ్ ఛేంజర్’ ఫలితాలతో కాస్త వెనకబడిన చరణ్‌కు ఈ సినిమా చాలా కీలకం. సానా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడికల్ విలేజ్ స్పోర్ట్స్ రివెంజ్ డ్రామాను వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నాయి.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమా స్థాయిని పెంచేశాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘పెద్ది’ని నిర్మాతలు ముందుగా ప్రకటించినట్లుగా, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న విడుదల చేయాలని భావించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ తేదీకి సినిమా రావడం అసాధ్యం అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ ప్రకారం డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి మార్చిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ, హైదరాబాద్ శివారులో వేసిన భారీ సెట్‌లో జరుగుతున్న షూటింగ్, ఇటీవల కురిసిన కుండపోత వర్షాల కారణంగా కొద్దిరోజులు ఆగిపోయింది. దీనివల్ల చరణ్‌పై చిత్రీకరించాల్సిన ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, కీలక సన్నివేశాల షెడ్యూల్ ఆలస్యమైంది. దీనికి తోడు, ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి సాంకేతిక బృందం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తోంది. Peddi Shooting.
ఈ కారణాల వల్ల, షూటింగ్ జనవరి నెలాఖరు వరకు కూడా పూర్తయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. కేవలం 50 రోజుల వ్యవధిలో భారీ పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్, గ్రాఫిక్స్, డబ్బింగ్ పనులు పూర్తి చేయడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చరణ్ కెరీర్‌కు ఈ చిత్రం కీలకం కాబట్టి, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని హీరోతో పాటు దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అందుకే షూటింగ్ ఆలస్యమైతే విడుదల తేదీ కూడా సహజంగానే వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. 2026 మార్చిలో రావాల్సిన ‘పెద్ది’ మూవీని, బదులుగా 2026 సమ్మర్‌లో గానీ లేదా దసరా సీజన్‌లో గానీ విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారట. క్వాలిటీ కోసం మేకర్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయం మంచిదే అయినప్పటికీ, విడుదల వాయిదా వార్తలు మెగా అభిమానులను కొంత కలవరపెడుతున్నాయి.