‘అపూర్వ అడుగు’

Israel Hamas Signs Ceasefire: రెండేళ్ల గాజా యుద్ధానికి ఎండ్ కార్డు పడింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజా యుద్ధానికి ముగింపు పడేలా అతిపెద్ద 20-సూత్రాల ప్లాన్‌లో మొదటి దశకు రెండు పక్షాలు సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం, హమాస్ దగ్గర ఉన్న 48 మంది ఇజ్రాయెల్ బందీలందరూ త్వరలోనే విడుదల అవుతారు. ఈ వారాంతంలో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఐతే.. 48 మందిలో 20 మంది మాత్రమే జీవించి ఉన్నారు. మిగతా వారిని మృతదేహాలుగా అప్పగిస్తారు.

డీల్‌లో భాగంగా ఇజ్రాయెల్, పాలస్తీనా ఖైదీల మార్పిడి కూడా ఉంటుంది. ఇజ్రాయెల్ 250 మంది జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న పాలస్తీనా ఖైదీలను, అక్టోబర్ 7, 2023 తేదీ తర్వాత అరెస్టు చేసిన 1,700 మంది గాజా నివాసులను విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రతి ఇజ్రాయెల్ బందీ మృతదేహానికీ… ఇజ్రాయెల్ 15 మంది పాలస్తీనా మృతదేహాలను విడుదల చేయాలని నిబంధనలు ఉన్నాయి. ఈ మొదటి దశలో ఇజ్రాయెల్ సైన్యాలు ఒప్పందం ప్రకారం.. గాజా నుంచి వైదొలగాలి.

ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాం వేదికగా, “ఇజ్రాయెల్, హమాస్ మొదటి దశకు సంతకాలు చేశాయి. అందరు బందీలూ త్వరలో విడుదల అవుతారు. ఇజ్రాయెల్ బలగాలు ఒప్పందం ప్రకారం వెనక్కి తగ్గుతాయి. ఇది అరబ్, ముస్లిం ప్రపంచానికీ, ఇజ్రాయెల్‌కూ, ఆ చుట్టుపక్కల దేశాలకూ, అమెరికాకు గొప్ప రోజు. ఖతార్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తులకు ధన్యవాదాలు” అని పోస్ట్ చేశారు. ఈ ఒప్పందం తన 20-సూత్రాల ప్రణాళికలో భాగమనీ, ఇది బలమైన, శాశ్వత శాంతికి మొదటి అడుగు అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈనెల 11,12 వ తేదీన బందీల విడుదల జరగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ట్రంప్… ఈజిప్ట్, ఇజ్రాయెల్, గాజా పర్యటకు వెళ్లే అవకాశం ఉందని కూడా తెలిపారు.

మరోవైపు.. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పందించారు. ఈ ఒప్పందాన్ని “ఇజ్రాయెల్‌కు గొప్ప రోజు, కీలక మలుపు, డిప్లమాటిక్ విజయం, జాతీయ, నైతిక విజయం” అని వర్ణించారు. “ఇజ్రాయెల్ భద్రతకూ, బందీల స్వేచ్ఛకు అవిరామంగా కృషి చేసిన ట్రంప్, ప్రపంచ నాయకత్వానికీ థ్యాంక్స్ తెలిపారు. ట్రంప్‌తో “భావోద్వేగ సంభాషణ” జరిగిందనీ, తన పార్లమెంట్‌లో ప్రసంగించేందుకు ఆహ్వానిస్తున్నానని తెలిపారు. ఈ రోజు (అక్టోబర్ 9) తన ప్రభుత్వాన్ని కూడా ఈ ఒప్పందానికి ఆమోదం తెలపడానికి సమావేశం ఏర్పాటు చేయిస్తాననని ప్రకటించారు. “దేవుని సహాయంతో అందరినీ ఇంటికి తీసుకువస్తాం” అని బందీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇజ్రాయెల్ లక్ష్యాలన్నీ కొనసాగిస్తూ, పొరుగు దేశాలతో శాంతి విస్తరించేలా చేస్తామన్నారు.

హమాస్ అధికారులు ఈ మధ్యవర్తిత్వాన్ని స్వాగతించారు. ఖతార్ ప్రధాని, టర్కీ, ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్‌లు శాంతి చర్చల్లో పాల్గొని.. శాంతి, బందీల మార్పిడికి బలమైన అడుగు పడేలా చేశారని తెలిపారు. విడుదల చేయాల్సిన పాలస్తీనా ఖైదీల జాబితాను ఇజ్రాయెల్‌కి సమర్పించారు. “ట్రంప్, గ్యారెంటర్లు…. ఇజ్రాయెల్ తన నిబంధనలను పూర్తిగా అమలు చేసేలా బలవంతం చేయాలి, ఆలస్యం చేయకూడదు” అని హమాస్ పిలుపునిచ్చింది. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెళ్లిపోతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, హమాస్ ఆయుధాలు వదులుకోవడానికి ఒప్పుకోలేదు. ఇది నెతన్యాహూ డిమాండ్.

ఈ ఒప్పందం ద్వారా రెండేళ్ల యుద్ధానికి ముగింపు పడే అవకాశం కల్పిస్తోంది. ఒప్పందం అమలు అయిన 72 గంటల్లోపు ఈ విడుదల జరుగుతుంది.2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దులో హమాస్ మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. 1200 మందికిపైగా హతమార్చి, 250 మందికిపైగా బందీలుగా చేసుకున్నారు. ఆ తరువాత ఇజ్రాయెల్ బలగాలు హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై భీకర దాడులకు దిగాయి. హమాస్ ముఖ్య నేతలను హతమార్చారు. ఈ రెండేళ్ల యుద్ధకాలంలో 67వేల మందికిపైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. 1.70లక్షల మంది గాయపడ్డారు. లక్షలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకొని హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చారు. తాజాగా.. మొదటి దశ శాంతి ఒప్పందంలో భాగంగా హమాస్, ఇజ్రాయెల్ సంతకాలు చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. Israel Hamas Signs Ceasefire.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గాజాలో విద్యుత్, నీరు, మందులు లేకపోవడం, ఆసుపత్రులు దెబ్బతినడం పెద్ద సమస్యలుగా ఉన్నాయి. ఈ ఒప్పందం అమలైతే, యుద్ధం ముగిసి, శాంతి పునరుద్ధరణకు మార్గం సుగమమవుతుందని నిపుణులు ఆశిస్తున్నారు. హమాస్ ఆయుధాలు వదులుకోవడం, గాజాలో పాలన ఎవరు సాగిస్తారు వంటి అంశాలపై ఇంకా అస్పష్టతలు ఉన్నాయి. ఇది మిడిల్ ఈస్ట్ శాంతికి చారిత్రక అడుగు అవుతుందని అందరూ భావిస్తున్నారు. సో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.