
Fund Kaveri Engine: పహల్గామ్ ఉగ్రదాడికి భారత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ప్రతిస్పందించిన తర్వాత, దేశంలో రక్షణ సంబంధిత ఆలోచనలు ఊపందుకున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’ కింద భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని గట్టి దాడులు చేయడంతో, దేశవ్యాప్తంగా దేశభక్తి ఉరిక్కెత్తింది. ఈ క్రమంలో, మరో కీలకమైన అంశం ‘కావేరీ ఇంజిన్’ సోషల్ మీడియాలో ప్రధాన చర్చగా మారింది.
ఇది ఒక్క యాదృచ్ఛిక సందర్భం కాదు. ఇటీవలే భారత రక్షణ మంత్రిత్వ శాఖ మాధ్యమ బరువు, లోతైన దూకుడు సామర్థ్యం గల యుద్ధ విమానాలను అభివృద్ధి చేయడానికి ‘అడ్వాన్స్‌డ్ మిడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్ట్‌కు ‘ఎగ్జిక్యూషన్ మోడల్’ను ఆమోదించింది. ఈ పరిణామాల మధ్య, దేశీయ యుద్ధ విమాన ఇంజిన్ అభివృద్ధిపై ప్రజల్లో నమ్మకం బలపడింది. అప్పటినుండి FundKaveriEngine ట్రెండ్ విస్తృతంగా సాగుతుంది.
అసలు కావేరీ ఇంజిన్ అనేది భారత ప్రభుత్వ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ కి చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఫైటర్ జెట్ ఇంజిన్. దీని ప్రాథమిక ఉద్దేశం విదేశీ ఇంజిన్‌లపై ఆధారపడకుండా, దేశీయంగా తేజస్ వంటి యుద్ధ విమానాలకు శక్తిని అందించడం. ఈ ఇంజిన్ 80 కిలోన్యూటన్ థ్రస్ట్ కలిగిన, తక్కువ బైపాస్, ట్విన్ స్పూల్ టర్బోఫ్యాన్ మోడల్. ఇది ట్విన్-లేన్ ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ (FADEC) వ్యవస్థతో పనిచేస్తుంది. అంటే అధిక వేగం, అధిక ఉష్ణోగ్రతల పరిస్థితుల్లోనూ విశ్వసనీయంగా పని చేయగలిగేలా రూపొందించబడింది.
సొంతంగా జెట్ ఇంజిన్ తయారుచేసుకోవడానికి భారత్ గత 40 ఏళ్లుగా శ్రమిస్తోంది. కావేరీ ఇంజిన్ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 3000 కోట్ల వరకూ ఖర్చు చేసింది. అయినా సరే తేజస్ యుద్ధ విమానానికి కావేరి ఇంజిన్‌ను అందించడంలో సఫలం కాలేకపోయింది. అయితే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ సొంతంగా జెట్ ఇంజిన్ తయారు చేస్తుందని ప్రకటించారు. భారత్ తయారు చేయబోయే ఐదో తరం ఫైటర్ జెట్‌లకు స్వదేశీ ఇంజిన్ బిగిస్తామన్నారు. ఈ నేపథ్యంలో 40 ఏళ్లైనా భారత్ ఎందుకు జెట్ ఇంజిన్ తయారు చేయలేకపోయింది? కారణాలేంటి? ఇంజిన్ తయారు చేయడం ఎందుకంత కష్టం? మనం ఎప్పటికీ జెట్ ఇంజిన్ తయారుచేయలేమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇటీవల జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో స్వదేశీ మంత్రం జపించారు. ఈ క్రమంలో విదేశాలపై ఆధారపడకుండా సొంతంగా జెట్ ఇంజిన్ తయారు చేయాలన్న గట్టి సంకల్పాన్ని ప్రకటించారు. మరోవైపు, భారత్ స్వయంగా తయారు చేసే ఐదో తరం ఫైటర్ జెట్‌లలో స్వదేశీ ఇంజిన్‌లు ఉంటాయని.. ఇటీవల జరిగిన ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఫ్రెంచ్ కంపెనీ సఫ్రాన్‌తో కలిసి వీటిని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో జెట్ ఇంజిన్ ఎందుకు సొంతంగా తయారు చేసుకోవాలి? జెట్ ఇంజిన్ తయారీ ఎందుకు అంత కష్టం? జెట్ ఇంజిన్ డిజైన్, బిల్డ్ టెక్నాలజీ ఏయే దేశాల దగ్గర ఉంది? ఇండియా ఎప్పటి నుంచి వీటి తయారీకి ప్రయత్నిస్తోంది? సక్సెస్ ఎందుకు కాలేకపోతోంది? చైనా ఎన్నేళ్లు ట్రై చేసి, సక్సెస్ అయ్యింది..! మనకు ఇక సాధ్యం కాదా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
జాతీయభద్రత, వ్యూహాత్మక స్వతంత్రత కోణంలో సొంతంగా జెట్ ఇంజిన్ తయారు చేసుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం ఈ ఇంజిన్లను భారత్.. జీఈ, రోల్స్ రాయిస్, సాఫ్రన్ వంటి అమెరికా, ఫ్రాన్స్‌కు చెందిన కంపెనీల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇంజిన్లను దిగుమతి చేసుకుంటే.. యుద్ధం, సంక్షోభ సమయాల్లో ఇంజిన్ విడిభాగాలను ఇవ్వడానికి, టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేయడానికి ఆయా దేశాలు నిరాకరించే అవకాశం ఉంది. దీనివల్ల జాతీయ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుంది. ఇక యుద్ధ విమానం తయారీ ఖర్చులో ఒక్క ఇంజిన్‌కే 40 శాతం ఖర్చు అవుతుంది. ఇప్పటికే ఫైటర్ జెట్ల కోసం భారత్ రూ. లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇంజిన్‌ను భారత్‌లోనే అభివృద్ధి చేస్తే.. భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది.
అంతేకాక, భారత్‌లో సరైన టెస్టింగ్ ఫెసిలిటీల లేకపోవడం కూడా ప్రాజెక్ట్ ఆలస్యానికి ప్రధాన కారణం. కావేరీ ఇంజిన్‌ను టెస్ట్ చేయడానికి రష్యాలో డెమో ప్రోగ్రాం చేపట్టాల్సి వచ్చింది. ఇది ఖర్చుతో కూడిన పని మాత్రమే కాకుండా షెడ్యూల్‌లను కూడా లాంగ్ డిలే చేసింది.
ఇండియా సొంతంగా తయారు చేయాలనుకున్న తేజస్ Mk2, ఆమ్కా (AMCA), TEDBF (నావల్ ఫైటర్స్), UAVs కోసం.. స్వదేశీ ఇంజిన్ ఉండటం చాలా ముఖ్యం. లేకుంటే ఈ ప్రాజెక్టులన్నీ విదేశీ దిగుమతులపై ఆధారపడతాయి. ఆయా దేశాలు అనుమతుల్లో ఆలస్యం చేస్తే.. మన ప్రాజెక్టులు ముందుకు కదలవు. మనమే జెట్ ఇంజిన్లు తయారు చేస్తే.. అవసరాలకు తగ్గట్టు మార్చుకోవచ్చు. యుద్ధ విమానాల ప్రొడక్షన్ కూడా వేగంగా జరుగుతుంది. దీనికి ముఖ్య ఉదాహరణ తేజస్ ఫైటర్ జెట్‌లు. జెట్ ఇంజిన్ టెక్నాలజీ ప్రస్తుతం కొన్ని దేశాల వద్దే ఉంది. ప్రపంచంలో మనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కావాలంటే.. సొంత ఇంజిన్ ఉండాల్సిందే.
న్యూక్లియర్ రియాక్టర్లు, రాకెట్ల కన్నా జెట్ ఇంజిన్ తయారు చేయడం చాలా కష్టం. దాదాపు 1500 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఇంజిన్ భాగాలు పనిచేయాలి. దానికోసం సూపర్ అల్లాయ్స్, సెరామిక్ కోటింగ్, అత్యాధునిక కూలింగ్ ఛానెల్స్ కావాలి. ప్రస్తుతం ఇలాంటి వాటిని కొన్ని దేశాలు మాత్రమే తయారు చేయగలుగుతున్నాయి. ఇక జెట్ ఇంజిన్ టర్బైన్ బ్లేడ్లు దాదాపు 20000 rpmతో తిరగాలి. సాధారణ విమానం ఇంజిన్లలో ఇవి దాదాపు 2500-4000 rpmతో తిరుగుతాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత కష్టమో. కొన్ని ఇంజిన్ విడిభాగాల్లో పరమాణు స్థాయి కచ్చితత్వం అవసరం అవుతుంది.
ఫైటర్ జెట్‌కు.. ఏరో డైనమిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్ చాలా ముఖ్యం. సబ్‌సోనిక్, సూపర్‌సోనిక్ వేగాలకు తగ్గట్లు బ్లేడ్లను డిజైన్ చేసేందుకు కంప్యుటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (CFD)పై పరిశోధనలు చేయాలి. ఫైటర్ జెట్లు యుద్ధ సమయాల్లో వేగంగా.. నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుంది. అందుకోసం మన్నిక, భద్రతను బ్యాలన్స్ చేయడం చాలా క్లిష్టమైన పని. సాధారణంగా అత్యాధునిక జెట్ ఇంజిన్ అభివృద్ధి చేయాలంటే.. 15-20 ఏళ్ల టైంతోపాటు పాటు లక్షల కోట్లు ఖర్చవుతాయి. ఈ రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న అమెరికా సైతం F-35 ఇంజిన్ తయారీలో ఇబ్బందులు ఎదుర్కొంది.
ఇంజిన్ ప్రాజెక్ట్ నిలిపివేయబడినట్లు అనిపించినా, ప్రస్తుతం అది మళ్లీ గమ్యం వైపు కదులుతోంది. ప్రస్తుతం రష్యాలో ఫ్లైట్ టెస్టింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు 25 గంటల టెస్టింగ్ మిగిలి ఉంది. ఇతర రంగాల్లో కూడా కావేరీ ఇంజిన్‌కు ఉపయోగాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు: ఘటక్ స్టెల్త్ Unmanned Combat Aerial Vehicle లకు శక్తినివ్వడానికి ఇప్పుడు కావేరీ డెరివేటివ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నారు. గోద్రేజ్ ఏరోస్పేస్ సంస్థ రెండు మాడ్యూళ్లను ఇప్పటికే డెలివరీ చేసింది. ఆజాద్ ఇంజనీరింగ్ సంస్థ, టర్బో గ్యాస్ జనరేటర్ల ఉత్పత్తికి ఒప్పందం కుదుర్చుకుంది. కావేరీ 2.0 ప్రాజెక్ట్ – 2035 తర్వాత తేజస్ Mk1Aలోని GE ఇంజిన్‌లకు ప్రత్యామ్నాయం కావాలనే ఉద్దేశంతో అభివృద్ధిలో ఉంది.
కేవలం గగనతలమే కాదు, సముద్రతలంలో కూడా కావేరీ తన సత్తా చాటుతోంది. భారత నౌకాదళం — GTREతో కలిసి కావేరీ మెరైన్ గ్యాస్ టర్బైన్ (KMGT) ను అభివృద్ధి చేసింది. విశాఖపట్నంలోని నేవీ గ్యాస్ టర్బైన్ టెస్ట్ సెంటర్‌లో ఈ ఇంజిన్ విజయవంతంగా టెస్ట్ అయింది. ఈ ఇంజిన్ చిన్న యుద్ధ నౌకలకు శక్తినివ్వగలదు. భవిష్యత్తులో పెద్ద నౌకలకు అవసరమైన 12 MW కంటే ఎక్కువ పవర్ జనరేట్ చేయగల వెర్షన్‌ను కూడా అభివృద్ధి చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఇది కేవలం ఒక ఇంజిన్ కాదు. ఇది భారతదేశ రక్షణ స్వావలంబన కల. కావేరీ ఇంజిన్ అభివృద్ధి ద్వారా: విదేశీ ఆధారితాన్ని తగ్గించవచ్చు, స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించవచ్చు, భారత్‌కు ఉన్న ఏరోస్పేస్ టాలెంట్‌ను గ్లోబల్‌గా గుర్తించించవచ్చు. అందుకే ప్రజలు FundKaveriEngine అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా ఈ డిమాండ్లను గమనించి, కావేరీ ప్రాజెక్ట్‌కు మరింత స్పష్టతతో ముందడుగు వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆఖరుగా చెప్పాలంటే, కావేరీ ఇంజిన్ కథ ఇది నిరుద్యోగం నుంచి నూతన ఆశల దిశగా భారతదేశం సాగుతున్న ప్రస్థానం. ఇది తక్కువ ఖర్చుతో, అధిక నాణ్యత గల రక్షణ సామర్థ్యాల భవిష్యత్‌కు ద్వారం. Fund Kaveri Engine.
పూర్తి స్వదేశీ టెక్నాలజీతో జెట్ ఇంజిన్ తయారు చేయడానికి మాత్రం సమయం పడుతుంది. దీన్ని భారత్ 20 ఏళ్ల జాతీయ మిషన్‌లా భావించి ముందుకు వెళ్లాలి. దీని కోసం రాజకీయ చిత్తశుద్ధి, నిధుల కేటాయింపు.. పరిశ్రమలు, విద్యా సంస్థలు, మిలిటరీ మధ్య సహకారం అవసరం. ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల సంయుక్త పరిశోధన, సమగ్ర ప్రణాళికతో.. 2040ల నాటికి అత్యాధునిక ఫైటర్ జెట్ ఇంజిన్లు ఉన్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ సగర్వంగా చోటు సంపాదించొచ్చు.