
Seaseed vizag: సముద్రపు నాచు పోషకాల నిధి. ప్రపంచ మానవాళికి దొరికిన అతి చౌకైన అమృత ఆహారం ఇది. కొన్నేళ్ల నుంచి జపనీయులు తమ ఆహారపదార్థాల్లో సీ వీడ్ ను భాగం చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే ఔషధాల్లో, ఎరువుల రూపంలో సముద్రపు నాచు మార్కెట్ విస్తరిస్తోంది. మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లోని సముద్ర తీరాల్లో నాచు సేద్యం పుంజుకుంటోంది. ప్రభుత్వం కూడా సీ విడ్‌పైన సరికొత్త పరిశోధనలు చేస్తోంది. ఏపీలోనూ క్షేత్రస్థాయిలో దీని ఉత్పత్తితో పాటు అనేకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మత్స్యకార మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏపీ మత్స్యశాఖ ఓ ప్రయోగాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విశాఖ సాగరతీరంలో మత్స్యకార మహిళలతో సముద్రపు నాచు పెంపకం చేపడుతున్నారు. ప్రస్తుతం 30 మంది మహిళలతో పైలెట్ ప్రాజెక్టుగా దీనిని చేపట్టారు. త్వరలోనే మరో రెండు చోట్లకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు.
మన దేశం వ్యవసాయాధారిత దేశం.. ఎక్కువ మంది సేద్యంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఒకప్పుడు సంప్రదాయ సాగు విధానాలతో రైతులు సిరులు కురిపించారు. ఇప్పుడు కాలం మారింది..టెక్నాలజీ అవసరం పెరగింది. మూస పద్ధతులను వీడి ఇప్పుడిప్పుడే రైతులు టెక్నాలజీ సాయం తీసుకుంటూ సరికొత్త పంటలు పండిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మత్స్యశాఖ తీసుకున్న నిర్ణయం మత్స్యకార మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. మత్స్యకార మహిళకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ మత్స్యశాఖ సముద్రపు నాచు పెంపకం చేపడుతోంది. పైలెట్ ప్రాజెక్టు కింద మొదట 30 మంది మహిళలకు నాచు పెంపకంలో ట్రైనింగ్ ఇచ్చారు.విశాఖ తీరంలో సముద్రపు నాచు పెంపకం ద్వారా మత్స్యకార మహిళలకు పని కల్పించాలన్నది ప్రధాన ఉద్దేశం. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా..కేంద్ర ప్రభుత్వ సంస్థలైన CMFRI, CAMCRI మత్స్యశాఖ అధికారులకు కావాల్సిన సాంకేతిక సాయం అందిస్తున్నాయి.
తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో సముద్రపు నాచు పెంపకం ఇప్పటికే విజయవంతంగా అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఆ విధానాలను పరిశీలించిన ఏపీ మత్స్యశాఖ అధికారులు.. విశాఖ తీరంలోనూ మహిళల ద్వారా అదే విధానాలను అమలు చేస్తూ సముద్రపు నాచు పెంపకం చేపడుతున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద విశాఖ ఆర్కే బీచ్‌లో ఇందుకోసం రాఫ్ట్ ఏర్పాటు చేశారు. రెండు మహిళా సంఘాల సాయంతో ఈ రాఫ్ట్ వద్ద సముద్రపు నాచు పెంచుతున్నారు. త్వరలోనే మరో రెండు చోట్ల పెంపకం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సీజన్ తో సంబంధం లేకుండా సముద్రపు నాచును సాగు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. 45 రోజుల్లోనే పంట చేతికొచ్చే అవకాశం ఉందంటున్నారు. 50 కిలలో సీవీడ్ వేస్తే.. 200 కిలోల వరకూ సముద్రపు నాచు ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. మరోవైపు సముద్రపు నాచు కేజీ 22 రూపాయల వరకూ పలుకుతోందని అంటున్నారు. 50 కిలోల సీవీడ్ కోసం సుమారుగా 11 వేల వరకు ఖర్చు అవుతుందని.. ఒక్కసారి పంటకు 42 వేల వరకూ వస్తుందని చెప్తున్నారు. Seaseed vizag.
సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో సముద్రపు నాచును ఎక్కువగా తింటుంటారు. సూపుల్లాంటి వాటిలో దీన్ని వేసుకుని తాగుతారు. సాంప్రదాయ వైద్యంలోనూ మందుగా వాడే అలవాటు ఉంది. కొన్ని దేశాల సాంప్రదాయ వంటల్లోనూ దీన్ని చుట్టుకొని తింటారు. అయితే మన దేశంలో ఇప్పుడిప్పుడే దీన్ని తినడం వల్ల వచ్చే ప్రయోజనాలపై అవగాహన పెరుగుతోంది. అందువల్ల దీన్ని తినడం ఇక్కడ ఈ మధ్య కాలంలో ప్రారంభమైందని చెప్పవచ్చు. సముద్రపు నాచును కేకులు, ఐస్‌క్రీమ్స్, బిస్కెట్లు వంటి తినే వదార్థాలతో పాటుగా ఔషధాలు, రసాయనాల తయారీలోనూ వినియోగిస్తారని మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. సముద్రపు నాచులోనూ రకాలు ఉంటాయని.. జాగ్రత్తగా ఎంపిక చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.