27 ఏళ్ల తర్వాత.. నాగ్ సరసన టబు.!

Nagarjuna Tabu: అక్కినేని నాగార్జున సినీ కెరీర్‌లో ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1996లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ కుటుంబ కథా చిత్రం వాణిజ్యపరంగా పెద్ద విజయాన్ని సాధించడమే కాకుండా, టాలీవుడ్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా, ‘కూలీ నెంబర్ 1’ (1991) తో తెలుగు తెరకు పరిచయమైనా, టబుకి మాత్రం ఈ సినిమానే కెరీర్ బెస్ట్ బ్రేక్‌ని ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఇందులో కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్, సందీప్ చౌతా అందించిన సంగీతం ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. నాగార్జున-టబుల జంట అప్పట్లో యూత్‌ని విపరీతంగా ఆకర్షించింది.

‘నిన్నే పెళ్లాడతా’ కంటే ముందే, టబు నాగార్జున కోసం ‘సిసింద్రీ’లో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఈ విజయవంతమైన కాంబినేషన్ మళ్లీ ‘మా ఆవిడే’ సినిమాతో పునరావృతం అయినా, ఆ చిత్రం ఆశించినంతగా విజయం సాధించలేకపోయింది. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపించినప్పటికీ, కాలక్రమేణా ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయిపోయారు.

తాజాగా అక్కినేని అభిమానులకు సంతోషాన్ని ఇచ్చే వార్త ఒకటి టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. నాగార్జున తన 100వ చిత్రాన్ని తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో మొదలుపెట్టారు. ఈ సినిమా లాంచ్‌ ఈ సోమవారం హైదరాబాద్‌లో సింపుల్‌గా జరిగింది. దీనికి ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో నాగార్జున సరసన టబును హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు, చర్చలు పూర్తయి ఫైనల్ అయినట్లు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. టబు విషయానికొస్తే, ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా సినిమాలు చేసిన ఆమె, ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వివిధ భాషల్లో నటిస్తున్నారు. తెలుగులో ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో కనిపించిన టబు, ప్రస్తుతం పూరీ జగన్నాథ్-విజయ్ సేతుపతి ప్రాజెక్టులోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ నాగ్ 100వ సినిమాలో టబు కన్ఫర్మ్ అయితే, ఈ కాంబినేషన్‌కు హైప్ ఖచ్చితంగా పెరుగుతుంది. Nagarjuna Tabu.

నాగార్జున తన సొంత నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతాన్ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రం అయినప్పటికీ, నాగార్జున స్టైల్‌కు తగ్గట్టుగా యాక్షన్ అంశాలను కూడా జోడించారు. ఈ చిత్రంలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారని చెబుతుండగా, టబుతో పాటు కీర్తి సురేష్ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. నాగ్ వందో సినిమా కావడంతో, ఇందులో నాగ చైతన్య మరియు అఖిల్ కూడా అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారనే టాక్ ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలన్నీ గోప్యంగా ఉంచి, సరైన సమయం చూసి ఒక్కొక్కటిగా అధికారికంగా వెల్లడించాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.