అరకు కాఫీకి కొత్త కష్టం..!!

Berry Borer Araku Coffee: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు కాఫీ రైతులకు పెద్ద కష్టం వచ్చింది. ప్రస్తుతం ఏపీలోని ఏజెన్సీలో సాగవుతున్న కాఫీ తోటలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన అరకు వ్యాలీ లోని కాఫీ తోటలలో బెర్రీ బోరర్ అనే పురుగు పట్టింది. ఈ పురుగు కాఫీ తోటలను నాశనం చేస్తుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కాఫీ రైతులకు అండగా రంగంలోకి దిగింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన అరకు కాఫీకి కొత్త ముప్పు వచ్చింది. కాఫీ పంటను సర్వనాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన కాఫీ బెర్రీ బోర్ అనే తెగులు ఏజెన్సీ ప్రాంతాల్లో మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. 2000లో ఈ తెగులును హవాయిలో గుర్తించారు. అంతర్జాతీయంగా కాఫీ తోటలను నాశనం చేసే ఈ తెగులును మొదటిసారిగా మన ప్రాంతంలో గుర్తించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

వారం రోజుల క్రితం అరకులోయ మండలం, పకనకుడి గ్రామంలోని సిరగం సువర్ణ అనే రైతుకు చెందిన కాఫీ తోటలో ఈ తెగులును కేంద్ర కాఫీ బోర్డు అధికారులు గుర్తించారు. పకనకుడి గ్రామంతో పాటు పరిసర మాలిసింగరం, మాలివలస, తుర్రయిగూడు, మంజగూడలోనూ కొన్ని మొక్కల్లో ఈ తెగులు కనిపించినట్టు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు. హైపోథెనెమస్ అనే ఈ కీటకం కాఫీ పండులోకి రంధ్రం చేసుకుని ప్రవేశిస్తుంది. లోపలున్న గింజను పూర్తిగా తినేసి, అక్కడే సొరంగాలు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడుతుంది. ఒక్కో కీటకం 50కి పైగా కాఫీ కాయ లోపల ఏర్పాటు చేసుకున్న సొరంగంలో గుడ్లు పెడుతుంది. 35 రోజులకు ఒక్కో గింజ నుంచి 30 నుంచి 40 కీటకాలు పుట్టుకొచ్చి, ఇతర కాయలకు వేగంగా వ్యాపిస్తాయి. ఈ విధంగా పంటను పూర్తిగా నాశనం చేసే శక్తి ఈ తెగులుకు ఉంది. ఈ తెగులు ఉనికిని గుర్తించిన వెంటనే కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. తెగులు నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తూ, తెగులు వ్యాప్తిని అంచనా వేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

ఈ తెగులు వ్యాప్తిని ప్రాథమిక స్థాయిలోనే నియంత్రించాలంటే కాఫీ కాయలన్నీ సేకరించి వేడినీళ్లలో ముంచి గొయ్యిలో పూడ్చివేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాఫీ తోటల్లో ఎకరానికి పది చొప్పున ట్రాఫ్‌లను ఏర్పాటు చేయాలి. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులందరూ ఆర్గానిక్‌ పద్ధతిలో కాఫీ పంటను సాగు చేస్తున్నారు. ఈమేరకు కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు నివారణకు రసాయనిక పద్ధతులను అధికారులు సిఫారసు చేయడం లేదు. బెవేరియా బెస్సియానా శిలింద్రరం ద్వారా బోరర్‌ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈశిలింద్రం మొక్కలపై పిచికారీ చేయడం వల్ల ఆడ కీటకాలు చనిపోతాయన్నారు. ప్రస్తుతం అరకులోయ, చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో మాత్రమే కాఫీ బెర్రీ బోరర్‌ బయటపడింది. ఇతర ప్రాంతాల రైతుల తోటల్లో ఎక్కడైన ఈతెగులు ఉందా? అనే విషయాలను గుర్తించేందుకు ఏడుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటైంది. Berry Borer Araku Coffee.

అరకు కాఫీ రైతులు భయపడుతున్న బెర్రీ బుర్ర వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని అధికారులు చెబుతున్నారు. ఈ పురుగు 80 ఎకరాలకు మాత్రమే వ్యాపించిందని, దీని పై నిపుణులతో మాట్లాడి నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. ఏజెన్సీ లో లక్షా 90 వేల ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయని , మరో లక్ష ఎకరాలు కూడా సాగును పెంచుతాం అని జిసిసి చైర్మన్ కిడారి శ్రవణ్ తెలిపారు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q