కొబ్బరితో రైతులకు కాసుల పంట..!!

Konaseema Coconut Farmers: కొడుకు కన్నా కొబ్బరి చెట్టు మిన్న అనేది కోనసీమ వాసుల నానుడి. దీనిని బట్టి కొబ్బరి చెట్టు ఎంత విలువైందో అర్థం చేసుకోవచ్చు. ఒక కుటుంబానికి పది కొబ్బరి చెట్లు ఉంటే ఆ కుటుంబ పోషణ సాఫీగా సాగిపోతుందని కోనసీమ వాసుల ధైర్యం. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో లక్షా 6వేల ఎకరాల్లో కొబ్బరి సాగులో ఉంది. అయితే గత కొంత కాలంగా కొబ్బరికి తెగులు సోకడం, దిగుబడి తగ్గడం మార్కెట్ లో ఆశించిన ధర లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొబ్బరి అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా తెలపడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో అసలు కొబ్బరితో ఎలాంటి ఉప ఉత్పత్తులు తయారు చేయవచ్చు? వాటి ద్వారా రైతు ఏమేరకు లాభం చేకూరుతుందో ఇప్పుడు చూద్దాం.

కొబ్బరి సాగుచేసే దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక తరువాత స్థానం ఆంధ్రప్రదేశ్​లోని కోనసీమ కొబ్బరికే దక్కుతుంది. కొబ్బరి కాయల ఉత్పత్తిలో దేశంలో నాలుగో స్థానం, ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉంది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షా 26వేల ఎకరాల్లో కొబ్బరి పంట విస్తరించి ఉంది. దాదాపు 60వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో లక్ష మంది కార్మికులు కొబ్బరి సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. కోనసీమ ప్రాంతం నుంచి ఏడాదికి కాయలు, కురిడీలు, కొత్తకొబ్బరి, నూనె తదితర ఉత్పత్తులతో కలిపి 600 కోట్ల రూపాయల ఎగుమతులు అవుతున్నాయి. అంత ప్రాధాన్యమున్న ఈ ప్రాంతంలో ప్రాసెసింగ్ ప్లాంట్లు లేక కొబ్బరి రైతులు వెలవెలబోతున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అనేక ఉప ఉత్పత్తుల పరిశ్రమలను నెలకొల్పారు. దీంతో అక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి మార్గాలు లభించాయి. అయితే ఇక్కడ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే రాజోలు నియోజకవర్గంలోని తూర్పుపాలెం, పి.గన్నవరం నియోజకవర్గంలోని పెదపట్నంలంక, అమలాపురం నియోజకవర్గంలోని ఉప్పలగుప్తంలో కామన్‌ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని రాష్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

కొబ్బరి అనుబంధ పరిశ్రమల విస్తరణతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. మంచి ధరతోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి సాధించవచ్చు. ఆరోగ్యానికి ఉపకరించే కొబ్బరి నీటిని తాజాగా ఉండేలా ప్యాకెట్లలో నింపి విక్రయించవచ్చు. కొబ్బరి నీటిని పొడిగా మార్చి ప్యాకెట్లలో నిల్వ చేసి అమ్మొచ్చు. ఎండు కొబ్బరి నుంచి గుజ్జు తీసి పొడి రూపంలో విక్రయించవచ్చు కొబ్బరిపాలు, పాలపొడి తయారు చేయవచ్చు. కొబ్బరి డొక్క నుంచి పీచు తయారు చేసి పలురకాల తాళ్లు, బొమ్మలను రూపొందించవచ్చు. పచ్చి కొబ్బరి నుంచి సేకరించే వర్జీన్‌ కోకోనట్‌ ఆయిల్,డెసికెడెట్‌ కోకోనట్‌ ఫౌడర్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో ఇలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేస్తే రైతుకు లాభం. వీటితో పాటు కొబ్బరిపాల నుంచి లభించే డ్రింక్స్, లడ్డు, కారం, చిప్స్, జున్ను వంటి తదితర పరిశ్రమలకు సైతం అనుకూలం. అదే విధంగా పీచు, తాడు, ఇటుకల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుండటం హర్షించాల్సిన విషయం. Konaseema Coconut Farmers.

కోనసీమలో కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని అంటారు. ఎందుకంటే దీని నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తితోనూ ఆదాయం పొందొచ్చు. కొబ్బరి పంటకు నిలయమైన కోనసీమ జిల్లాలో వాటి అనుబంధ పరిశ్రమలు కూడా విస్తరించి విభిన్న ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి తీసుకువెళ్తే రైతులకు మంచి ధర దక్కుతుంది.