
Kadapa Madhavi Reddy: గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో దుమ్మురేపే విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ నియోజకకవర్గంలో పట్టుకోల్పోయే పరిస్తితి తెచ్చకుందట. సొంత పార్టీ నేతల మధ్య సఖ్యత లేక రోడ్డుకెక్కుతున్నారట. దీంతో ఏం చేయాలో అర్థంకాక కార్యకర్తలు దిక్కులు చూస్తున్నట్లు తెలుస్తోంది.
కడప జిల్లా పేరు వింటేనే దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు గుర్తుకొస్తుంది. నాలుగు దశాబ్దాలుగా కడప జిల్లాలో వైఎస్ కుటుంబమే హవా చెలాయిస్తూనే ఉంది. అయితే 2024లో కూటమి నేతలు ఊహించని రీతిలో కడప జిల్లా పై పట్టు సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిపాజిట్లు కోల్పోయేటట్లు కడప జిల్లా ప్రజలు చేశారా.2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఓ నియోజకవర్గంలో గడ్డు పరిస్తితులు ఎదుర్కొంటోందట.
కడప నియోజకవర్గం అంటేనే జిల్లా రాజకీయాలకు గుండె లాంటిది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి ఘనవిజయం సాధించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి కొద్దిరోజులకే నియోజకవర్గ నేతల్లో సఖ్యత లోపించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా టీడీపీ దిగువ స్థాయి కేడర్ మీద మాధవీరెడ్డి పట్టుకోల్పోతున్నారట. కేవలం మాధవీరెడ్డి తన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పార్టీ అధిష్టానం దగ్గర కూడా కూసింత చర్చ జరిగినట్లు కూడా తెలుస్తోంది.
అధికారం లేనప్పుడు పార్టీని భుజాలపై మోసిన కార్యకర్తలను పట్టికోవడం లేదన్న ఆరోపణలే కాదు, కేవలం ఆమె ఓ సామాజిక వర్గానికి చెందిన వారికే పెద్దపీట వేస్తున్నట్లు కూడా కడప నియోజక వర్గంలో ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది మండల స్థాయి నేతల్లో అసమ్మతి సెగలు రేగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ, జనసేన నేతలను కనీసం మర్యాదకోసమైనా ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదట. దీంతో ఆ రెండు పార్టీల నేతలు ఎంఎల్ఏకి దూరంగా ఉన్నారట. అంతేకాదు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీడియా సమావేశం పెట్టిమరీ తమ గోడు చెప్పుకున్నారట.
ఈ తాజా పరిణామాలను బేరీజు వేసుకుంటున్న వైసీపీ కడప నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందట. ఇప్పటి నుంచే ఫ్యాన్ పార్టీ నేతలు గ్రామ స్థాయి నుంచి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష. అప్పటి నుంచీ కడప సీటుపై నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారట. ఇదే సమయంలో కడప నియోజకవర్గంలో నెలకొన్న తాజా పరిస్తితులపై ఇప్పటికే జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీందర్ నాథ్ రెడ్డితో చర్చించినట్లు తెలుస్తోంది. Kadapa Madhavi Reddy.
గత ఎన్నికల్లో కోల్పోయిన వైభవాన్ని రాబోయే కడప కార్పొరేషన్ ఎన్నికలతో తెచ్చుకోవాలని వైసీపీ భావిస్తోందట. ఇప్పటికే కొంతమంది కూటమి నేతలతో రవీందర్ నాథ్ రెడ్డి టచ్ లోకి వెళ్లినట్లు కూడా కడపలో ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికలు దగ్గర పడేకొద్దీ కడప నియోజకవర్గ రాజకీయ పరిస్తితి ఎన్ని మలుపులు తిరుగాయో వేచిచూడాల్సిందే.