2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహ..!!

YCP chief Jagan Mohan Reddy: వైసీపీ అధినేత జగన్ ముందుగానే మేల్కొన్నారా.. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారా. గ్రూప్ లకు చెక్ పెట్టి పార్టీ నేతలు ఏకతాటిపై వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారా. ఇందుకోసం శ్రీకాకుళం జిల్లా నేతలకు వైయస్ జగన్‌ ఇచ్చిన క్లారిటీ ఏంటి. ఆ విధానాన్నే ఏపీ వ్యాప్తంగా అమలు చేస్తారా. తాజా పరిస్తితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లా నేతలకు వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన క్లారిటీ వెనుక పెద్ద చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో అవాక్కయిన జగన్ ఈ సారి తన వైఖరి మార్చుకున్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస,టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం , ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ ఎనిమిది స్థానాల్లో గత ఎన్నికల్లో కూటమి పైచేయి సాధించి వైసీపీని కోలుకోలేని దెబ్బ తీసింది. దీన్ని గుణపాఠంగా తీసుకోవాలని భావించిన జగన్, దిద్దుబాటు చర్యలకు ప్లాన్ చేస్తున్నారట.

ఇందులో భాగంగా ఇచ్చాపురం వైసీపీ నేతలకు స్పష్టంగా చెప్పేశారట జగన్. ఇచ్చాపురం స్థానానికి సిట్టింగ్ ఇంచార్జి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు, రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఇచ్చాపురం అభ్యర్థి అంటూ క్లారిటీ ఇచ్చేశారట. నియోజక వర్గంలో గ్రూపులకు చెక్ పెట్టేందుకే జగన్ మోహన్ రెడ్డి తన నిర్ణయం ప్రకటించారని పార్టీలో అంతర్గతం గా చర్చ నడుస్తోంది. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజక వర్గంలో కళింగ, రెడ్డి, యాదవ సామాజిక వర్గాల పార్టీ నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఈ పరిస్తితి టీడీపీకి ప్లస్ పాయింట్ అవుతుందని తన నివేదికలో తెల్సుకోవడం వల్లే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగోతోంది.

వాస్తవానికి యాదవ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ, రెడ్డి సామాజిక వర్గానికి మూడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు, కళింగ సామాజిక వర్గానికి జెడ్పీ చైర్మన్ పీఠం వైసీపీ గత ప్రభుత్వ హయాంలో అప్పజెప్పింది వైసీపీ అధిష్టానం. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం అభ్యర్థులను మార్చాలని ఒకానొక సమయంలో జగన్ దృష్టి కి తీసుకు వెళ్ళినా అధినేత మాత్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు ఫ్యాన్ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఇచ్చాపురంలో విజయ, పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి కొద్ది రోజుల క్రితం అధినేత గుడ్ న్యూస్ చెప్పేశారట. వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్ చెప్పడంతో వైసీపీ ఇంచార్జులలో కొత్త జోష్ కనిపిస్తోంది.

మరోవైపు శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆముదాలవలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంలకు మాత్రం జగన్ నిర్ణయం మింగుడు పడటం లేదన్న వాదన వినిపిస్తోందట. అలాగే పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై నియోజక వర్గ నేతలు ఫిర్యాదు చేసినా పలాసలో మళ్లీ అప్పలరాజుకే జగన్ సపోర్ట్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఎచ్చెర్ల, టెక్కలి నియోజక వర్గాల్లో వైసీపీ ఇంచార్జిలపై పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నియోజక వర్గాల్లో సమన్వయ కర్తలను మార్చే అవకాశాలు ఉన్నట్లు వైసీపీ నేతలు భావిస్తున్నారట. YCP chief Jagan Mohan Reddy.

ఇక నరసన్నపేటలో మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ విన్నపంతో ఇక్కడ వైయస్ఆర్ సీపీ ఇంచార్జిగా ఆయన కుమారుడు డాక్టర్ కృష్ణ చైతన్య పేరు ఖరారు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వైసీపీ అధినేత జగన్ మూడున్నరేళ్లకు ముందుగానే తమ అభ్యర్థుల విషయంలో స్పష్టంగా ఉన్నట్లు వైసీపీ నేతలకు క్లారిటీ వచ్చిందట. దీంతో పార్టీలో గ్రూపులకు అవకాశం లేకుండా అందరూ ఒకేతాటిపై ఉండాలన్నది కూడా నేతలకు అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్లు అర్థం అవుతోందట.