
Kurnool Constituency Andhra Pradesh: కర్నూలు జిల్లాలో ఆయన పేరు మోసిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేత. తండ్రి ఉమ్మడి రాష్ట్రా నికి రెండుసార్లు ముఖ్య మంత్రిగా పనిచేశారు. ఆయనేమో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న టాక్ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకు ఎవరా నేత. ఆయన వెనుక నడుస్తున్న స్టోరీ ఏంటి. చూద్దాం.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. కర్నూలు జిల్లాలో సీనియర్ పొలిటీషన్. మూడుసార్లు ఎంపీగా పనిచేసిన ఆయన, అప్పట్లో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కనుమరుగు అవ్వడంతో టీడీపీలో చేరారు సూర్యప్రకాష్ రెడ్డి. కోట్ల కుటుంబ వారసుడిగా తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరించారు. 2019లో కర్నూలు సీటు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు సూర్యప్రకాష్ రెడ్డి. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో డోన్ సీటు నుంచి గెలిచారు. Kurnool Constituency Andhra Pradesh.
సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరే ముందు చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారట. అన్నీ ఓకే అనుకున్న తర్వాతే ఆయన టీడీపీలో చేరారట. అయితే గెలిచిన తర్వాత తాను అనుకున్నది ఒకటి, జరుగుతోంది మరొకటిగా ఉందని సూర్యప్రకాష్ రెడ్డి ఫీల్ అవుతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోందట. డోన్ నియోజకవర్గ అభివృద్దికి వంద కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపారట సూర్యప్రకాష్ రెడ్డి. దీనిపై ఇప్పటి దాకా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్న ప్రచారం జరుగుతోంది. అలాగే డోన్ పాత ప్రభుత్వ ఆస్పత్రి పునరుద్దరణ పనులు నిలిచిపోయాయి. వాటికి కూడా నిధులు మంజూరు చేయించుకోవడంలో కోట్ల విఫలం అయినట్లు తెలుస్తోంది. అలాగే కుండ క్లస్టర్ యూనివర్శిటీలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలంటూ సీఎం చంద్రబాబుతో పలుమార్లు మాట్లాడారట సూర్యప్రకాష్ రెడ్డి. ఇంత వరకూ ఆ ఊసే లేదు. అంతేకాదు, నామినేటెడ్ పదవుల్లో తన మార్క్ చూపించాలనీ, తన వారికి న్యాయం చేయాలని భావించిన సూర్య ప్రకాష్ రెడ్డి అధిష్టానం నుంచి చుక్కెదురైనట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక డోన్ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డికి వాస్తవంగా గత ఎన్నికల్లో టిక్కెట్ రావాల్సి ఉంది. కానీ కోట్ల కోసం ఆయన వెనక్కి తగ్గారు. దీంతో సుబ్బారెడ్డికి సీడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చేలా చేశారు సూర్యప్రకాష్ రెడ్డి. ఆ తర్వాత నుంచీ సుబ్బారెడ్డి గేర్ మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గం చుట్టేస్తున్న ఆయన, సొంతంగానే జనంలోకి వెళ్తున్నారట. కనీసం తాను చేస్తున్న కార్యక్రమాలకు ఎంఎల్ఏ సూర్యప్రకాష్ రెడ్డిని కూడా పిలవడం లేదు సరికదా, పోస్టర్లలో ఆయన ఫొటో కూడా పెట్టనీయడం లేదన్న టాక్ డోన్ నియోజకవర్గంలో నడుస్తోంది. దీంతో నియోజకవర్గంలో సూర్యప్రకాష్ రెడ్డి బలం తగ్గుతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొన్నటి కడప మహానాడుకు సైతం సూర్యప్రకాష్ రెడ్డి వెళ్లలేదు. దీంతో సూర్యప్రకాష్ రెడ్డి, పార్టీ అధిష్టానం మధ్య గ్యాప్ బాగా పెరిగినట్లు నియోజకవర్గంలో బలమైన టాక్ నడుస్తోంది.మొత్తానికి కోట్ల వారసుడిగా డోన్ రాజకీయాల్లో ముందున్న సూర్యప్రకాష్ రెడ్డి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై ఇప్పుడు నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.