
Palnadu District Sand Mafia: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పరిసర ప్రాంతాలలో మట్టి మాఫియా ఆగడాలకు అంతేలేకుండా పోతుంది.దేవస్థానం భూములు ,ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు,వాగులు వంకలు అనే బేధం లేకుండా తవ్వకాలు జరిపి విచ్ఛల విడిగా మట్టిని అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నారు. స్థానిక శాసనసభ్యునికి అల్లుడిగా చెప్పుకుంటున్న వ్యక్తి కనుసన్నలలోనే ఈ మట్టి దోపిడీ జరుగుతోందనే ఆరోపణల నేపధ్యం లో ప్రభుత్వ అధికారులు సైతం ఆవైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.అధికారులు అడపాదడపా తనిఖీలు చేసినా తూతూమంత్రంగా చర్యలు తీసుకుని వదిలేస్తున్నారనే ఆరోపణలు సైతం లేకపోలేదు.మరో వైపు కొందరు అధికారులు సైతం మట్టిదందాలో తమ వంతు పాత్రపోషిస్తూ… రెండుచేతులా సంపాదిస్తున్నారనే ఆరోపణలు సైతం లేకపోలేదు.
మట్టి మాఫియా ఆగడాలు ఎంతగా శృతిమించాయంటే చివరికి రాష్ట్రం లోనే పేరుగాంచిన ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండను సైతం వదలకుండా మట్టిని తవ్వి అమ్ముకుంటూ భారీగా సొమ్ముచేసుకుంటున్నారు.మట్టిమాఫియా ఆగడాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా దేవాదాయ, మైనింగ్ ,రెవెన్యూ ,ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లకు చెందిన అధికారులు కనీసం పట్టించుకోకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిలాపాపం తలాపిడికెడు అన్నరీతిలో మట్టి మిఫియా సొమ్ము లో ఎవరివాటాలు వారికి అందడం వల్లనే అధికారులు ఆవైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. సాక్ష్యాత్తూ ఆ పరమేశ్వరుడు కొలువైన త్రికూట పర్వతాలకే రక్షణ లేక పోతే ఇక ప్రభుత్వ భూములకు దిక్కెవరని చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇక నరసరావుపేట పట్టణానికి కూతవేటు దూరంలోని ఓ గ్రామంలో చెరువుమట్టి అమ్ముకునే వ్యవహారంలో రెండువర్గాలమధ్య ఘర్షణ జరగడంతో ఈ వ్యవహారం కేసుల వరకూ వెళ్ళింది.దీంతో ఈ విషయం బయటికి పొక్కి జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య రాజీకుదిర్చిన ఓ అధికారి అదే ప్రాంతంలో ఓ దేవస్థానంలో కీలక అధికారిగా పనిచేస్తున్న తన భార్య ద్వారా సదరు దేవస్థానానికి చందాల రూపంలో వారివద్ద నుండి లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. Palnadu District Sand Mafia.
అనుమతులు లేకుండా అక్రమతవ్వకాలు చేయడం ఓ ఎత్తైతే ఆ తవ్వకాలు 20 నుండి 25 అడుగుల లోతు వరకు వెళ్ళడంతో ఆ ప్రాంతం లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానిక పశువుల కాపరులుఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ అనేక పశువులు క్వారీగుంతలలో పడి మరణించాయని ఆ గుంతలను పూడ్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.అలాగే క్వారీల నుండి మట్టిని తరలించే లారీలు అధిక బరువుతో వెళ్ళడంతో రహదారులు సైతం ధ్వంసం అవుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోని నరసరావుపేట పరిసరప్రాంతాలలో జరుగుతున్న అక్రమమైనింగ్ దందాను అడ్డుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q