
Seshachalam Forest Red Sandalwood: శేషాచలం అడవుల్లో కేవలం ఎర్రచందనమే స్మగ్లింగ్ జరుగుతోందా. ఈ పేరుతో అరుదైన జంతువుల వేట కొనసాగుతోందా. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ పేరుతో అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారా. తాజా పరిస్తితులు చూస్తే అంతా అవుననే సమాధానం వస్తోంది.
శేషాచలం అటవీ ప్రాంతంలో తిరుమల క్షేత్రం అంతర్భాగంగా ఉంది. తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో కొంతభాగం శేషాచలం అటవీ ప్రాంతం ఉంది. శ్రీవారు కొలువైన శేషాచలం అటవీ ప్రాంతం అరుదైన వృక్ష, జంతుసంపదకు నిలయంగా ఉంది. ఇలాంటి అడవుల్లో మాత్రమే లభించే ఎర్రచందనం వృక్షాలకు అంతర్జాతీయ మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. వాటిని స్మగ్లర్లు కొల్లకొట్టకుండా, సంరక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. అయితే టాస్క్ ఫోర్స్ కళ్లుగప్పి ఎర్రచందనం మాటున వేటగాళ్లు వన్యప్రాణులను కూడా వేటాడుతున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే, శేషాచలం అడవుల్లో పునుగుపిల్లి, బంగారుబల్లి, ఎలుకజింక, నాలుగు కొమ్ముల జింక, కొండగొర్రె, ఎలుగుబంటి, చిరుతపులి, ఏనుగులకు ఆవాసంగా ఉంది. ఇవి ఇప్పుడు వేటగాళ్లకు టార్గెట్ అవుతున్నాయి. తాజాగా హైదరాబాదులో నమోదైన ఏనుగు దంతాల కేసు మూలాలు శేషాచలంలోనే ఉన్నాయని తెలియడంతో ఈ అనుమానాలు నిజమే అనిపిస్తున్నాయి. ఇన్నేళ్లు ఎర్రచందనం అక్రమ రవాణా మీదనే దృష్టి సారించిన అటవీ శాఖ అధికారులను తాజా ఉదంతం ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేసింది.
కోట్లు విలువ చేసే ఏనుగు దంతాల అక్రమ రవాణాకు శేషాచలంలో ఎప్పుడో బీజం పడిందని తాజా ఘటన నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది. ఎర్రచం దనం కోసం అడవిలోకి ప్రవేశిస్తున్న స్మగ్లర్లు, వన్యప్రా ణులనూ వదిలి పెట్టడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయి. శేషాచలం అడువుల సంరక్షణతో పాటు వన్యప్రాణుల రక్షణ కోసం డ్రోన్లు, వైర్లెస్ సెట్స్, నైట్ మోడ్ కెమెరాలు, మోషన్ క్యాప్చర్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా, ఎంతవరకు ప్రయోజనం చేకూరింది అన్నది మాత్రం ప్రశ్నార్థకరంగా మారింది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా మీద అటవీశాఖ పెట్టిన శ్రద్ద, ఏనుగుల రక్షణపై పెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఏనుగు దంతాలను అటవీ సరిహద్దులు దాటిస్తుంటే టాస్క్ ఫోర్స్ బలగాలు, అటవీశాఖ తనిఖీ సిబ్బంది ఎందుకు పసిగట్టడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. Seshachalam Forest Red Sandalwood.
ఇక ఏనుగు దంతాలను తరలిస్తూ పట్టుబడ్డ డైవర్ ప్రసాద్ అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన వ్యక్తి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఫిబ్రవరిలో టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కి జైలుకు కూడా వెళ్లాడు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ బస్సులో ప్రయాణిస్తున్న అతని దగ్గర ఏనుగు దంతాలు లభించడం సంచలనం కలిగించింది. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోని అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ హయాంలో ఏనుగులను చంపి వాటి దంతాలను స్మగ్లింగ్ చేసేవారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏనుగులను వేటాడి చంపిన దాఖలాలు లేవు. తాజాగా ప్రసాద్ దగ్గర పట్టుబడ్డ ఏనుగు దంతాలు, ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.
2013లో తలకోన అటవీ ప్రాంతాల్లో రెండు ఏనుగులు ప్రమాదవశాత్తు మృతి చెందాయి. ఇందులో ఒక ఏనుగుకు సంబంధించిన దంతాలు పోస్టుమార్టం అనంతరం తొలగించి భాకరాపేట రేంజ్ ఆఫీసులో భద్రపరిచారు. అయితే 2023లో భాకరాపేట రేంజ్ ఆఫీసులో ఉన్న ఏనుగు దంతాలతో పాటుగా ఒక గన్ కూడా దొండల పాలైంది. దీనిని గుర్తించిన ఆటవీశాఖ అధికారులు, భాకరాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కేసులో నిందితులు ఎవరో గుర్తించలేకపోయారు. అయితే ఈ చోరీ జరిగిన విషయాన్ని అధికారులు రహస్యంగా ఉంచారు. అటవీశాఖ ఉన్నతాధికారులకు సైతం ఈ విషయం తెలుసా అన్నది అనుమానంగానే ఉంది. భాకరాపేట పోలీసే స్టేషన్లో 87-23 నంబర్తో కేసు కూడా నమోదైంది. దాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత భాకరాపేట రేంజ్ ఆఫీసులో ఆదృశ్యమైన దంతాలు, హైదరాబాదులో పట్టుబడ్డ దంతాలు ఒకటేనేమో అన్న అనుమానంతో అటవీశాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. ఏనుగు దంతాలు, గన్ మాయం కావడంతో బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని అటవీశాఖ అధికారులు భయపడ్డారు. కానీ ఇప్పుడు అదే నిజమైతే కచ్చితంగా ఒప్పుకోవాల్సి వస్తుంది.