చిత్తూరు వైసీపీలో లిక్కర్ టెన్షన్..!!

Chittoor YCP Liquor Scam: లిక్కర్ స్కాంలో చిత్తూరు జిల్లా వైసీపీ నిండా మునిగిపోయారా. ఒకరి తర్వాత మరొకరు అరెస్ట్ అవ్వడం చూస్తుంటే రాబోయే రోజుల్లో మరింత మంది జైలుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయా. ఎప్పుడు ఎవరిని పిలుస్తారో అర్థం కాక ఫ్యాను పార్టీ నేతలు తెగ టెన్షన్ పడుతున్నారా. తాజా పరిస్తితులు అవుననే సమాధానం ఇస్తున్నాయట.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైసీపీ నాయకుల చుట్టూ తిరుగుతోంది. రోజుకొకరు సిట్ విచారణకు హాజరుకావడం, వారి ఇళ్లలో, ఆఫీసుల్లో సోదాలు జరుగుతుండడం.. ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవడం చూస్తూంటే తర్వాత ఎవరి వంతన్న ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతోంది. ఇప్పటికే జగన్ పార్టీకి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇక మాజీ సీఎం నారాయణస్వామి, వైసీపీ నేత విజయానంద్, చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు ఆయన తల్లిని కూడా సిట్ అధికారులు విచారించారు. కొన్ని సందర్భాల్లో సోదాలు నిర్వహించారు. ఎప్పుడు ఎవరిని పిలుస్తారో అర్థంకాక వైసీపీ నేతలు కూడా తెగ టెన్షన్ పడుతున్నారట.

కొద్ది రోజుల క్రితం చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల్లో సిట్ చేపట్టిన సోదాల్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు బీవీరెడ్డి కాలనీ, నలందా నగర్లో విజయానంద రెడ్ ఆఫీసులను సిట్ అధికారులు తనిఖీ చేశారు. చిత్తూరులోని సిఎంఆర్ కంపెనీ పేరుతో ఉన్న కార్యాలయంలో వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బేవరేజెస్ అనే బోర్డు కనిపించింది. ఈ కంపెనీ వైసీపీ నేత విజయానంద్ రెడ్డికి చెందిన సంస్థగా గుర్తించారు. ఇదే కార్యాలయంలో మోహిత్ రెడ్డి కంపెనీ వివరాలు, కీలక డాక్యుమెంట్లు కూడా బయటపడ్డాయి. హైదరాబాద్ ప్రశాంతి హిల్స్ లో భీం స్పేస్ కార్యాలయం దగ్గర ఈషా ఇన్ ఫ్రా ఆఫీసును సిట్ అధికారులు గుర్తించారు. ఈ కంపెనీలో డైరెక్టర్లుగా సజ్జల భార్గవ రెడ్డి, ప్రద్యుమ్న ఉన్నట్లు తేలింది.

ఇక వరుస తనిఖీలతో లిక్కర్ స్కాంలో నిందితుల లింకులు, డబ్బు, డొల్ల కంపెనీల వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడం సంచలనం రేపుతోంది. 2024 ఎన్నికల్లో విజయానంద రెడ్డి వైసీపీ అభ్యర్థిగా చిత్తూరు అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఆయన్ని విచారించిన సీట్ అధికారులు, వైసీపీ పాలనలో మద్యాన్ని దుకాణాలకు సరఫరా చేసింది విజయానందేనని తేల్చారు. అంతేకాదు, మద్యం ముడుపుల సొమ్ముతో వందల ఎకరాల భూములు కొని బ్లాక్‌ మనీని వైట్‌ మనీగా మార్చుకునేందుకు చెవిరెడ్డి ఎత్తుగడ వేసినట్లు తేలంది. ఆరు కోట్ల రూపాయలకు 260 ఎకరాల భూమి కొన్న చెవిరెడ్డి, రెండు నెలల తర్వాత ఆ భూమిని 26 కోట్ల రూపాయలకు అరబిందో శరత్ చంద్రారెడ్డికి అమ్మేశారట. వచ్చిన లాభాలతో తిరుపతి పరిసరాల్లో స్థిరాస్తులు కొనడంతో పాటు కొన్నిచోట్ల లేఅవుట్లు వేశారట. అంతేకాదు, తన లేఅవుట్లకు తుడా నిధులతో రహదారులు, మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేసుకున్నారట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దీనికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను తుమ్మలగుండలోని చెవిరెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. అలాగే చెవిరెడ్డి ఇంటి అడ్రస్సుతో 8 కంపెనీలు రిజిస్టర్ అయినట్లు కూడా గుర్తించారు. Chittoor YCP Liquor Scam.

అంతేకాదు, మద్యం కేసులో సజ్జల భార్గవరెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారట. అలాగే ప్రద్యుమ్మకు చెందిన ఈషా ఇన్‌ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో సజ్జల భార్గవ్, చెవిరెడ్డి వ్యాపార లావాదేవీలు జరిపినట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తిమ్మనాయుడుపాలెంలో 19 మంది రైతులకు చెందిన 11 ఎకరాల్లో అపార్ట్‌మెంట్స్ నిర్మిస్తామని రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నారట. కానీ 2024లో వైసీపీ ఓటమితో నిర్మాణాలకు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, లిక్కర్ స్కామ్‌ బయటపడటంతో ప్రద్యుమ్నను విదేశాలకు పంపింది కూడా చెవిరెడ్డేనన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మొత్తానికి తాజా పరిస్తితులతో చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు తెగ టెన్షన్ పడుతున్నట్లు స్వయంగా ఆ పార్టీ వారే చెబుతున్నారట.