ఆ నియోజకవర్గం లో ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంద..?

Srikakulam Constituency In-charge: వైసీపీ అధినేత జగన్ ఆదేశించింది ఒకటి.. ఆ నియోజక వర్గ వైసిపిలో జరుగుతోంది ఇంకోటి.. పార్టీ లైన్ దాటి మరీ రచ్చ చేస్తున్నారు. దీంతో కేడర్ తెగ ఇబ్బంది పడుతున్నారట. వరుసగా ఎవరికి వారు సమావేశాలు పెట్టడంతో ఎటు పోవాలో అర్థం కావడం లేదట. ఇదంతా కేవలం నియోజకవర్గ ఇంచార్జిని మార్చడం వల్లే జరిగిందా. నియోజకవర్గ ఇంచార్జిని మార్చి జగన్ తప్పులో కాలేశారా.. మూడు గ్రూపులు ఆరు వర్గాలతో ఆ నియోజక వర్గ వైసిపి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయిందా.. ఇంతకీ ఆ నియోజక వర్గం ఏంటి.. ఈ పరిస్థితికి కారణం ఎవరు.. వాచ్ దిస్ స్టోరీ.

గతేడాది వరకు సభాపతి స్థానంలో కూర్చున్న తమ్మినేని సీతారాం ఒకవైపు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ సీపీ అధినేత ఏరికోరి తెచ్చుకున్న నియోజక వర్గ ఇన్చార్జి చింతాడ రవి కుమార్ ఇంకొక వైపు.. ఈ ఇద్దరి నేతల మధ్య శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అసెంబ్లీ నియోజక వర్గ వైసిపి కేడర్ నలిగిపోతోంది. మూడు నెలల క్రితం జగన్ ఆదేశాలతో చింతాడ రవి కుమార్ ఆమదాలవలస వైసీపీ సమన్వయ కర్త బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఎందుకు తప్పించారు అనేది వైసీపీలో ఎవరికి అర్ధం కాలేదు. తమ్మినేని కి శ్రీకాకుళం పార్లమెంట్ వైసీపీ ఇంచార్జి గా నియమించినప్పటికీ జిల్లా అధ్యక్షుడుగా మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ కొనసాగుతున్నారు. Srikakulam Constituency In-charge.

అయితే తమ్మినేని పూలు అమ్మిన చోట కట్టెలు అమ్ముకోలేక తన నలభై ఏళ్ల ఆమదాలవలస రాజకీయ పునాదులు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారట. ఇక చింతాడ రవి కుమార్ కు మద్దతు ఇచ్చి ప్రక్కన కూర్చొని బెట్టుకోలేక, తన వర్గం నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు తమ్మినేని. దీంతో ప్రస్తుత నియోజకవర్గ ఇంచార్జి చింతాడ రవి కుమార్ ఎటూ తేల్చుకోలేక పోతున్నారట. తమ్మినేని ప్రత్యేక సమావేశాలతో తనకు మద్దతు తగ్గిందని భావిస్తున్న చింతాడ, జనంలోకి వెళ్లలేక పోతున్నారట. పార్టీ ఇచ్చిన పదవికి న్యాయం చేయాలని తపన పడుతున్నా, తమ్మినేని వర్గంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చింతాడ. అంతేకాదు, తనకంటూ ప్రత్యేకత ఉండాలని ఫీలైన చింతాడ రవి, తన వర్గంతో ఇప్పుడు ప్రత్యకంగా మీటింగ్స్ పెడుతున్నారట.

ఈ ఇద్దరి తీరుతో సగటు వైసీపీ కార్యకర్తకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుందన్న ప్రచారం ఆముదాలవలస నియోజకవర్గంలో జరుగుతోంది. వీరిద్దరి పంచాయితీ ఏ స్తాయికి వెళ్లిందంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలను అటు తమ్మినేని, ఇటు చింతాడ వేర్వేరుగా జరిపే వరకూ పోయింది. దీంతో ఎవరి మీటింగులో పాల్గొనాలో అర్థంకాక కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారట. నియోజక వర్గ ఇంచార్జిని పార్టీ అధిష్టానం తొందరపడి మార్చిందన్న ఫీలింగులోకి స్తానిక నేతలు వెళ్లిపోయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

వీరిద్దరి పంచాయితీ తెల్సుకున్న పార్టీ అధిష్టానం, చింతాడకు సహకరించాలంటూ తమ్మినేనికి ఆదేశాలు జారీ చేసింది. అయినా తమ్మినేని తీరు మారలేదట. దీంతో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. చింతాడ రవిని ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పిస్తారా, లేక తమ్మినేని సీతారాంని బుజ్జగించి దారిలోకి తెచ్చుకుంటారా అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/the-high-command-has-appointed-former-narsaraopet-mla-dr-gopireddy-srinivasa-reddy-as-the-working-president/