అంత మొండిగా వెళ్తోన్న అదికారి ఎవరు..?

Tiruchanoor Stubborn official: టీటీడీ భద్రతా విభాగంలోని కొందరు అధికారుల నిర్ణయాలు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఓ అధికారి ఏకపక్ష నిర్ణయాలపై భక్తులు మండిపడుతున్నారు. ఇంతకీ అంత మొండిగా వెళ్తోన్న అదికారి ఎవరు. స్తానికులు, భక్తులకు ఎందుకు ఆయన నిర్ణయాల మీద కోపం వస్తోంది.

శ్రీవారి పట్టపురాణి కొలువైన తిరుచానూరులో కొందరు అధికారులు వివాదాస్పద నిర్ణయాలు తీసుకింతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం ముందున్న టికెట్ కౌంటర్ తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తిరుగు ప్రయాణంలో తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే భక్తుల సౌకర్యార్థం అమ్మవారి ఆలయం ముందు టీటీడీ ఏర్పాటు చేసిన సుపథం, కుంకుమార్చన, వీఐపీ బ్రేక్, ఇతర సేవా టికెట్ల విక్రయ కౌంటర్ తాత్కాలికంగా మూసివేశారు. Tiruchanoor Stubborn official.

గతంలో టీటీడీ ఈవో, జేఈవోలు అనేక దఫాలుగా ఆలయ అధికారులతో సంప్రదించాకే ఈ కౌంటర్ ప్రారంభించారు. వృద్ధులు, వికలాంగులు, ప్రముఖుల వెంట వచ్చేవారు ఆర్జిత సేవా టికెట్ పొందేందుకు సులువుగా ఈ కౌంటర్ ఉంది. అటువంటి కౌంటర్ను టీటీడీ భద్రతా విభాగంకి చెందిన ఓ ఏవీఎస్వో ఈ కౌంటర్ తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కౌంటర్ అంశం తన పరిధిలో లేకపోయినా, మూసివేయాలంటూ సిబ్బందికి హుకుం జారీ చేశారట. దీంతో నాలుగైదు రోజుల నుంచి కౌంటర్ తెరవడం లేదు. అధికారి సంగతెలా ఉన్నా, కౌంటర్ ఎందుకు మూసివేశారన్న భక్తులు, స్తానికుల ప్రశ్నకు సమాధానం చెప్పలేక సిబ్బంది నానాపాట్లు పడుతున్నారట.

మరోవైపు ఆలయ సన్నిధి వీధిలోకి వాహనాలు రాకుండా సిబ్బంది ద్వారా అడ్డుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కావాల్సిన స్థలాన్ని స్థానికులు గతంలో టీటీడీకి అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామస్థులు, టీటీడీ మధ్య స్నేహపూర్వక వాతావారణం కొనసాగుతోంది. స్థానికులు తమ వాహనాలను సన్నిధివీధిలో పార్కింగ్ చేస్తున్నారు. అయితే ఆ అధికారి అందుకు ఒప్పుకోవడం లేదట. తమకు పార్కింగ్ స్థలం లేకుండా సిబ్బంది గేట్లకు తాళాలు వేసేందుకు ప్రయత్నించడంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

సున్నితంగా వ్యవహరించాల్సిన అంశాన్ని ఆయన వివాదాస్పదం చేయడంపై స్థానికులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆలయం ముందున్న టికెట్ కౌంటర్ కూడా యధావిధిగా కొనసాగించాలని స్తానికులు కోరే అవకాశం ఉందట. ఇక ఆర్జితం టికెట్ కౌంటర్ ఆలయం ముందుండడం, అటు ప్రక్కనే వాహన మండపం ఉండడం వలన కొంత భద్రత పరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయంటూ విజిలెన్స్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కౌంటర్ అక్కడి నుంచి తొలగించాలని ఆలోచన చేసినట్లు విజిలెన్స్ సిబ్బంది చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/he-represented-the-kurnool-constituency-of-andhra-pradesh-and-is-a-member-of-telugu-desam-party/