
Kaikala Satya Narayana Biography: ప్రతినాయకుడిగా, హాస్య నటుడిగా, సహనటుడిగా.. ఇలా తెరపై నవరసాలు పలికించి వెండితెరని రాజసంగా ఏలి.. సినీ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. బీభత్సం… భయానకం.. హాస్యం.. కరుణ.. ఇలా ఏదైనా అలవోకగా నటించడం కైకాలకే సొంతం. విలనిజంలో రాజనాల తర్వాత, యముడి పాత్రల్లో అచ్చంగా పోలే ఎస్వీ రంగారావు తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది కైకాలనే..
ఇటు చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాల్లో, ఫాంటసీ పాత్రల్లో తనదైన శైలితో మెప్పించిన గొప్ప నటుడాయన. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 850 చిత్రాల్లో నటించి దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆయనే కైకాల సత్యనారాయణ… నిన్న(డిసెంబర్ 23న) ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో నిన్న ఉదయం నాలుగు గంటలకు కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయన సినీ నట ప్రస్థానం గురించిన విశేషాలను ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం: Kaikala Satya Narayana Biography.
నేపథ్యం..
1935 జులై 25న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కౌతవరంలో జన్మించారు కైకాల సత్యనారాయణ. గుడ్లవల్లేరులోని హైస్కూల్, విజయవాడ, గుడివాడలలో కాలేజీ విద్య పూర్తి చేశారు. ఈయనకు నాటకాల మీద విపరీతమైన ఇష్టం ఉండేది. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో వివిధ నాటక సంస్థల తరపున రాష్ట్రమంతా పర్యటించే అవకాశం దక్కింది. దీంతో ‘పల్లె పడుచు’, ‘బంగారు సంకెళ్లు’, ‘ప్రేమ లీలలు’, ‘కులం లేని పిల్ల’, ‘ఎవరు దొంగ’ వంటి పలు సాంఘిక నాటకాల్లో ముఖ్య పాత్రలు చేసి అందర్నీ మెప్పించారు.
డిగ్రీ చదివినా, ఉద్యోగం మాత్రం రాలేదు. దీంతో రాజమహేంద్రవరంలో కలప వ్యాపారం చూసుకోవడం కోసం కొంతకాలం అక్కడే ఉన్నారు. స్నేహితుడి సలహా మేరకు సినిమాల్లో ప్రయత్నాలు చేసేందుకు మద్రాసు పయనమయ్యారు. ఎప్పటికైనా మంచి నటుడిగా ఎదగాలనేది ఆయన కల.
సినీరంగంలోకి…
అలా మద్రాసుకు చేరుకున్న ఈయన ప్రసాద్ ప్రొడక్షన్స్ సంస్థలో సహాయ కళాదర్శకుడిగా తొలి అడుగు పడింది. ‘కొడుకులు- కోడళ్లు’ అనే సినిమా కోసం దర్శక- నిర్మాత అయిన ఎల్.వి.ప్రసాద్, సత్యనారాయణకు స్క్రీన్ టెస్టులు చేసి ఓకే చేశారు. ఏమైందో ఏమో ఆ సినిమా స్టార్ట్ అవ్వలేదు. అయితే ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. మరో ప్రముఖ దర్శక-నిర్మాత అయిన కె.వి.రెడ్డిని కలిశారు. ఆయన కూడా మేకప్, వాయిస్, స్క్రీన్ టెస్ట్‌లన్నీ చేసి కూడా అవకాశం ఇవ్వలేకపోయారు. అలా ఆయన తీసిన ‘దొంగరాముడు’లో ఆయనకు దక్కాల్సిన పాత్ర ఆర్. నాగేశ్వరరావుకు దక్కింది. నటనపై సత్యనారాయణకున్న మక్కువను చూసి చివరకు దేవదాసు చిత్ర నిర్మాత డి.ఎల్. నారాయణ ‘సిపాయి కూతురు’ చిత్రంలో అవకాశమిచ్చారు. అదే ఆయన నటించిన తొలి సినిమా. కానీ ఆశించిన స్థాయిలో విజయం దక్కించుకోలేదు. అయితే అవకాశాల కోసం చూసి చూసి, చేసేదేమీ లేక మూడు సంవత్సరాల కాంట్రాక్టు మీద ఓ పనికి కుదిరారు.
ఇక మరో సంస్థలో పనిచేసే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు అవకాశాలు లేకపోవడంతో కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్‌కు డూపుగా నటించడానికి ముందుకొచ్చారు. ఆయన డూపుగా చేసిన సత్యనారాయణను మెచ్చిన ఎన్టీరామారావు,1960లో వచ్చిన ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’లో అతిథి పాత్రలో అవకాశమిచ్చారు. ఆ తర్వాత సత్యనారాయణ టాలెంట్ గుర్తించి ‘కనకదుర్గ పూజా మహిమ’లో సేనాధిపతి పాత్ర ఇచ్చారు. ఇది సత్యనారాయణ కెరీర్‌ను నిలబెట్టింది. అప్పుడే ఆయనకు నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది. చిన్నాచితకా అంటూ పాత్రలతో సంబంధం లేకుండా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఆయన అందిపుచ్చుకున్నారు.
కొంత గ్యాప్ వచ్చినా, 1962 నుంచి వరుస అవకాశాలు వచ్చాయి. ‘స్వర్ణగౌరి’లో శివుడిగా, ‘మదన కామరాజు కథ’లో ధర్మపాలుడిగా, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో కర్ణుడిగా, ‘నర్తనశాల’లో దుశ్శాసనునిగా నటించి, మెప్పించారు. ‘అగ్గి పిడుగు’లో రాజనాల ఆంతరంగికునిగా, ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’లో ప్రాణ్ గెటప్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ‘శ్రీకృష్ణావతారం’, ‘కురుక్షేత్రం’లో సుయోధనుడిగా, ‘దాన వీర శూరకర్ణ’లో భీమునిగా, ‘సీతా కల్యాణం’లో రావణాసురుడిగా ఇలా విభిన్న పాత్రల్లో నటించారు. కేవలం పౌరాణిక పాత్రలకే అంకితం కాకుండా, సాంఘిక చిత్రాల్లోనూ నటించి మనసుల్ని గెలుచుకున్నారు. ‘ప్రేమనగర్’లో కేశవ వర్మ పాత్ర.. ‘అడవి రాముడు’, ‘వేటగాడు’ సినిమాల్లో విభిన్నమైన విలన్ పాత్రలు పోషించారు.
ఎస్వీఆర్ తర్వాత అంతటి స్థాయిలో గంభీరమైన పాత్రలు పోషించగలనని ఆయన నటనతో నిరూపించుకున్నారు. పౌరాణికం, జానపదం, సాంఘిక చిత్రాల్లో ఆయనకు బలమైన పాత్రలు దక్కాయనే చెప్పాలి.
‘గూండా’, ‘గ్యాంగ్ లీడర్’, ‘సమర సింహారెడ్డి’ వంటి సినిమాల్లో బాధ్యతాయుతమైన పోలీసు అధికారిగా నటించి, సినిమాకే హైలెట్ గా నిలిచారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున ఇలా అగ్ర హీరోలందరి సినిమాల్లో ప్రతినాయకుడిగా చేశారు. రావుగోపాలరావుతో కలిసి విలన్‌గా పలు సినిమాలు చేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలైనా.. తండ్రిగా, తాతగా, ఇంటి పెద్దగా.. కనిపించారు
ఆయన నటనతో పాటు నిర్మాతగానూ కొన్ని సినిమాలు చేశారు. రమా ఫిలిమ్స్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి.. ‘గజదొంగ’, ‘ఇద్దరు దొంగలు’, ‘కొదమ సింహం’, ‘బంగారు కుటుంబం’, ‘ముద్దుల మొగుడు’ వంటి చిత్రాలను తీశారు.
‘పాండవ వనవాసం’లో ఘటోత్కచుడిగా, ‘ఉమ్మడి కుటుంబం’ సినిమాలో ఎన్టీఆర్‌కు అన్నగా, ‘వరకట్నం’లో కృష్ణకుమారికి అన్నగా చేశారు. ‘శారద’తోనే తన నటజీవితం మలుపు తిరిగిందని చెప్పేవారు.
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అత్యధికంగా 49 చిత్రాల్లో నటించారు. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో 35 సినిమాలు చేస్తే, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 34 చిత్రాలు చేశారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో 11 సినిమాల్లో మెరిశారు.
1960- 90 మధ్య కాలంలో వెండితెరపై ఆయన హవా నడిచింది. 1980- 85ల మధ్య కాలంలో ఆయన నుంచి దాదాపు వంద వరకు చిత్రాలొస్తే.. అందులో ఒక్క 1984లో విడుదలైనవే దాదాపు 30కి పైగా ఉన్నాయంటే.. ఆయనకు అప్పట్లో ఉన్న డిమాండ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
గుర్తింపు…
ఆయన కెరీర్లో చిన్నా, పెద్దా వేషాలు అన్ని కలిపి 800లకు పైగా పాత్రలు పోషించారంటే అతిశయోక్తి కాదు. దాదాపు 200మంది దర్శకులతో పనిచేశారు. ఇందుకుగాను ‘కళా ప్రపూర్ణ’, ‘నవరస నటనా సార్వభౌమ’ లాంటి ఎన్నో బిరుదులు అందుకున్నారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం సత్యనారాయణకు గౌరవ డాక్టరేటును ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది.
ఇతరాంశాలు…
ఎల్.వి. ప్రసాద్‌గారు తీయబోతున్న కొత్త సినిమా ‘కొడుకులు-కోడళ్లు’లో అవకాశం రావడంతో మద్రాసుకు వెళ్లి ఎల్వీ ప్రసాద్ గారిని కలిశారు సత్యనారాయణ. అన్ని టెస్ట్ లు చేసి, సినిమా మొదలవడానికి ఇంకా సమయం పడుతుందనడంతో చేసేది లేక, సుమారు 15 రోజులపాటు పార్కులోనే గడిపారట. పగలంతా అవకాశాల కోసం తిరగడం… సాయంత్రానికి పార్కులో పడుకోవడం ఇదే దినచర్య. ‘ఆ సమయంలో నేను ఎంతో బాధపడ్డాను. ఎంత కష్టమైనా సరే ఖాళీ చేతులతో మాత్రం తిరిగి ఊరికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారట’.
యముడి పాత్రలకు పెట్టింది పేరు…
‘‘ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ‘యమగోల’ సినిమాలో మొదటిసారి యముడి పాత్రలో నటించారు. తర్వాత చిరంజీవితో ‘యముడికి మొగుడు’, ‘పిట్టలదొర’, ‘యమలీల’, ఇలా ఏ సినిమాలోనైనా యముడి పాత్ర వేయాలంటే ఆయన్నే తీసుకునేవారు. జూ.ఎన్టీఆర్ ‘యమదొంగ’లోనూ అవకాశం వచ్చినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల అది చేయలేకపోయారట.
- ఎన్టీఆర్- కైకాల సత్యనారాయణలది అప్పట్లో సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పుకోవాలి. ‘దానవీర శూర కర్ణ’, కృష్ణ ‘కురుక్షేత్రం’ పోటాపోటీగా తెరకెక్కాయి ఆ రోజుల్లో.. ఏ ఒక్క చిత్రంలో నటించిన వారు మరో చిత్రంలో నటించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ.. రెండింటిలోనూ నటించి సత్తా చాటారు. వందకు పైగా చిత్రాల్లో రామారావుతో కలిసి తెరను పంచుకున్నారు. ‘‘నువ్వు నంబర్ వన్ విలన్‌వి’’ అని ఎన్టీఆర్ సైతం ప్రశంసించారు.
- ‘కర్మ’ అనే హిందీ సినిమాలోనూ నటించారు. ఆ చిత్రం సెట్లో కైకాల నటనని చూస్తూ ‘నీలో అశోక్‌కుమార్… సంజీవ్ కుమార్… శివాజీ గణేశన్ ముగ్గురూ ఉన్నార’ని కైకాలని మెచ్చుకున్నారు ఆ చిత్ర దర్శకుడు సుభాష్ ఘయ్.
- తెలుగుదేశం తరపున 1996లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై రాజకీయాల్లోనూ ఆయన కొనసాగారు.
- అన్ని విధాలా అర్హులైనప్పటికీ కైకాలకి కేంద్ర ప్రభుత్వం ‘పద్మ పురస్కారం’ ఇవ్వలేదు. వాటిని ప్రకటించిన ప్రతిసారీ ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. దాదాపు 223 సినిమాలు శతదినోత్సవాలు సైతం జరుపుకున్నాయి. ఇప్పటికే 870 చిత్రాలు చేశారు. వెయ్యి చెయ్యలేకున్నా.. కనీసం తొమ్మిదొందలైనా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారట.. కానీ తర్వాత ఆయన నుంచి మరో ఐదు చిత్రాలే వచ్చాయి. తన మనవళ్లలో ఒకరిని తన నటవారసుడిగా చూడాలనుకున్నారు.
- కేవలం యముడుగానే కాక అనేక పౌరాణిక.. రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు.. పాత్రలు పోషించి నవరస నటసార్వభౌమగా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిన ఆయన జీవితం అజరామరం!