బిగ్ బాస్ సీజన్-9 లోకి ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్..!

Bigg Boss Season 9: బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 9వ సీజన్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. సెలబ్రిటీలు వర్సెస్ కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్న పోటీ ఊహించిన దానికంటే ఎక్కువగా రసవత్తరంగా మారింది. నామినేషన్స్, కెప్టెన్సీ టాస్క్‌లు, ఇతర సవాళ్లలో కామన్ మ్యాన్స్ కూడా సెలబ్రిటీలకు ఏ మాత్రం తీసిపోకుండా తమ సత్తా చాటుతున్నారు. అయితే ఈ సీజన్ ప్రారంభం నుంచే చర్చనీయాంశమైన ‘బిగ్ బాస్ 2.O’ వెర్షన్‌కు సమయం ఆసన్నమైంది.

మొదటగా, కామనర్ల కోటాలో దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె హౌస్‌లోకి వచ్చి కొద్ది రోజుల్లోనే మాటలతో పాటు టాస్క్‌లలో తన ప్రతిభను నిరూపించుకుంది. అయితే, ఈ సీజన్‌లో అనూహ్యమైన ఎలిమినేషన్స్ కూడా జరిగాయి. నాలుగు వారాల్లో ముగ్గురు కామనర్స్, ఒక సెలబ్రిటీ హౌస్ నుంచి నిష్క్రమించారు.

సెలబ్రిటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీల కోసం రంగం సిద్ధం:
ఇప్పుడు, బిగ్‌బాస్ హౌస్‌లోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసారి ‘2.O’ వెర్షన్‌లో భాగంగా, మొత్తం సెలబ్రిటీలను వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌లుగా పంపాలని బిగ్‌బాస్ టీమ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఐదవ వారం చివర్లో ఈ కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండే అవకాశం ఉంది. ఈ లిస్ట్‌లో ప్రముఖ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి:

సింగర్ సాయితేజ్

టెలివిజన్ నటి సుహాసిని

అలేఖ్య చిట్టి పికిల్స్

దివ్వెల మాధురి

వీరితో పాటు, టాలీవుడ్‌లో సుపరిచితుడైన కమెడియన్ ప్రభాస్ శీను కూడా హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం.హాస్యనటుడిగా ప్రేక్షకులను మెప్పించిన ప్రభాస్ శీను, ‘విక్రమార్కుడు’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘గబ్బర్ సింగ్’ వంటి వందల సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు శీను మంచి స్నేహితుడు. వారు ఇద్దరూ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సహచరులు. హీరోగా ప్రభాస్ బిజీ అయిన తర్వాత, ఆయన డేట్స్, పర్సనల్ అసిస్టెంట్ పనులను కూడా శీనునే చూసుకుంటున్నారు. Bigg Boss Season 9.

ఇటీవల ‘సింగిల్’ సినిమాతో ప్రేక్షకులను నవ్వించిన శీను, ప్రస్తుతం మరో రెండు, మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ బిజీ షెడ్యూల్‌లో బ్రేక్ తీసుకుని ఆయన బిగ్‌బాస్ సీజన్-9లో అడుగుపెడతారా లేదా అనే విషయం మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఒకవేళ ఆయన హౌస్‌లోకి వస్తే, తన కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌కి డోస్ ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పవచ్చు.