పవన్ సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసిన మల్లారెడ్డి.!

Malla Reddy Pawan Kalyan: మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. “పాలమ్మిన, పూలమ్మిన” అనే ఒకే ఒక డైలాగ్‌తో ఆయన అపార‌మైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో సైతం రీల్స్‌తో బాగా ప్రాచుర్యం పొందింది. సాధారణంగా రాజకీయ నాయకులకు లేని విధంగా, మల్లారెడ్డికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న మైక్ ప‌ట్టుకుంటే చాలు, మాట్లాడే తీరు, చేసే ఫన్నీ కామెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇటీవల మల్లారెడ్డి తన కళాశాలల్లో సినీ ఈవెంట్లను నిర్వహించడం ద్వారా కూడా మరింత పాపులర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో, జనాల్లో ఆయనకు ఉన్న ఈ ఫాలోయింగ్‌ను సినిమాల్లో వాడుకోవాలని పలువురు సినీ మేకర్స్ భావించారు. అయితే, మల్లారెడ్డి ఈ ఆఫర్‌లను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న తన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఒక పాత్ర కోసం మల్లారెడ్డిని సంప్రదించారు. ఆయ‌న ఆఫీస్‌లో దాదాపు గంట పాటు వేచి చూశారని మల్లారెడ్డి తెలిపారు.ఈ పాత్ర కోసం ఏకంగా ₹3 కోట్ల పారితోషికం ఇస్తామని హరీష్ శంకర్ ఆఫర్ చేసినా, మల్లారెడ్డి దానిని సున్నితంగా తిరస్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌దైన శైలిలో కామెంట్ చేశారు: “సినిమాలో ఫస్టాఫ మొత్తం నేను ఆయ‌న్ను తిడతాను, సెకండాఫ్ లో ఆయ‌న నన్ను తిడతాడు, కొడతాడు. ఇదంతా నాకు ఎందుకని” ఆ ఆఫర్‌ను వద్దనుకున్నానని వివ‌రించారు.

పవన్ కళ్యాణ్ సినిమా, అందులోనూ హరీష్ శంకర్ వంటి బడా దర్శకుడు అడిగితే ఎవరైనా సరే వెంటనే ఒప్పుకుంటారు. కానీ, ₹3 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ను కూడా వదులుకున్నారంటే, మల్లారెడ్డి డబ్బుకు లొంగే వ్యక్తి కాదని స్పష్టమవుతోంది. అయితే, సినిమాలో నటించకపోవడానికి గల కారణాన్ని ఆయన ఫన్నీగా వివరించిన వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. Malla Reddy Pawan Kalyan.

‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రవిశంకర్ ఎలమంచిలి, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన షూటింగ్‌ను పూర్తి చేయగా, డిసెంబర్ నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, ఫస్ట్ కాపీని సిద్ధం చేసి, ఆ తర్వాత విడుదల తేదీని నిర్ణయించేందుకు హరీష్ శంకర్ సన్నాహాలు చేస్తున్నారు.