మహేష్ – రాజమౌళి.. ‘ఈసారి ‘నాటు నాటు’ ను మించేలా.!

Mahesh Rajamouli SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో SSMB 29 పేరుతో ఓ ప్రాజెక్ట్ వస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత పాన్ వరల్డ్ రేంజ్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇంటర్నేషనల్ లెవల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబుతో రాజమౌళి తొలిసారి పనిచేస్తుండటంతో, ఈ ‘SSMB29’పై మొదటి నుంచీ అంచనాలు ఆకాశాన్నంటాయి.

ఈ చిత్రం గురించి వచ్చే ప్రతి చిన్న సమాచారం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా, SSMB29కి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ‘RRR’ సినిమాలోని “నాటు నాటు” పాట ప్రపంచాన్ని ఊపేసింది. ఆస్కార్ అవార్డును గెలుచుకుని భారతీయ సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది. ఇప్పుడు, అదే స్థాయిలో మహేష్ బాబు కోసం ఒక పక్కా మాస్, ఫోక్ తరహా పాటను రాజమౌళి సిద్ధం చేశారట.

కీరవాణి స్వరపరిచిన ఈ మాస్ బీట్ కోసం కాన్సెప్ట్ డిజైనింగ్ పూర్తయ్యింది. ఈ పాటను త్వరలోనే మహేష్ బాబు, ప్రియాంక చోప్రాపై చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. “నాటు నాటు”కు అద్భుతమైన కొరియోగ్రఫీని అందించిన ప్రేమ్ రక్షిత్ ఈ పాటకూ నృత్య దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాట గనుక అనుకున్న విధంగా వర్కౌట్ అయితే, మరో “నాటు నాటు” స్థాయి మాస్ హిట్‌ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.Mahesh Rajamouli SSMB29.

ప్రస్తుతం, ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో వేసిన వారణాసి నగరాన్ని తలపించే భారీ సెట్‌లో జరుగుతోంది, ఇక్కడే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమా టైటిల్‌ను నవంబర్ 16న ప్రకటించే అవకాశం ఉందనే వార్త నెట్టింట జోరుగా ప్రచారం అవుతోంది. సుమారు 1000 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో పాన్-వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాదిలోపు పూర్తి చేసి, 2027లో విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు.