ఆ డైరెక్టర్ తో మరోసారి న్యాచురల్ స్టార్..!

Nani Shouryuv combination film: న్యాచురల్ స్టార్ నాని ఇప్పటి వరకు 32 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం అతడి 33వ చిత్రం ‘ది ప్యారడైజ్’ షూటింగ్ దశలో ఉంది. ఇటీవ‌ల‌ రిలీజ్ అయిన ‘హిట్ 3’ తో మరో విజయం తన ఖాతాలో వేసుకున్న నాని, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలోను ముందుంటాడు. నిర్మాతగా కూడా తనదైన మార్క్ చూపిస్తూ కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాడు. ‘హిట్’, ‘కోర్ట్’ లాంటి సినిమాలే ఇందుకు ఉదాహరణలు. ఇప్పటి వరకు తన 17 ఏళ్ల కెరీర్‌లో నాని మళ్లీ మళ్లీ పనిచేసిన దర్శకులు మాత్రం మినిమమ్‌గా ఉన్నారు. కొంత కాలంగా నాని కేవలం నలుగురు దర్శకులతో మాత్రమే రిపీట్ సినిమాలు చేశాడు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఐదో దర్శకుడు కూడా చేరనున్నారు.

ఇంద్రగంటి మోహనకృష్ణ.. నానికి ‘అష్టాచమ్మా’తో ఇండస్ట్రీలోకి ప్రవేశం కల్పించిన డైరెక్టర్. తర్వాత ఆయనతో ‘జెంటిల్ మాన్’, ‘వి’ సినిమాలు చేశాడు నాని. ‘నిన్ను కోరి’ తో శివ నిర్వాణ టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీ తర్వాత మళ్ళీ శివ నిర్వాణతో ‘టక్ జగదీష్’ చేశాడు. వివేక్ ఆత్రేయతో ‘అంటే సుందరానికీ’ తర్వాత ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నానితో కలసి పని చేశాడు.శ్రీకాంత్ ఓదెల.. ‘దసరా’తో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ డైరెక్టర్‌తో నాని ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ చేస్తున్నారు. అంతేకాదు, చిరంజీవి హీరోగా ఓ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహించబోతుండగా, దాన్ని నాని నిర్మించనున్నాడు.

నానితో ‘హాయ్ నాన్న’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శౌర్యువ్. ఈ సినిమా భారీ కమర్షియల్ హిట్‌గా నిలవకపోయినా, నానికి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. డీసెంట్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమాతో శౌర్యువ్ పై నానికి నమ్మకం ఏర్పడింది. అందుకే నాని – శౌర్యువ్ కాంబినేషన్‌లో మరో సినిమా చేసేందుకు ముందడుగు వేశారు. తాజా సమాచారం ప్రకారం ఇది పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుందని తెలుస్తోంది. ‘హాయ్ నాన్న’కి పూర్తి భిన్నంగా ఉండే ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్ చేస్తాడు. ఆ సినిమా తర్వాతే శౌర్యువ్ ప్రాజెక్ట్ సెట్స్ మీదికి వచ్చే అవకాశం ఉందని టాక్.

ఇక ప్యారడైజ్ విషయానికొస్తే .. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్ లో నడిచే కథతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మోహన్ బాబు ప్రతినాయకుడిగా నటిస్తుండగా, మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. Nani Shouryuv combination film.

నాని ఇందులో ‘జడల్’ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌లో నాని రెండు జడలతో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి, ముఖ్యంగా ‘దసరా’ వంటి సక్సెస్ తర్వాత ఇదే కాంబోలో వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం 2026 మార్చి 26న విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.