
OG ticket price: పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న వేళ, ఈ సినిమా చుట్టూ పెద్ద వివాదం చెలరేగింది. ఈ నెల సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ఉత్తర్వులు ఇవ్వడంతో వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సినిమా బెనిఫిట్ షో టికెట్ ధరను ఏకంగా రూ. 1000గా నిర్ణయించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ (సర్క్యులర్) విడుదల చేసింది. దీంతో పాటు, పది రోజుల పాటు సాధారణ టికెట్ ధరల్లో కూడా అదనంగా పెంపునకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 125, మల్టీప్లెక్స్‌లలో రూ. 150 వరకు అదనంగా వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వెంటనే పెద్ద చర్చకు దారి తీసింది.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నందున, అధికారాన్ని తన ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారన్న విమర్శలు వినిపించాయి. ప్రభుత్వం జారీ చేసిన ఈ అనుమతులు రాజకీయ ప్రత్యర్థులే కాక, సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున నెగటివ్ రెస్పాన్స్ తెచ్చాయి.వైసీపీ నేతలు, కొంతమంది నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ.. “రాష్ట్రంలో రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర లేక ఆవేదనలో ఉంటే, మూడు గంటల సినిమాకు వెయ్యి రూపాయల టికెట్ ఏమిటి?”, “పవన్ కళ్యాణ్ తన రాజకీయ హోదాను సినిమాల కోసం వాడుకుంటున్నారంటూ” వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. OG ticket price scandal.
“పుష్ప 2, గేమ్ చేంజర్, కల్కి 2898 ఏడి” లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు పెరగడమైతే సమంజసమే. కానీ ‘ఓజీ’ లాంటి సాధారణ బడ్జెట్ చిత్రానికి ఈ స్థాయి పెంపు అవసరమా? ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. అంతంత రేట్లు పెంచేస్తే సామాన్య ప్రజలు సినిమా ఎలా చూడాలని నిలదీస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం అటు సోషల్ మీడియాతో పాటూ ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. మరి దీనిపై ఓజి మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..