
Prakash Raj OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడటంతో మేకర్స్ ప్రమోషన్ వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో ఒక్కొటీగా అప్డేట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. తాజాగా చిత్ర బృందం ఒక పెద్ద సర్ప్రైజ్ రివీల్ చేసింది. అదేంటంటే, ఈ సినిమాలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారని అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటి వరకు ప్రకాశ్ రాజ్ ఈ చిత్రంలో ఉన్నారని ఎక్కడా బయటపడలేదు. కానీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో, ఆయన పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ప్రకాశ్ రాజ్ ‘సత్య దాదా’ అనే పాత్రలో కనిపించనున్నారు. చొక్కా కట్టుతో, కళ్లద్దాలతో సీరియస్ లుక్‌లో ఉన్న ఆయన ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ క్యారెక్టర్ సినిమాలో చాలా ముఖ్యమైనదని అర్థమవుతోంది.
అయితే ఓజీలో ప్రకాష్ రాజ్ ను తీసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా తరచూ విమర్శించే ప్రకాశ్ రాజ్‌నే ఈ సినిమాలో ఎందుకు తీసుకున్నారని ఫ్యాన్స్ మూవీ టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, ప్రకాశ్ రాజ్ గతంలో సుస్వాగతం, బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు, వకీల్‌సాబ్ వంటి హిట్ చిత్రాల్లో కలిసి పనిచేశారు. కానీ రాజకీయాల్లోకి పవన్ అడుగుపెట్టిన తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. పవన్ జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ప్రకటించిన తర్వాత ప్రకాశ్ రాజ్ తరచూ ఆయన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. పవన్ మాట్లాడిన కొన్ని హిందుత్వ సంబంధిత అంశాలపై కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇలా వీరిద్దరి మధ్య రాజకీయ భావజాలం తారతమ్యం పెద్ద దూరాన్ని తెచ్చింది. Prakash Raj OG.
అయితే సినిమా వేరు, రాజకీయం వేరు అనే భావనతోనే ఈ కలయిక జరిగిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత విభేదాలు సినిమాలపై ప్రభావం చూపకూడదన్న అటిట్యూడ్‌తోనే పవన్, ప్రకాశ్ రాజ్ కలిసి ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసి ఉండొచ్చని అంటున్నారు. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య తన డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి వంటి నటులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.