నాని – సుజీత్ సినిమాలో స్టార్ హీరో.!!

Prithviraj Nani Sujeeth: ఇటీవలి కాలంలో ఒక భాష‌లో స్టార్‌గా వెలుగుతున్న న‌టులు ఇతర భాషా చిత్రాల్లో విల‌న్ లేదా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ పాత్ర‌లు పోషించ‌డం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. ఈ ట్రెండ్‌ను అనుస‌రిస్తున్న వారిలో మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్ ముందు వరుసలో ఉంటాడు.తొలి నాళ్ల‌లో ‘పోలీస్ పోలీస్’ లాంటి చిత్రాల‌లో విల‌న్‌గా న‌టించిన పృథ్వీరాజ్‌.. ఆ త‌రువాత స్టార్ హీరోగా ఎదిగారు. ముఖ్యంగా, క‌రోనా స‌మ‌యంలో విడుద‌లైన ‘జనగణమన’ చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో ఆయ‌న‌కు మంచి ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. అటు ద‌ర్శ‌కుడిగా ఆయ‌న తెర‌కెక్కించిన ‘లూసిఫర్’, ‘ఎల్‌2 ఎంపురాన్’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు కూడా తెలుగులో మంచి విజ‌యం సాధించ‌డంతో, టాలీవుడ్ మేక‌ర్స్ దృష్టి పృథ్వీరాజ్‌పై ప‌డింది.

‘సలార్’ చిత్రంలో ప్ర‌భాస్ స్నేహితుడిగా, విల‌క్ష‌ణ‌మైన విల‌న్‌గా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆయ‌న మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం, దర్శక ధీరుడు రాజమౌళి – మహేశ్‌బాబు కాంబినేష‌న్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్టు SSMB29 లో కూడా పృథ్వీరాజ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తాజాగా, పృథ్వీరాజ్ సుకుమారన్ మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క పాన్ ఇండియా ప్రాజెక్టులో న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. నేచురల్ స్టార్ నానితో సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సుజీత్ చేయ‌బోయే త‌దుప‌రి చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ను తీసుకునే యోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్నార‌ట‌.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్, యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ ప‌తాకాల‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి నిర్మించ‌నున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవల లాంఛనంగా మొదలైంది. నాని ‘ది ప్యారడైజ్’ పూర్త‌వ‌గానే ఈ టీమ్‌తో జ‌త‌క‌ట్ట‌నున్నారు. ఇందులో విల‌న్ పాత్ర కోసం పృథ్వీరాజ్‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. అయితే, ఆయ‌న ఇంకా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారా లేదా అన్న‌ది మాత్రం తెలియాల్సి ఉంది. Prithviraj Nani Sujeeth.

పృథ్వీరాజ్‌కి హిందీలో కూడా మంచి గుర్తింపు ఉండ‌టంతో, ఆయ‌న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో భాగ‌మైతే నార్త్ బెల్ట్‌లో సినిమాకు మంచి క్రేజ్ వ‌స్తుంద‌ని మేక‌ర్స్ ఆశిస్తున్నారు. ‘సలార్ 2’ లో కూడా న‌టించాల్సిన పృథ్వీరాజ్‌.. కేవ‌లం మాలీవుడ్‌కే ప‌రిమితం కాకుండా ప‌లు ఇండ‌స్ట్రీల‌పై దృష్టి సారించి త‌న క్రేజ్‌ను పెంచుకుంటున్నారు. రాజ‌మౌళి సినిమా విడుద‌ల త‌రువాత ఆయ‌న‌కు మ‌రిన్ని అవ‌కాశాలు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.