RC17.. హీరోయిన్ ఫైనల్ చేసిన సుకుమార్

RC17 Heroine Kriti Sanon: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నెలాఖరులోగా చిత్రీకరణ పూర్తవుతుందని చిత్రబృందం భావిస్తోంది. తదుపరి దశలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో సుకుమార్ కూడా తన తదుపరి ప్రాజెక్ట్ RC17 పై దృష్టి సారించారు. సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్ అంటే వెంటనే గుర్తొచ్చేది ‘రంగస్థలం’. చరణ్ చేసిన చిట్టిబాబు పాత్రకు అప్పట్లో అభిమానులు, విమర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన చరణ్, బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్లీ RC17 పేరుతో తిరిగి రాబోతుండటంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కోసం సుకుమార్ కేవలం దర్శకుడిగానే కాకుండా, నిర్మాతగానూ వ్యవహరించనున్నారు. చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ షూట్‌ను పూర్తిచేస్తుండగా, అదే సమయంలో సుకుమార్ RC17 ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్రపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ఈ ప్రాజెక్ట్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఇండస్ట్రీ టాక్. సుకుమార్ రాసిన కథలో హీరోయిన్ క్యారెక్టర్‌కు కృతి పర్ఫెక్ట్‌గా సరిపోతుందని, ఆమెను ప్రత్యేకంగా ఆడిషన్స్ లేకుండానే ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

కృతి సనన్‌కి ఇది టాలీవుడ్‌లో రెండో ఇన్నింగ్స్ అవుతుంది. ఆమె మొదటిసారి మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘1 – నేనొక్కడినే’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది. అనంతరం కొన్ని తెలుగు సినిమాలు చేసిన కృతి, బాలీవుడ్‌లోకి పూర్తిగా షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్లీ సుకుమార్ కారణంగా టాలీవుడ్‌లోకి తిరిగి అడుగు పెట్టనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. RC17 Heroine Kriti Sanon.

ప్రస్తుతం కృతి బాలీవుడ్‌లో వరుసగా స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది. అయినప్పటికీ, సుకుమార్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ బలంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఖాయమనే వార్తలు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.