
Actress B Saroja Devi: అలనాటి నటి, పద్మభూషణ్ గ్రహీత బి.సరోజాదేవి కన్నుమూశారు. 87 ఏళ్ల సరోజాదేవి బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో సరోజాదేవి ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ల వంటి దిగ్గజ నటులతో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1938లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 200కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో అభిమానులను సొంతం చేసుకొన్నారు.
1955లో ‘మహాకవి కాళిదాసు’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సరోజాదేవి.. 1959లో ‘పెళ్లిసందడి’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికంటే ముందు పాండురంగ మహత్యం, భూకైలాస్ ముందుగా విడుదలై గుర్తింపునిచ్చాయి. సీతారామ కల్యాణం, జగదేకవీరుని కథ, శ్రీకష్ణార్జున యుద్ధం, దాగుడు మూతలు, ఆత్మబలం, శకుంతల, దానవీర శూర కర్ణ, అల్లుడు దిద్దిన కాపురం వంటి పలు తెలుగు సినిమాల్లో నటించారు. 1955 నుంచి 1984 మధ్య 29 ఏళ్ల పాటు వరుసగా 161 సినిమాల్లో లీడ్రోల్లో నటించిన ఏకైక నటిగా సరోజాదేవి రికార్డు సృష్టించారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఆమెను 1969లో పద్మశ్రీతో, 1992లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ ఒక్క గాసిప్ కూడా లేకుండా జీవితం గడవడం తన అదృష్టమని చెప్పారు. ఎవరూ తనపై కట్టుకథలు అల్లకపోవడం తాను చేసుకున్న పుణ్యమని గతంలో ఆమె తెలిపారు. Actress B Saroja Devi.
సరోజాదేవి మృతికి పవన్ కల్యాణ్, బాలకృష్ణ సంతాపం
అలనాటి నటి సరోజాదేవి కన్నుమూసిన వార్త తెలియగానే ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ప్రముఖ నటి శ్రీమతి బి.సరోజాదేవి గారు కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 1955 నుంచి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, కన్నడ, తమిళ భాషా చిత్రాల్లో నటించి చిత్ర సీమపై తనదైన ముద్రను వేశారు. భూకైలాస్, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, శకుంతల, దానవీర శూర కర్ణ, ఆత్మబలం లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. శ్రీమతి బి.సరోజా దేవి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.’’ అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తన తండ్రితో 20 సినిమాల్లో నటించిన సరోజాదేవి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒకనాడు ధ్రువతారగా వెలుగొందిన ప్రముఖ నటీమణి “పద్మభూషణ్” బి. సరోజాదేవి గారు పరమపదించారన్న వార్త అత్యంత బాధాకరం. అప్పట్లో తెలుగులో NTR గారితో, తమిళంలో MGR గారితో, కన్నడంలో రాజ్ కుమార్ గారితో ఏకకాలంలో హిట్ పెయిర్ గా వెలుగొందిన ఘనత ఆమెది. మా తండ్రి NTR గారి కాంబినేషన్లో 20 సంవత్సరాల కాలంలో దాదాపు 20 చిత్రాలలో హీరోయిన్ గా నటించారు. ఆయనతో శ్రీరాముడి ప్రక్కన సీతాదేవిగా, రావణాసురుడి ప్రక్కన మండోదరిగానూ నటించిన ప్రత్యేకత ఆమె సొంతం. సరోజా దేవి మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు తీవ్ర విచారకరమైన పరిణామం. ఆమె వెండితెరపై మరియు నిజజీవితంలో చేసిన సేవలు రాబోయే తరాల తారలకు, చలనచిత్ర వర్గాల వారికి స్ఫూర్తినిస్తాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.’’ అని నందమూరి బాలకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు.
సరోజాదేవి తనకు తల్లితో సమానమని కమల్ హాసన్ అన్నారు. ‘‘సరోజాదేవి నన్ను ఎప్పుడు చూసినా ప్రేమగా పలకరించేవారు. నాకు తల్లితో సమానం. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమెతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె ఇక లేరనే వార్త విన్నప్పటినుంచి కన్నీరు ఆగడం లేదు. నేను మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకున్న మా అమ్మకు బాధాతప్త హృదయంతో వీడ్కోలు పలుకుతున్నాను’’ అని కమల్ పేర్కొన్నారు.