భారత్‌కు నీరవ్ మోదీ?

Nirav Modi: బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని ఎట్టకేలకు భారత్‌కు తీసుకురానున్నారు. వచ్చే నెల 23వ తేదీన నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు నీరవ్ మోదీని అప్పగించాలని యూకే ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేయగా.. ఆ ప్రక్రియ ముగింపు దశకు వచ్చినట్లు సమాచారం. ఇక నీరవ్ మోదీని ముంబైలోని హై ప్రొఫైల్ వ్యక్తులను ఉంచే జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది.

భారత్‌లో వ్యాపారాలు చేస్తూ.. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలు రుణాల కింద తీసుకుని.. వాటిని కట్టకుండా ఎగ్గొట్టి దేశం దాటి పారిపోయిన డైమండ్ బిజినెస్‌మెన్ నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో నీరవ్‌ మోదీ అప్పగింత వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నవంబరు 23వ తేదీన నీరవ్‌ మోదీని.. బ్రిటన్ అధికారులు.. భారత అధికారులకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు నేషనల్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇక నీరవ్ మోదీని అప్పగించడానికి సంబంధించిన ప్రక్రియ కోసం భారత ప్రభుత్వం బ్రిటిష్‌ అధికారులకు తాజాగా హామీపత్రం అందించింది.

తాము మినహా మరే ఇతర దర్యాప్తు సంస్థలకు నీరవ్‌ను అప్పగించేది లేదని ఈ లేఖ ద్వారా హామీ ఇచ్చాయి. నీరవ్ మోదీని భారత్‌కు తీసుకురాగానే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలిస్తారని సమాచారం. ఈ జైలులో సాధారణ ఖైదీల సెల్‌లకు దూరంగా హైప్రొఫైల్ ఖైదీల కోసం విశాలమైన ప్రత్యేక సెల్‌లు ఉన్నాయి. వీటిలోనే ఒకదానిలో (బ్యారక్ నంబర్ 12లో) నీరవ్ మోదీని ఉంచుతారని అంటున్నారు. బ్రిటన్ అధికారులు, కోర్టుల సూచనల మేరకు ఈ సెల్‌లో నీరవ్‌కు పలు ప్రత్యేక సౌకర్యాలు కల్పించే ఛాన్స్ ఉంది.

ఇక తనను భారత్‌కు అప్పగించే ప్రక్రియను నీరవ్‌ మోదీ సవాల్‌ చేస్తూ ఇటీవల మరోసారి బ్రిటన్ కోర్టును ఆశ్రయించాడు దర్యాప్తు పేరుతో భారత్‌లోని రకరకాల విచారణ సంస్థలు తనను చిత్రహింసలకు గురిచేస్తాయని ఆ పిటిషన్‌లో నీరవ్ మోదీ తెలిపాడు. . ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాలని కోరడంతో.. ఈ పిటిషన్‌ను లండన్‌ కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. నవంబరు 23వ తేదీన తదుపరి విచారణ సమయంలో నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)కు రూ.6,498 కోట్ల కుచ్చుటోపీ పెట్టాడనే అభియోగాలను వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఎదుర్కొంటున్నారు. ఈ మోసానికి పాల్పడిన అనంతరం నీరవ్ మోదీ నేరుగా బ్రిటన్‌కు పారిపోయాడు. దీంతో 2018లో అతడిని భారత సర్కారు ఆర్థిక మోసం చేసి పారిపోయిన వ్యక్తిగా ప్రకటించింది. నీరవ్‌కు చెందిన దాదాపు రూ.2,598 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిలో రూ.981 కోట్లను బాధిత బ్యాంకులకు అందజేశారు. యూకేలో అతడికి ఉన్న రూ.130 కోట్లు విలువైన ఆస్తులను భారత్‌కు బదిలీ చేయాలనే దానిపై భారత దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. అతడి మోసాల చిట్టాను బ్రిటన్ సర్కారుకు భారత దర్యాప్తు సంస్థలు అందజేశాయి. ఈనేపథ్యంలో బ్రిటన్‌లో 2019 సంవత్సరం మార్చి నెలలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని అక్కడి దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. ఆయా కేసుల విచారణ కోసం అతడిని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ కోర్టులను భారత దర్యాప్తు సంస్థలు ఆశ్రయించాయి. బ్రిటన్‌లోని దిగువ కోర్టుల నుంచి హైకోర్టు దాకా అన్నీ నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలని ఆదేశించాయి. దీంతో చివరకు ఈ అంశం బ్రిటన్ సర్కారు వద్దకు చేరింది.

ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం సెప్టెంబరు 19న కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత దర్యాప్తు సంస్థలు విచారణ నిమిత్తం తనను తీసుకెళ్లి వేధిస్తాయని భయమేస్తోంది అంటూ లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్ కోర్టులో నీరవ్ మోదీ పిటిషన్ వేశాడు. తనను భారత్‌కు అప్పగించొద్దని వేడుకున్నాడు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. అయితే నీరవ్ మోదీకి ఎలాంటి హాని జరగదని, కేవలం ఆర్థిక మోసం, మనీ లాండరింగ్ గురించే అతడిని ప్రశ్నిస్తామని భారత దర్యాప్తు సంస్థలు బ్రిటన్ సర్కారుకు ఇటీవలే హామీ ఇచ్చాయి. నీరవ్‌ విచారణకు వేదికగా నిలువనున్న ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు బ్యారక్ నంబర్ 12 వీడియోలను కూడా 2019, 2020 సంవత్సరాల్లోనే బ్రిటన్ కోర్టులకు భారత దర్యాప్తు సంస్థలు అందించాయి.

ఐరోపా ప్రమాణాల ప్రకారం వాటిలో ఏర్పాటుచేసిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను అక్కడి కోర్టులు కొనియాడాయి. తాజాగా న్యాయ విచారణ సందర్భంగానూ ఈ వీడియోలను వెస్ట్‌ మినిస్టర్ కోర్టుకు అందించినట్లు తెలిసింది. ఈ సానుకూల అంశాల ప్రాతిపదికన నీరవ్‌ను భారత్‌కు అప్పగించేందుకు వెస్ట్‌ మినిస్టర్ కోర్టు పచ్చజెండా ఊపుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ కోర్టులో నీరవ్ దాఖలు చేసిన పిటిషన్‌ నవంబరు 23న విచారణకు వస్తుందని భారత దర్యాప్తు సంస్థల అధికార వర్గాలు తెలిపాయి. ఆ పిటిషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని వెల్లడించారు. Nirav Modi.

నీరవ్ మోదీని భారత్‌కు తీసుకువచ్చిన వెంటనే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. అక్కడ ఇప్పటికే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఖైదీల కోసం నిర్మించిన ప్రత్యేక సెల్‌లో ఆయ‌న‌ను ఉంచనున్నారు. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎన్‌బీ కుంభకోణం కేసు విచారణలో కీలక పురోగతి లభించనుంది.