నేడు గురుపూర్ణిమ.. ఈ పండుగ విశిష్టతలు మీకు తెలుసా..?!

Happy Guru Purnima 2025: అజ్ఞానం నుంచి జ్ఞానంవైపు నడిపించి…
జీవితానికి ఓ అర్థం, పరమార్థం కల్పించే గురువులను పూజించే అత్యంత విశిష్టమైన రోజును ఆషాఢ పూర్ణిమ అంటారు. దీన్నే గురుపూర్ణిమగానూ పిలుస్తాం. ఈరోజున గురువులను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే త్రిమూర్తులను సేవించినట్లేనని మన పురాణాలు చెబుతున్నాయి. గురువును భగవంతుడికీ, భక్తుడికీ మధ్య సంధానకర్తగా పేర్కొంటారు. ఒకేసారి భగవంతుడు, గురువు ప్రత్యక్షమైనప్పటికీ, తొలి వందనం అర్పించేది గురువుకే.. మొదట ఆయనకే ప్రణమిల్లాలని చెబుతున్నాయి మన శాస్త్రాలు.

ఒక్క గురువునే కాదు… గురు పరంపర అంటే… తన గురువూ, గురువుగారి గురువూ… వారి గురువునూ సైతం భక్తిశ్రద్ధలతో ఆరాధించే రోజును గురుపూర్ణిమగా భావిస్తారు. అందుకే ఈరోజున విద్య, విజ్ఞానంతోపాటు జీవితంలో ఒక్కో మెట్టూ ఎదిగేందుకు అడుగడుగునా వెంట ఉండి ఎన్నో అంశాలను నేర్పించిన గురువులనూ, పెద్దలనూ గురుపూజోత్సవం పేరుతో గౌరవించి, శక్తికొద్దీ సత్కరించి, ఆశీస్సులు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ఈ తిథిరోజునే మరో విశేషం ఏంటంటే… ఆదిగురువైన వ్యాసమహర్షి ఇదేరోజున జన్మించాడని ప్రతీతి. అందుచేత ‘వ్యాస పూర్ణిమ’ పర్వదినంగానూ జరుపుకుంటాం. ఈరోజున గురువులను భక్తిశ్రద్ధలతో పూజిస్తే త్రిమూర్తులను సేవించినట్లేనని పురాణాలు చెబుతున్నాయి. వేదమంత్రాలను చతుర్వేదాలుగా..
పంచమవేదంగా స్తుతించే మహాభారతాన్ని ఆయన సృజించి.. సృష్టిలో ఆది నుంచి అంతంవరకు జరిగే వివిధ పరిణామాలు, కాలస్వరూపాన్ని విశదపరిచే అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలూ రచించిన వేదవ్యాసుడు నారాయణసంభూతుడు కాక మరేంటి.. ఇంతటి విశిష్టతలను కలిగిన గురు పూర్ణిమ/ వ్యాస పూర్ణిమ ఈ నెల జులై 10న గురువారం నాడు వస్తుంది.

ఈ సందర్భంగా గురు పూర్ణిమ విశేషాలను తెలుసుకుందాం:
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గురువుకు ప్రతీకగా భావిస్తాం. ‘గు’ అంటే అజ్ఞానం లేదా చీకటి. ‘రువు’ అంటే నశింపజేసేదని అర్థం. గురువు.. అజ్ఞానం అనే అంధకారాన్ని నశింపజేసి వెలుగువైపు నడిపిస్తాడని అర్థం. అందుకే మన భారతీయ సనాతన సంస్కృతి సైతం..
‘మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ!’ అంటూ గురువుకు తల్లిదండ్రుల తరువాత అంతటి విశిష్ట స్థానాన్ని కల్పించింది. ప్రతి వ్యక్తికీ ఆదిగురువు తల్లి అయితే… ఆ తరువాత మంచిచెడుల విచక్షణను తెలియజేసేది గురువు ఒక్కరే. పుట్టినప్పటినుంచీ మరణించేవరకూ ప్రతి దశలోనూ ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు మనిషి.

అలా నేర్చుకునే ప్రతి అంశం వెనుకా ఓ గురువు పాత్ర తప్పక ఉంటుంది. అందుకే మన భారతీయ సంప్రదాయంలో గురువుకీ, గురుపూజకీ అంతటి ప్రాధాన్యం ఉంటుంది. ముక్తివైపు నడిపించే గురువులను ఆషాఢ పౌర్ణమినాడే పూజించీ, గౌరవించడానికీ ఈ రోజును వ్యాస పూర్ణిమగా జరుపుకోవడానికీ వెనుక పురాణ గ్రంథాలు మనకు ఎంతో చెబుతున్నాయి.

వ్యాస మహర్షి పుట్టుక వృత్తాంతం:
ఆదిగురువుగా పిలిచే వ్యాస మహర్షి, వేదవ్యాసుడు… మత్స్యగంధి గర్భమందు, పరాశర మహర్షిలకు జన్మించాడు. మత్స్యగంధి.. దశరాజు పెంపుడు కుమార్తె. చేపలకంపు వల్ల ఆమెకు మత్స్య గంధి అనే పేరు వచ్చింది. అసలు పేరు సత్యవతి. పరాశర మహర్షి ఆమెను మోహించి దుర్గంధమును పోగొట్టి.. ఆపై వ్యాస మహర్షి జన్మకు కారకుడవుతాడు.

వేదవ్యాసుని అసలు పేరు.. కృష్ణ ద్వైపాయనుడు.
వ్యాసుడు పుట్టిన వెంటనే.. పన్నెండేళ్ల ప్రాయానికి ఎదుగుతాడు.. ఆపై తల్లికి నమస్కరించి, తనను స్మరించినపుడు తిరిగి వచ్చి తల్లిని దర్శించుకుంటానని మాట ఇచ్చి, వెళ్లిపోతాడు. సత్యవతి తర్వాత కురువంశ మూలపురషుడైన శంతనుని వివాహం చేసుకుంటుంది.
వ్యాస మహర్షి నాలుగు వేదాలను తన శిష్యుల ద్వారా ప్రపంచానికందించాడు. పైలునికి రుగ్వేదాన్ని, వైశంపాయునికి యజుర్వేదాన్ని, జైమునికి సామవేదాన్ని, సుమంతునికి అధర్వణవేదాన్ని బోధిస్తాడు. పంచమవేదంగా భావించే మహాభారతాన్ని వ్యాసుడే రచించగా, వినాయకుడు స్వయంగా లిఖించటం విశేషం!

లోక కల్యాణార్థం:
వ్యాసుడు వసిష్ఠుడికి మునిమనమడు. శక్తి మహర్షికి పౌత్రుడు. పరాశరుడి పుత్రుడు. తపోనిధి అయిన పరాశరుడు యమునానది దాటడానికి పడవ ఎక్కడమేమిటి? దాటించేందుకు తండ్రి స్థానంలో దశపుత్రి తాను పడవ నడపడమేమిటి? మహర్షి అకస్మాత్తుగా మత్స్య గంధిని మోహించడమేమిటి? తన తపశ్శక్తి ద్వారా ఆమె అభ్యంతరాలన్నిటినీ తొలగించడమేమిటీ? ఆ యమునానదీ ద్వీపంలో ఆమెకు అయాచితంగా పుత్రుడిని ప్రసాదించటమేమిటి? అప్పటికప్పుడే సకల శాస్త్రవేత్త అయిన పుత్రుడు పుట్టుకు రావడమేమిటి? పుడుతూనే తల్లిని విడిచి తపోవనాలకు వెళ్లిపోవటమేమిటి? ఇదంతా వింటుంటే లోకకల్యాణం కోసం లోకాతీతుడ్ని అవతరింపజేసేందుకు జరిగిన మాయలా అనిపిస్తుంది కదూ!

ఆ కారణజన్ముడి జన్మకు ప్రయోజనం మానవాళికి చతుర్విధ పురుషార్థ సాధన రహస్యాలను బహువిధాలుగా బోధించటమే. అందుకే ఆయన జగద్గురువులకే గురువుగా నిలిచిపోయారు. అగమ్యంగా ఉన్న వేదరాశి చిక్కులు విప్పి, వాటిని చక్కబరచి అధ్యయనానికి అనువుగా చతుర్వేదాలుగా విభజించి, వైదిక ధర్మప్రవర్తనం చేసిన ఆది గురువులు.. ఈ వేదవ్యాసుడు.

పంచమవేదమైన భారతేతిహాసం ద్వారా ‘ధర్మాన్ని ఆచరించండి. అన్నీ లభిస్తాయి’ అని పదేపదే ఎలుగెత్తి చాటిన సకల లోకహితైషి సత్యవతేయుడు. అర్థ, కామ, సాధనల విషయాలను విస్తరించి, అనేక నీతి కథల సమాహారంగా అష్టాదశ పురాణాలను అందరికీ అందుబాటులోకి తెచ్చారు వ్యాసుడు. బాదరాయణ బ్రహ్మసూత్రాల ద్వారా వేదాంత సారాన్ని సూత్రీకరించి, మనుషులందరికీ మహత్తర లక్ష్యమైన మోక్ష పురుషార్థాన్ని వివరించారాయన.

ఆయన జన్మించిన ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా జరుపుకోవడం మనకు అనాదిగా వస్తోంది. విద్యాబుద్ధులు నేర్పే గురువులను వ్యాసుడిగా భావించి ఆరోజు పూజించడం ఆనవాయితీగా మారింది.

  • ఈరోజున గురువును పూజించడంతోపాటూ కొందరు ఉపవాసం ఉండేందుకూ ప్రాధాన్యమిస్తారు. అలాగే దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదిశక్తి పేరిట వ్రతాన్ని ఆచరించడం, సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేసుకోవడం వంటి సంప్రదాయాలూ ఉన్నాయి.

Also Read: https://www.mega9tv.com/devotional/the-specialities-of-puri-jagannath-rath-yatra-2025/